ప్రస్తుతం కాంగ్రెస్ కేంద్రంలో అధికారంలో లేనప్పటికీ సుదీర్ఘమైన చరిత్ర కలిగి వుండడం, జాతీయ పార్టీ కావడంవల్ల ఆ పార్టీలో ఏ కీలక అంశం జరిగినా అందరి దృష్టీ ఆకర్షించబడుతుంది. ఇక పార్టీ అధ్యక్షురాలు తన అనారోగ్య కారణాల రీత్యా, పార్టీ వరుస పరాజయాలవల్ల అధ్యక్ష పదవిని తన కొడుకైన రాహుల్ గాంధీ కట్టబెట్టాలనుకున్నారు. కానీ, ఆయన ఒప్పుకోకపోవడం, పార్టీలోని సీనియర్లు ఆయనపై ఒత్తిడి తీసుకు రావడం కూడా కొంతకాలం జరిగింది. అయితే, ఇప్పుడు అధ్యక్ష పదవికి సంబంధించిన అంశం మళ్లీ తెరపైకి వచ్చింది.
ఢిల్లీలో ఆగస్టు 28వ తేదీ, ఆదివారంనాడు కాంగ్రెస్ పార్టీ వర్కింగ్ కమిటీ సీడబ్ల్యూసీ సమావేశం జరిగింది. ఈ సమావేశంలో కాంగ్రెస్ పార్టీ అధ్యక్ష ఎన్నికలకు ముహూర్తం ఖరారు చేశారు. అక్టోబరు 17న కాంగ్రెస్ జాతీయ అధ్యక్ష పదవికి ఎన్నికలు నిర్వహించాలని నిర్ణయించారు. ఈ ఎన్నికలకు సెప్టెంబరు 22న నోటిఫికేషన్ విడుదల చేయనున్నారు. కాగా, సీడబ్ల్యూసీ సమావేశానికి కాంగ్రెస్ పార్టీ తాత్కాలిక అధినేత్రి సోనియా గాంధీ, పార్టీ అగ్రనేతలు రాహుల్ గాంధీ, ప్రియాంక గాంధీ వర్చువల్ గా హాజరయ్యారు.
సోనియా వైద్య పరీక్షల కోసం విదేశాలకు వెళ్లగా, ఆమె వెంట రాహుల్, ప్రియాంక కూడా వెళ్లారు. గత ఎన్నికల్లో కాంగ్రెస్ పార్టీ ఘోర వైఫల్యాలు చవిచూడడంతో ఏఐసీసీ అధ్యక్ష పదవికి రాహుల్ గాంధీ రాజీనామా చేశారు. అప్పటి నుంచి సోనియానే తాత్కాలిక ప్రాతిపదికన పార్టీ నాయకత్వ బాధ్యతల్లో కొనసాగుతున్నారు. త్వరలోనే కాంగ్రెస్ పార్టీ అగ్రనేత రాహుల్ గాంధీ భారత్ జోడో యాత్ర చేపడుతున్నారు. సెప్టెంబరు 7న ప్రారంభమయ్యే ఈ యాత్ర కన్యాకుమారి నుండి కశ్మీర్ వరకు సాగనుంది. కాగా, ఈ భారత్ జోడో యాత్ర 12 రాష్ట్రాల గుండా సాగుతుంది. ఈ నేపథ్యంలో, భారత్ జోడో యాత్రకు సంబంధించి ఆయా రాష్ట్రాలకు కాంగ్రెస్ పార్టీ సమన్వయకర్తలను నియమించింది. ఏపీకి డాలీ శర్మ, తెలంగాణకు ఎస్వీ రమణ సమన్వయకర్తలుగా వ్యవహరించనున్నారు.