ఈ రెండింటికీ పొసగదని అంటారు కారణాలేంటి ? మన దగ్గరున్న సోదాహరణలేంటి ?
వ్యాపార బుద్ధికి రాజకీయ బుద్ధికీ అస్సలు పొంతన కుదరదన్న మాట ఇప్పుడే కాదు ఎప్పటి నుంచో ప్రచారంలో ఉంది. రాజకీయం రాజకీయమే- వ్యాపారం వ్యాపారమే. ఈ రెండింటికీ నక్కకీ నాగలోకానికీ ఉన్నంత తేడా ఉంది. ఇక్కడ అవును అక్కడ కాదు- అక్కడ కాదు ఇక్కడ అవును. వ్యాపారంలోని పంచువాలిటీ\ పర్ఫెక్షన్ రాజకీయాల్లో పనికిరాదు. రాజకీయాల్లోని గిమ్మిక్కులు మార్కెట్లో పనికి రావు. ఇక్కడి క్రెడిబిలిటీకీ అక్కడి క్రెడిబిలిటీకీ చాలా చాలా తేడాలుంటాయి.
ఇందుకు తగిన ఉదాహరణలు చాలానే ఉన్నాయి. ఫర్ సపోజ్.. జగన్ మోహన్ రెడ్డి ఒక వ్యాపారిలా ఆలోచించి ఉంటే.. ఎప్పటికీ ఒక పార్టీ పెట్టి ఉండేవాడు కాదు. ఆపై ప్రతిపక్ష హోదా.. నేటి ముఖ్యమంత్రి పదవీ తనతో పాటు ఎందరినో గెలిపించగలిగే సత్తా ఇవేవీ ఆయన వెంట నడిచి ఉండేవి కావు. ఇలా చేస్తే.. అలా అవుతుందేమో.. అలా చేస్తే ఇలా అవుతుందేమో.. అన్న ఆలోచన అస్సలు పనికిరాదిక్కడ. అతడు కష్టాలకు ఎదురెళ్లాలి. ఏటికి ఎదురీదాలి. తీవ్ర స్థాయిలో సమస్యలను ఎదుర్కోవాలి. తనకు తాను ఒక పద్మవ్యూహం సృష్టించుకోవాలి. దాన్ని ఎంతో కష్టపడి చేధించాలి. ఆపై విజయబావుటా ఎగురవేయాలి. జగన్ విషయంలో ఎగ్జాట్ గా ఇదే జరిగిందని చెప్పాలి.
మొన్నంటే మొన్న చూడండీ.. బాబు తన శిష్య రేణువు రేవంత్ రెడ్డి ప్రమాణ స్వీకారానికి వెళ్లనేలేదు. కారణమేంటని చూస్తే.. మనకు మహా వంశీ ద్వారా ఒక రీజన్ వెలికి వచ్చింది. అదేంటంటే.. భయం. ఇప్పటికే పీకలోతు కేసుల్లో ఇరుక్కుని ఉన్న తాను.. మళ్లీ ఇంకో కేసులో ఇరుక్కోవడం ఇష్టం లేక ఆయన ఈ కార్యక్రమానికి గైర్హాజరు కావల్సి వచ్చిందని అంటాడు అణువణువూ పసుపు పుప్పొడి.. నింపుకుని కనిపించే వంశీ.
అది కూడా ఒకందుకు నిజమేననాలి. అక్కడ ఎటు చూసినా ఇండియా కూటమికి సంబంధించిన నాయకులుంటారు. ఆ కూటమికి నేతృత్వం వహించే రాహుల్, సోనియా భుజాలు రాసుకుపూసుకు తిరగడం.. బీజేపీ కేంద్ర నాయకత్వం సునిశితంగా పరిశీలిస్తుంది. దీంతో చెప్పేదేముందీ.. తనను మరింత కష్టాల కడలిలోకి నెడుతుందన్న మాటను సూటిగా సుత్తిలేకుండా చాలా చాలా స్పష్టంగానే సెలవిచ్చాడు.. ఎల్లో ఫెల్లో వంశీ.
మాములుగా బాబుగానీ ఒక అగ్రెసివ్ పొలిటీషియనే అయితే.. ఇలా ఎప్పటికీ చేయడు. ఎవడైతే నాకేంటి? ఏదైతే నాకేంటి? అన్న కోణంలో మరిన్ని కష్ట నష్టాలను ఎదుర్కునేందుకే సిద్ధ పడతాడు. తద్వారా.. బీజేపీకి టార్గెట్ అవుతాడు. అలా అయ్యి.. మళ్లీ జైలుకు వెళ్తాడు. ఈ భయమే ఆయన్ను ఒకడుగు వెనక్కు వేసేలా చేసింది. కానీ ఇక్కడ గుర్తించాల్సిన విషయమేంటంటే.. బాబు జైల్లో ఉండగానే ఆయన పార్టీ ఓటు షేర్ 2- 4 శాతం పెరిగిందని అంచనా వేశాయి.. వివిధ సర్వే సంస్థలు.
ఇక పోతే చిరంజీవి. చిరంజీవి కూడా తన సినిమా బాక్సుల వ్యాపార బుద్ధి కోణంలో.. తన పార్టీ టికెట్లను తెగనమ్ముకున్నాడు. ఇవాళ్టి రోజున ఏపీ, తెలంగాణ వ్యాప్తంగా ఎన్నో థియేటర్ల పేరు ముందు గీత అనే పేరుంటుంది. కావాలంటే చూసుకోండి. ఇదంతా ఆనాడు టికెట్ల అమ్మకాలు కొనుగోళ్ల సమయంలో జరిగిన వస్తుమార్పిడి వ్యవహారానికి సంబంధించిన అంశంగా చెబుతారు సినీ పండితులు.
ఈ విషయం పార్టీలోని పుచ్చలపల్లి మిశ్రా తదితరులకు అర్ధమయ్యి వారు ఒక్కొక్కరూ క్రమంగా తప్పుకోవడం. చిరంజీవి పార్టీ టికెట్లను సినిమా బాక్సులు అమ్ముకున్నట్టు అమ్ముకున్నాడన్న వార్త దావానంలా వ్యాపించడం. చివరికి 180కి పైగా సీట్లు ఆశించగా.. కేవలం 18 అంటే 18 సీట్లకు పరిమితం కావడం.. రెండు తెలుగు రాష్ట్రాల ప్రజలకు తెలిసిందే. ఓటమి పాలయ్యాక.. ఇదే అంశాన్ని ప్రస్తావిస్తూ చిరంజీవి బాధ పడ్డ విషయమూ విధితమే. ఇక ఆయన తమ్ముడు కూడా.. అంతే.. వ్యాపారాత్మక బుద్ధితో ఇవాళ ఒంటరిగా నిలవాల్సిన వాడు.. కాస్తా టీడీపీతో తిరిగి పొత్తు కలిశాడు. దీంతో గ్రౌండ్ లెవల్ సిట్యూవేషనేంటి? ఆజన్మాంతం రెండో జెండా మోస్తూనే ఉండాలా? సాక్షాత్తూ పార్టీ అధ్యక్షుడి సోదరుడ్ని ఓ కార్యకర్త మొహం మీదే అడిగిన స్థితిగతులు.
ఇదేగానీ వ్యాపారమైతే.. పవన్ చేసింది హండ్రెడ్ కి హండ్రెడ్ పర్సెంట్ కరెక్ట్. ఎందుకంటే అక్కడ లాభం చూసుకుంటేనే మనగలుగుతాం. అదే ఇక్కడ నష్టం ఎదుర్కుంటేనే హీరోయిజం ప్రదర్శిచగలుగుతాం. అక్కడ అన్నెం పున్నెం ఎరుగని అమాయకత్వానికి పెద్ద చోటు లేదు. అదే ఇక్కడ ఆ అమాయకత్వానికి ఓట్ల వర్షం కురుస్తుంది. ఇవాళ గానీ పవన్ కళ్యాన్ ఒంటరి పోరాటానికి తన పార్టీ జెండా కట్టుబడేలా చేసి ఉంటే.. ఆ ఉరకలేసే ఉత్సాహమే వేరు. కానీ ఏం చేద్దాం.. పవన్ లోని వ్యాపార బుద్ధి 2014, 19 మధ్య తన నిర్ణయాల ద్వారా వచ్చిన లాభనష్టాలను బేరీజు వేసుకుని ఇలాంటి నిర్ణయం తీసుకోవల్సి వచ్చింది. దీంతో పార్టీ ఆసాంతం.. నిరుత్సాహ భరితం. అందుకు క్షేత్ర స్థాయిలో సెనికులు వర్సెస్ తమ్ముళ్ల మధ్య సాగుతున్న బాహా బాహీ పోరాటాలే సాక్షి.
ఎక్కడో తెలంగాణలో ఉండే వాళ్లు కూడా జగన్ని జైలుకు పంపినపుడు.. అయ్యో పాపం అన్నారు. రేవంత్ రెడ్డి పరిస్థితి కూడా దాదాపు ఇలాంటిదే.. ఆనాటి అర్ధరాత్రి ఆయన్నుబెడ్రూం నుంచి బలవంతానా జైలుకు లాక్కెళ్లిన ఘటన ఇపుడు అందలాన్ని ఎక్కించిన సంఘటనగా అభివర్ణిస్తారు ఆయన బంధుమిత్రులు. ఆఖర్న వాచ్ మెన్ కూడా సరిగ్గా ఇదే చెబుతున్నాడు. దున్నేవాడిదే భూమి ఎలాగో.. కష్టపడ్డవాడితే… రాష్ట్రమనే పీఠ.. భూమి. ఇక్కడ తెలివైన వారికి పెద్దగా అవకాశాలుండవు.. ఇది నిజంగా ఒక తెలివిలేని మూర్ఖుల కార్ఖానా. అందుకే ఎంత పెద్ద పీకే వ్యూహం రచించినా… తనకు కాంట్రాక్టునిచ్చిన ఆ లీడర్ ని ఒక పాపభీతికి లోనయ్యేలా చేసి.. అతడికి ఓటర్లలో మంచి సింపతీని రైజ్ చేస్తాడు.. తప్ప.. తెలివిగల వాడివనిపించుకోమని సూచించనుగాక సూచించడు. అదంతే ఇక్కడదో రూలు. రూలింగ్ లోకి రావాలంటే పక్కాగా పాటించాల్సిన పాఠం.
వ్యాపారాన్ని రాజకీయంలా కూడా చేయకూడదు. అందుకు అతి పెద్ద ఉదాహరణ తిక్కవరపు సుబ్బిరామిరెడ్డి. ఒకప్పుడు టాప్ టెన్ కోటీశ్వరుడు.. నెల్లూరు రెడ్లకే కాదు.. రెండు తెలుగు రాష్ట్రాల్లోని రెడ్లకే ఒక బ్రాండ్ అంబాసిడర్.. ఇవాళొక దివాలా కోరు. ఇంకా ఇలాంటి వాళ్లు చాలా మందే ఉన్నారు. పాలిట్రిక్స్ లోకి బిజినెస్ ట్రిక్స్.. బిజినెస్ ట్రిక్స్ లోకి పాలిట్రిక్స్ అప్లై చేయడం ఖచ్చితంగా చెప్పాల్సి వస్తే అదొక దుస్సాహసమే. ఊకోవయ్యా ఊకో.. కేంద్రంలో బీజేపీ అగ్రనాయకత్వ ద్వయం మోదీ- షాలు పక్కా పొలిటీషియన్స్ అనుకున్నవా ఏంది? ఇద్దరిదీ గుజరాతీ బనియా బుద్ధి అయితే. జనం దగ్గరున్న సొమ్మంతా లాగేసుకోవడం.. తమ ఖజానా నింపుకోవడం. ఈ విషయం పూర్తిగా మరిచిపోయినట్టున్నావ్ చూస్తుంటే.. అంటారు కావచ్చు.
కానీ వీరి వ్యాపారాత్మకతకు ఇక్కడ మతం అనే మానియా తోడయ్యింది. ఆ మతం కోణంలో వారు తాము రాజేయాల్సిన మంట రాజేస్తున్నారు నేటికీ. ఆ ఎమోషన్లో పడి జనం కొట్టుకుపోతూనే ఉన్నారు ఇప్పటికీ. లేకుంటే సెమి ఫైనల్స్ లాంటి.. ఈ ఎన్నికల్లో వారు ఐదింట మూడు రాష్ట్రాలను ఎలా బుట్టలో వేసుకోగలరు? చెప్పండీ అంటారు చాలా మంది. అలాంటి అడిషినల్ క్వాలిఫికేషన్లేవీ లేకుండా నేరుగా రాజకీయాన్ని వ్యాపారంగా మలచడం పెద్ద సాధ్యమయ్యే పని కాదు. ఇవాళ్రేపు కేసీఆర్ ఓటమికి కారణాలేంటి? ఆయన తన అమ్ముల పొదిలోని బ్రహ్మాస్త్రం లాంటి తెలంగాణ సెంటిమెంటును ఎప్పుడైతే వదిలేశారో.. ఆ క్షణమే ఆయనలోని రాజకీయనాయకుడు అక్కడే హతమై పోయాడు.
అష్ట కష్టాల రేవంతుడి వైపే జనం మొగ్గారు. సుఖంగా సంతోషంగా.. హాయిగా దర్జాగా.. జల్సాగా తెలివిగా ఉన్న రాజకీయ నాయకుడు నెగ్గినట్టు చరిత్రలోనే లేదు. లేకుంటే మన పార్టీ ఆస్తి వెయ్యి కోట్ల పైమాటేనని ఎవరైనా ఎక్కడైనా చెప్పుకుంటారా? జాతీయ స్థాయికి ఎదగడంలో భాగంగా ప్రతిపక్షాల ఖర్చంతా తానే పెట్టుకుంటానన్న స్టేట్ మెంట్లు కూడా ఆయనకు చేటు తెచ్చిపెట్టాయనే చెప్పాలి.
ఇక్కడే కేసీఆర్ చాలా పెద్ద లాజిక్ మిస్సయ్యారు. ఇంత చిన్న రాష్ట్రానికి సీఎం కావాలంటేనే.. తాను ఎందరినో బలిపీఠాలను ఎక్కించి.. ఆ కన్నీళ్ల పన్నీటి స్నానాలతో పట్టాభిషిక్తుడైన కేసీఆర్.. అంత పెద్ద భారత పీఠం ఎక్కడానికి ఎంత పెద్ద.. కన్నీటి సుడిగుండాలు సృష్టించాలో అన్న విషయమే మరిచారు. దీంతో చెప్పేదేముందీ? రాజ్యాధికారానికి పూర్తిగా దూరమై పోయారు.
ఒక్క మాటలో చెప్పాలంటే వ్యాపారంలో సుఖాల కోసం పాకులాడాలి. రాజకీయాల్లో కష్టాలను కొని తెచ్చుకోవాలి.. చుచ్చుచ్చు. అయ్యో పాపం.. అన్న పదాలే పరమపద సోపానాలు. నిందలూ నిష్టూరాలే.. రేపటి రోజున ఎక్కబోయే అందలాలు. ఇవేవీ గుర్తించకుండా వ్యాపారాత్మక రాజకీయాలు చేద్దామనుకుంటే.. ఆచి. తుచి. అడుగేద్దామనుకుంటే.. ఈ అభిమన్యుడు పద్మ వ్యూహంలో చిక్కలేడు. ఆపై అతడిపై మూకుమ్మడి దాడి జరగదు. చచ్చుచ్చు.. అన్న శబ్ధం చచ్చినా రాదు.. అలా రాకుంటే.. అతడెప్పటికీ గట్టెక్కలేడు. పీఠమెక్కి ఠీవీగా కూర్చోనూ లేడు. కాబట్టి.. వ్యాపారాత్మక రాజకీయాలను నెరపాలనుకుంటున్న వారు.. గుర్తించాల్సిందిగా మనవి.
ప్రత్యేక వ్యాసం – జర్నలిస్ట్ ఆది