చిప్స్ ని ఇష్టపడనివారుండరు. పిల్లలైతే మరీనూ… చిప్స్ కొనిస్తేనే చెప్పిన మాట వింటామనీ, చదువుకుంటామనీ బ్లాక్ మెయిల్ చేసే బుడంకాయలు కూడా వుంటారు. కొందరు పిల్లలకు చేతుల్లో చిప్స్ ప్యాకెట్ వుంటే ప్రపంచాన్నే పట్టించుకోరు. ఇక కొందరు పెద్దలైతే చిప్స్ ని ఏ సందర్భంలో తింటారో ప్రత్యేకంగా చెప్పాల్సిన అవసరం లేదు. ఎదుటివారి నోటిలో చిప్స్ కరకరాలుడుంటే మనం కూడా తినాల్సిందేననిపిస్తుంది.
చిప్స్ ప్యాకెట్లో గాలి వుండడం మనకు తెలుసు. ఇది వినియోగదారులను మోసగించడానికేనని చాలామంది అనుకుంటారు. కానీ, ఇలా చిప్స్ ప్యాకెట్లో గాలిని నింపి విక్రయించడానికి ఓ బలమైన కారణం వుంది. ఇంతకీ, ఆ గాలేంటో తెలుసా మీకు?
అది నైట్రోజన్ వాయువు. అదేంటీ, గాలి వుండడమే ఎక్స్ ట్రా అనుకుంటే ఈ నైట్రోజన్ వాయువు నింపడమేంటీ, పోనీ… నింపితే నింపారు. అదేదో ఆక్సిజన్ నింపొచ్చుగా అనుకుంటున్నారా? అలా చేస్తే గనక చిప్స్ పాడైపోతాయిట. నైట్రోజన్ వాయువును నింపితే చిప్స్ పాడైపోకుండా వుంటాయిట. ఎందుకంటే, నైట్రోజన్ వాయువుకి రంగు, రుచి, వాసన వుండవనే విషయం సైన్స్ స్టూడెంట్స్ కి ఖచ్చితంగా తెలిసే వుంటుంది. ఈ కారణంవల్లే నైట్రోజన్ వాయువుని చిప్స్ ప్యాకెట్లలో నింపితే చిప్స్ పాడవకుండా వుంటాయిట.