రిపోర్టర్ అంటే యజమానికి దోచి పెట్టేవాడు. ఓ అక్రిడేషన్ కార్డు భిక్షం వేసి.. ఏడాదంతా ఊడిగం చేయించకుంటారు. బ్లాక్మెయిల్ చేస్తావా? జేబులో నుంచి కడతావా? అప్పులు చేస్తావా? సంబంధం లేదు.యాడ్స్ టార్గెట్ రీచ్ కావాలె. కావాల్సినంత సర్క్యూలేషన్ చేసి పెట్టాలె. ముందే పైసలు కట్టాలె. అంతే. ఇగో ఇదే ధోరణి మరొకరి ప్రాణాలు తీసింది. సరిగ్గా నెలన్నర క్రితం నమస్తే తెలంగాణ తూఫ్రాన్ రూరల్ రిపోర్టర్ సీహెచ్ నాగరాజు ఇదే తరహాలో బలవన్మరణం పొందిన విషయం తెలిసిందే.
ఇప్పుడు అదే మెదక్ జిల్లాలోని నర్సాపూర్ వార్త సీనియర్ రిపోర్టర్ ప్రవీణ్ గౌడ్ చెరువులో దూకి ఆత్మహత్య చేసుకున్నాడు. సూసైడ్ లెటర్లో తన బాధ, గోస అంతా చెప్పుకున్నాడు. స్టాఫర్ పెట్టే ఒత్తిడి తట్టుకోలేకపోయానని తల్లడిల్లాడు. భార్య పడుతున్న వేధన చూడలేకపోతున్నానని , అప్పుల పాలయ్యానని, ఈ జర్నలిజం విలువలు అడుక్కునే స్థాయికి దిగజారాయని తన మనోవేదనను వెలిబుచ్చి.. తనువు చాలించాడు. ఆ సూసైడ్ లెటర్ చదివితే ఎవరికైనా కంటనీరు రాకమానదు. హృదయం ద్రవించకమానదు.
రిపోర్టర్లంటే వసూళ్లు చేసే పెట్టే ఏజెంట్లు, బ్లాక్ మెయిలర్లు యాజమాన్యం దృష్టిలో. వారిచ్చే అక్రిడేషన్ కార్డు కోసం వీళ్లంతా ఎన్ని కష్టాలైనా పడతారు. ఎంతటి బాధలన్నా దిగమింగుతారు. ఎన్ని అప్పులైనా చేస్తారు. కుటుంబం చిన్నాభిన్నమైనా పట్టించుకోరు.. ఆఖరికి ఇలా జీవితాలను విషాదాంతాలు చేసుకుంటారు. ఎవడు పోతే మేనేజ్మెంట్కేం సంబంధం. వీడు పోతే ఇంకొకడు. దోచిపెట్టేవాడు కావాలి. అంతే.
నెలన్నర కిందట చనిపోయిన నాగరాజు కుటుంబాన్ని ఇంత వరకు ఎవరూ పట్టించుకున్న పాపాన పోలేదు. అధికార పార్టీ పత్రికలో పనిచేసి తనువు చాలించిన ఆ రిపోర్టర్ కుటుంబానికే భరోసా లేదు. దిక్కు లేదు. ఇక వేరే వాళ్ల పరిస్థితి ఎలా ఉంటుందో చెప్పనవసరం లేదు.