Olive Oil For Hair: వర్షాకాలంలో జుట్టు చిట్లిపోవడం, డ్రైగా మారడం, కాంతివిహీనం కావడం వంటి సమస్యలు ఇబ్బంది పెడుతూ ఉంటాయి. ఈ కాలంలో కుదుళ్లు బలహీనపడి.. జుట్టు రాలే సమస్య ఎక్కువ అవుతుంది. అందుకే.. ఈ సీజన్‌లో జుట్టును సంరక్షించుకోవడానికి ఎక్కువ కేర్ తీసుకోవలసి ఉంటుంది. వర్షాకాలంలో మన జుట్టును సంరక్షించడానికి ఆలివ్ ఆయిల్ సహాయపడుతుంది. మన జుట్టుకు తేమను అందించడానికి, జుట్టు చిట్లడం, డ్రై అవ్వడం వంటి సమస్యలను దూరం చేయడానికి ఆలివ్ నూనె తోడ్పడుతుంది. ఆలివ్ నూనెలో ఉండే విటమిన్-ఇ, ఇతరత్రా యాంటీఆక్సిడెంట్లు తలపై ఉన్న చర్మాన్ని మృదువుగా మారుస్తాయి. ఆలివ్ నూనెతో తలను మర్దన చేయడం వల్ల జుట్టు పొడిబారిపోవడం, తెల్లబడటం, వంటి సమస్యలు తగ్గడంతోబాటు కుదుళ్లు దృఢంగా మారతాయి.
జుట్టు రాలడం తగ్గుతుంది..
ఆలివ్ ఆయిల్ జుట్టు రాలడానికి కారణమయ్యే డైహైడ్రోటెస్టోస్టెరాన్ ఉత్పత్తిని నియంత్రిస్తుంది. ఆలివ్ ఆయిల్‌లోని ఒలిక్ యాసిడ్ ఆల్ఫా రిడక్టేజ్‌ను నిరోధిస్తుంది. హెయిర్ ఫాల్‌ను కంట్రోల్ చేస్తుంది. ఆలివ్ ఆయిల్ నెత్తికి రక్త ప్రసరణ మెరుగుపరుస్తుంది. ఈ ఆయిల్‌లో యాంటీ ఇన్‌ఫ్లమేటరీ లక్షణాలు స్కాల్ప్ ఇరిటేషన్ తగ్గిస్తాయి. ఇది జుట్టు పెరుగుదలను ప్రోత్సహిస్తుంది. మీ తలకు ఆలివ్ ఆయిల్ అప్లై చేసి రాత్రంతా అలాగే ఉంచండి. ఆ తర్వాత రోజు తలస్నానం చేయండి. ఇలా చేస్తే.. జుట్టు త్వరగా పెరుగుతుంది, తలపై చికాకును కూడా తగ్గిస్తుంది.
హెయిర్ డ్యామేజ్ నివారిస్తుంది..
ఆలివ్ ఆయిల్ హెయిర్ డ్యామేజ్‌ను నివారిస్తుంది. ఇందులో యాంటీ ఆక్సిడెంట్లు పుష్కలంగా ఉంటాయి. ఇది మాడు చర్మం ఆరోగ్యాన్ని కాపుడుతుంది. ఫ్రీ రాడికల్స్ జుట్టు కదుళ్లను దెబ్బతీయకుండా రక్షిస్తుంది. ఈ నూనెలోని యాంటీఆక్సిడెంట్లు జుట్టు కాలుష్యం, యూవీ కిరణాల నుంచి రక్షిస్తుంది. ఆలివ్ ఆయిల్‌లోని విటమిన్ ఇ జుట్టు చిట్లడం, చివర్లు చిట్లిపోవడాన్ని తగ్గిస్తుంది.