ప్రత్యేక కధనం by జర్నలిస్ట్ అన్నమయ్య
మన దేశ ప్రధాని రాష్ట్రానికి వస్తున్నారంటే ఒక ప్రత్యేకమైన ప్రాధాన్యత వుంటుంది. రాష్ట్రంలో ఏదైనా ప్రత్యేకమైన కార్యక్రమంలో పాల్గొనడానికో లేదా కొన్ని ప్రారంభోత్సవాలకో ప్రధాన మంత్రి విచ్చేయడం అప్పుడప్పుడూ జరుగుతూనే వుంటుంది. కానీ, ఈసారి మన భారతదేశ ప్రధాన మంత్రి నరేంద్ర మోదీ తెలుగు రాష్ట్రాలకు ఎందుకు విచ్చేశారు? ఇది సామాన్యులకు సైతం అవగతమైంది. తెలుగు రాష్ట్రాల్లో తమ పార్టీని బలపరచుకునేందుకు. అయితే, ఆయన ప్రధానమంత్రి హోదాలో వున్నారు కాబట్టి గట్టి భద్రతా ఏర్పాట్లు చేశారనుకుందాం. కానీ, గతంలో ఎన్నడూ లేనంతగా ఈసారి భద్రతా ఏర్పాట్లు కనిపించాయి. అడుగడుగునా పోలీసులు కనిపించారు. మూడు గండలపాటు మెట్రో స్టేషన్లను సైతం మూసివేశారు, ట్రాఫిక్ రూల్స్ ని కఠినంగా పాటించారు. ఇదంతా ఎందుకు? ప్రధాన మంత్రి ఆయన హోదాలో ఏదైనా ప్రత్యేకమైన కార్యక్రమలో పాల్గొనేందుకు విచ్చేసారా? అంటే అదీ లేదు. సరే… భీమవరంలో అల్లూరి సీతారామరాజు విగ్రహాన్ని ఆవిష్కరించారు. హఠాత్తుగా అల్లూరివారిపై మోదీకి అంత ప్రేమ ఎందుకు పుట్టుకొచ్చిందనే ప్రశ్న సామాన్యుడి మదిలో ఉదయించక మానుతుందా?
మరో ముఖ్యమైన విషయం ఏమిటంటే, 2024లో బి.జె.పి. అటు ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో గానీ, ఇటు తెలంగాణ రాష్ట్రంలో గానీ ప్రభుత్వాన్ని ఏర్పాటు చేయగలదా? అంటే బి.జె.పి. ఏ సమాధానం చెప్పగలదు? ఎందుకంటే, అటు ఆంధ్రప్రదేశ్ లో గానీ, ఇటు తెలంగాణలో గానీ బి.జె.పి. తరపున ముఖ్యమంత్రి అభ్యర్థి ఎవరనేది స్పష్టత లేదు. పోనీ, బలమైన నాయకులున్నారా అంటే అదీ లేదు. పాఠకులు గమనించాల్సిన ముఖ్యమైన విషయమేంటంటే, ఇది టి.ఆర్.ఎస్.కి అనుకూలమైన వ్యాసం కాదు. వాస్తవాలను అందించేందుకు ప్రయత్నిస్తున్న అంశం. టి.ఆర్.ఎస్. విషయానికొస్తే, ఆ పార్టీ పుట్టిందే ప్రత్యేకంగా తెలంగాణ సాధించాలని. అందుకే, అది ప్రజల అభిమానాన్ని చూరగొంది. అయితే, కొన్ని విషయాల్లో ప్రజల వ్యతిరేకతను సైతం టి.ఆర్.ఎస్. మూట గట్టుకుందనడంలో సందేహం లేదు.
ఇప్పుడిక్కడ గమనించాల్సిన అంశమేంటంటే, తెలంగాణలో టి.ఆర్.ఎస్.పట్ల పుట్టుకొచ్చిన వ్యతిరేకత బి.జె.పి.కి అనుకూలమవుతుందా?
ప్రధాన మంత్రి నరేంద్ర మోదీ వచ్చారు. ఇటు తెలంగాణలో భారీ బహిరంగ సభలో ప్రసంగించారు, అక్కడ అల్లూరి సీతారామ రాజు 125వ జయంతి సందర్భంగా విగ్రహాన్ని ఆవిష్కరించారు. ఇక్కడ చర్చించుకోవాల్సిన మరో ముఖ్యమైన అంశమేంటంటే, పరేడ్ గ్రౌండ్స్ లో ప్రసంగించిన మోదీ కనీసం కె.సి.ఆర్. పేరును కూడా ప్రస్తావించలేదు. పోనీ, అది రాజకీయ ఎత్తుగడ అనుకుందాం. కానీ, ‘మేం అధికారంలోకి వస్తే టి.ఆర్.ఎస్. చేయలేకపోతున్న పలానా పనులను మేము సాధ్యం చేస్తాం…’ అని ఆయన గనక చెప్తే తెలంగాణలో బి.జె.పి. ప్రాబల్యం ఖచ్చితంగా పెరిగి వుండేది. ఇక ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో కూడా ఆయన తాము అధికారంలోకి వస్తే ఈ రాష్ట్ర అభివృద్ధికి పలానా ప్రణాళికలను రూపొందించి సిద్ధంగా వున్నామంటే బావుండేది. సో, మోదీ రావడం, వెళ్లడం ఎలా వుందంటే… రాజుగారు వచ్చారు, వెళ్లారు. నెక్ట్స్ ఏంటీ? అనేదే అన్ని పార్టీల కొశ్చన్.
ప్రత్యేక కధనం by జర్నలిస్ట్ అన్నమయ్య