సినిమాకు వెళ్తే చాలు ధూమపానం, మద్యపానం ఆరోగ్యానికి హానికరం అనే మాటను చూడక తప్పదు. అంతెందుకూ, సాక్షాత్తూ సిగరెట్ పెట్టే మీదే పొగ తాగడం ఆరోగ్యానికి హానికరం అనే మాట రాసి వుంటుంది. ఇది నిజం కూడానూ…! పొగ తాగడంవల్ల ఆరోగ్యం దెబ్బతిన్నవారూ, ప్రాణాలు కోల్పోయినవారూ ఎంతోమంది. ఇప్పటికీ స్టైల్ గా మొదలెట్టి పొగ తాగడానికి బానిసలై తర్వాత అనారోగ్యాన్ని కొని తెచ్చుకుంటున్నవారు ఎంతోమంది వున్నారు.
అయితే, చైనాకు చెందిన ఓ వ్యక్తి కొత్తగా ప్రయత్నించాడు. 42 కిలోమీటర్ల దూరాన్ని కేవలం 3 గంటల 28 నిమిషాల్లో పరిగెత్తాడు. పరిగెత్తడమే కాకుండా దారి పొడవునా సిగరెట్లను ఆగకుండా తాగుతూనే వెళ్లాడు. ఈ నెల 6న షాంఘైలో ఈ పోటీ నిర్వహించినట్టు ది ఇండిపెండెంట్ పత్రిక పేర్కొంది. నిజానికి పొగతాగడం పరుగెత్తడానికి అవరోధం అని భావిస్తుంటారు. కానీ, షాంగ్జూకు చెందిన అంకుల్ చెన్ అనే ఈ చైన్ స్మోకర్ పొగతాగడమే తన బలమని నిరూపించాడు. మొత్తం 1500 మంది ఈ పోటీలో పాల్గొనగా చెన్ 574వ స్థానంలో నిలిచాడు.
ఒక 50 ఏళ్ల వ్యక్తి ఈ ఘనత సాధించడం నిజంగా రికార్డు. అయితే అంకుల్ చెన్ కు సిగరెట్ తాగుతూ పరుగు పందేల్లో పాల్గొనడం ఇదే మొదటిసారి కాదు. 2018, 2019లోనూ ఇదే మాదిరి పోటీల్లో పాల్గొన్నాడు. తాజా ఫీట్ పై నెటిజన్లు ఆశ్చర్యపోతున్నారు. పొగతాగుతూ పరుగెత్తడం అసాధ్యమేనంటూ చెన్ ను ప్రశంసిస్తున్నారు. పొగతాగకుండా అతడు ఇంకెంత దూరం పరుగు తీయగలడో? అన్న సందేహాలను వ్యక్తం చేస్తున్నారు. అయితే, దీన్ని స్పూర్తిగా మాత్రం తీసుకోకూడదనేది ఎంతోమంది అభిప్రాయం.