Hair Loss : జుట్టు రాలడం.. ఇప్పుడు ప్రతి ఒక్కరి సమస్య. దీనికి జెండర్ తేడా కూడా లేదు. ఎవరిని కదిలించినా ముప్పయి దాటలేదు.. జుట్టు బాగా రాలిపోతున్నదనేకంప్లెయింట్ చేస్తుంటారు. ఇప్పుడు వర్షాలు మొదలయ్యాయి. ఈ వర్షాల్లో అంటు వ్యాధులే కాదు.. జుట్టు రాలే సమస్యలు కూడా ఎక్కువే.
సీజన్ మారినప్పుడు మన శరీరం కూడా అందుకు అనుగుణంగా మార్పులు చేసుకోవడానికి కొంత సమయం పడుతుంది. ఇదొక ఎత్తయితే వానలో తడవడం మరొక కారణం. వర్షంలో జుట్టు తడవడమే ఒక సమస్య అంటే.. ఈ చల్లని వాతావరణంలో తడిసిన జుట్టు ఆరడం ఇంకో సమస్య. ఇలా ఎక్కువ సేపు జుట్టు ఆరకుండా ఉండటం వల్ల దానికి సమస్యలు వచ్చే అవకాశం ఉంటుంది.
హెయిర్ కేర్ అనగానేషాంపూలూ, నూనెల కన్నా ముఖ్యమైనది మనం తీసుకునే ఆహారం. ఎన్ని రకాల నూనెలూ, షాంపూలూ వాడినా పోషకాహారం తీసుకోకుంటే జుట్టు రాలడం ఆగదు. జుట్టు ఆరోగ్యం కోసం గుడ్డులోని తెల్లసొన, లీన్ మీట్, చిరుధాన్యాలు, మొలకెత్తిన విత్తనాలు, బీన్స్ లాంటివి ఎక్కువగా తీసుకోవాలి.
ఏ నూనె మంచిదంటే…
తలకు నూనె తప్పనిసరిగా రాయాలి. అయితే నూనెను వేడి చేయడం మరవొద్దు. వేడి నూనెను తలకు బాగా పట్టించాలి. కుదుళ్ల దగ్గర నూనె బాగా ఇంకేలా చూడాలి. అప్పుడు జుట్టు మూలాల్లో రక్తప్రసరణ బాగా జరుగుతుంది. దానివల్ల జుట్టుకు సరైన పోషణ అంది ఆరోగ్యంగా పెరుగుతుంది. ఇలా వారానికి రెండు సార్లయినా వేడి నూనెతో మసాజ్ చేస్తే జుట్టు బాగా పెరుగుతుంది. అయితే తలస్నానం చేసిన తర్వాత కాకుండా, షాంపూ చేయడానికి ఓ రెండు గంటల ముందే ఇలా వేడి నూనె బాగా పట్టించి మసాజ్ చేయాలి. ఆ తర్వాత తేలిక పాటిషాంపూతో తలస్నానం చేయాలి.
కండిషనర్ చాలా ముఖ్యం
చాలామంది షాంపూ చేసి వదిలేస్తారు. కానీ కండిషనర్ వాడటం కూడా అవసరమే. ఇది జుట్టును మాయిశ్చరైజర్ చేయడానికి సహాయపడుతుంది. స్కిన్ అయినా, హెయిర్ అయినా ఆరోగ్యంగా పెరగాలంటే మాయిశ్చరైజర్ చాలా అవసరం. దీనివల్ల జుట్టు పొడిబారకుండా ఉంటుంది. డ్రై అయితే జుట్టు సులువుగా చిట్లిపోతుంది. ఇది నివారించాలంటే కండిషనర్ వాడటం మంచిది.