తెలంగాణ రైతాంగం కోసం రాష్ట్ర ప్రభుత్వం.. కేంద్రంపై ప్రత్యక్ష యుద్ధానికి దిగింది. ధాన్యం కొనుగోలుపై స్పష్టత ఇవ్వాలని కేంద్ర ప్రభుత్వాన్ని డిమాండ్ చేస్తూ ఈ నెల 18న హైదరాబాద్‌లోని ఇందిరా పార్క్ వద్ద ధర్నా నిర్వహించనున్నట్టు ముఖ్యమంత్రి కే చంద్రశేఖర్‌రావు ప్రకటించారు. కేంద్రంలోని బీజేపీ సర్కారు ద్వంద్వ వైఖరి, రాష్ట్ర బీజేపీ నేతల తీరును ఎండగడుతూ పోరాటానికి సిద్ధమవుతున్నట్టు చెప్పారు. మంగళవారం తెలంగాణ భవన్‌లో టీఆర్‌ఎస్‌ఎల్పీ సమావేశం అనంతరం ఆయన మీడియాతో మాట్లాడారు. ధాన్యం కొనుగోళ్లపై కేంద్రం స్పష్టత ఇవ్వకుంటే అన్ని వేదికలపైనా పోరాటం కొనసాగిస్తామని తేల్చి చెప్పారు. యాసంగిలో వరి వేయాలని బీజేపీ రాష్ట్ర అధ్యక్షుడు బండి సంజయ్ చేసిన వ్యాఖ్యలకు ఆయన కట్టుబడి ఉన్నారో లేదో చెప్పాలని.. తప్పుగా చెప్పి ఉంటే ముక్కు నేలకు రాసి.. రైతాంగానికి బహిరంగంగా క్షమాపణ చెప్పాలని డిమాండ్ చేశారు.
ఉదయం 11 గంటల నుంచి ధర్నా
————————
తెలంగాణ రైతుల పక్షాన గురువారం ఉదయం 11 నుంచి మధ్యాహ్నం 2 గంటల వరకు ఇందిరాపార్కు దగ్గర ధర్నా కొనసాగుతుందని కేసీఆర్ వెల్లడించారు. మొత్తం రాష్ట్ర క్యాబినెట్, ఎమ్మెల్యేలు, ఎమ్మెల్సీలు, ఎంపీ లు, జడ్పీ చైర్మన్లు, సహకార బ్యాంక్ చైర్మన్లు, రైతుబంధు సమితి జిల్లా అధ్యక్షులు ఈ ధర్నాలో పాల్గొంటారని చెప్పారు. ‘ఏడాదికి ఎఫ్‌సీఐ తీసుకొనే ధాన్యం టార్గెట్ ఇవ్వాలని కేంద్రాన్ని సూటిగా అడిగాం. రెండు మూడు రోజుల్లో సమాధానం ఇవ్వండి మహాప్రభో అని అడిగినం. పెండింగ్ పెట్టి కూసుంటాం అంటే కుదరదు. అది డిమాండ్ చేయడానికే ధర్నా చేయబోతున్నాం. రాష్ట్ర రైతాంగం ప్రయోజనాలు కాపాడేందుకు, తెలంగాణ రాష్ట్ర రైతుల గొంతుకగా.. ముక్త కంఠంతో కేంద్రాన్ని డిమాండ్‌చేస్తాం. మిమ్మల్ని ప్రశ్నించబోతున్నాం. వదిలిపెట్టేదే లేదు’ అని కేసీఆర్ తెలిపారు. ధర్నా అనంతరం నేరుగా రాజ్‌భవన్‌కు వెళ్లి గవర్నర్‌కి వినతిపత్రం ఇస్తామన్నారు. 18 ధర్నా తర్వాత కేంద్రం వైఖరి ఏమిటో స్పష్టమవుతుందని, ప్రజాస్వామ్యాన్ని గౌరవిస్తారో లేదో ప్రజలకు తెలిసిపోతుందని అన్నారు. ధాన్యం కొనుగోళ్లపై కేంద్ర విధానాన్ని స్పష్టంచేయాలని కోరుతూ ప్రధానికి, కేంద్ర ఆహారశాఖ మంత్రికి బుధవారం లేఖ రాస్తానని, ఏడాదికి ఎఫ్‌సీఐ తీసుకొనే ధాన్యం టార్గెట్ ఇవ్వాలని కేంద్రాన్ని కోరుతామని తెలిపారు. ధర్నా అనంతరం రెండురోజులు చూస్తామని.. ఆ తర్వాత కేంద్ర వైఖరిని బట్టి రైతులు ఏ పంట వేసుకోవాలి.. ఏది వేసుకోవద్దో స్పష్టం చేస్తామని చెప్పారు.
వరి వేయాలని చెప్పింది నిజమా.. కాదా..?
———————–
‘పంజాబ్‌లో ధాన్యం కొన్నట్టుగా.. కేంద్రం తెలంగాణ ధాన్యం కొంటదా? కొనదా? సీదా ముచ్చట. బండి సంజయ్.. యాసంగిలో వరి వేయండి.. అని చెప్పినవ్.. ఆ మాటమీద నువ్వు నిలబడి ఉన్నావా? లేదంటే పొరపాటున చెప్పిన అని రైతులను, ప్రజలను క్షమాపణ వేడుకొని, చెంపలేసుకోవాలి. ముక్కు నేలకు రాయాలి’ అని సీఎం కేసీఆర్ బండిపై తీవ్రంగా విరుచుకుపడ్డారు. లేదంటే ప్రజలు ఇంకా నిలదీస్తారని, టార్గెట్ చేస్తారని, బీజేపీ నేతలకు శిక్ష తప్పదని, తప్పించుకోలేరని హెచ్చరించారు. కేంద్రం ఒకటి చెప్పి, తాము ఒకటి మాట్లాడి అయోమయం సృష్టిస్తే, దానికి వాళ్లే బలైతరని పేర్కొన్నారు. బండికి నిజాయతీ ఉంటే వరి వెయ్యొద్దని రైతులకు చెప్పాలన్నారు. అడ్డగోలుగా మాట్లాడుతూ రైతులపై దాడిచేయడం ఎంతమాత్రం క్షమించతగింది కాదని.. దీన్ని తాము సీరియస్‌గా తీసుకొంటున్నామని తెలిపారు. ‘ఈ రోజు మా శాసనసభ్యులను పిలిచి సమాలోచనం చేసినం. రాష్ట్ర ప్రభుత్వం ఏం చెప్తది? కేంద్రం ఏం చెప్తదని రైతాంగం ఎదురు చూస్తున్నరు. కేంద్రం తేల్చదు.. వాళ్లు తేల్చే రకం కాదు’ అని సీఎం కేసీఆర్ అన్నారు. ధాన్యం కొనుగోళ్లకు మన దగ్గర జరుగుతున్నట్టు సకాలంలో చెల్లింపులు ఎక్కడా లేవని చెప్పారు.
రాష్ర్టానికో నీతి.. ప్రాంతానికో నీతి
———————-
దేశ ఆహార అవసరాలకోసం బఫర్‌స్టాక్ నిర్వహించడానికి రైతులు పండించిన ధాన్యాన్ని కొనాల్సిన బాధ్యత కేంద్రానిదేనని సీఎం కేసీఆర్ స్పష్టంచేశారు. కొన్న ధాన్యాన్ని ప్రాసెస్ చేయడం కేంద్రం చేతుల్లోనే ఉన్నదన్నారు. ఎఫ్‌సీఐ దగ్గరున్న సైంటిఫిక్ గోదాముల్లోనే నిల్వచేసే అవకాశం, వినియోగించే బాధ్యత ఉన్నదని.. నిల్వచేసే సామర్థ్యం ఏ రాష్ట్రం దగ్గరా లేదని వివరించారు. కేంద్రం మాత్రం రాష్ర్టానికో నీతి.. ప్రాంతానికో నీతి అన్నట్టు వ్యవహరిస్తున్నదని విమర్శించారు. పంజాబ్‌లో మొత్తం ధాన్యాన్ని కొంటున్న కేంద్రం తెలంగాణ దగ్గర నిరాకరిస్తున్నదని చెప్పారు. గత యాసంగిలో ధాన్యాన్ని కొంటామని ఎఫ్‌సీఐ చెప్తే.. కేంద్రం నిరాకరించిందని.. దీనిపై తేల్చుకోవడానికి తానే ఢిల్లీకి వెళ్లి మీరు ధాన్యం సేకరించే పద్ధతి, మీ ఎంవోయూ చేసే పద్ధతి బాగాలేదని చెప్పానని తెలిపారు. ఒక సంవత్సరంలో ఎంత ధాన్యం కొంటారో సీజన్‌కు ముందే చెప్తే, దానికి అనుగుణంగా చర్యలు తీసుకుంటామని కోరితే.. జీవోఐఎం (గ్రూప్ ఆఫ్ మినిస్టర్స్ మీటింగ్)లో చర్చించి ఐదారు రోజుల్లో చెప్తామని కేంద్ర మంత్రి హామీ ఇచ్చారని, కానీ ఇప్పటివరకు జవాబు రాలేదని చెప్పారు. గత యాసంగిలో ఐదు లక్షల టన్నులు.. వర్షాకాలం పంట తీసుకుంటరా? తీసుకోరా? చెప్పటంలేదన్నారు. సీఎం అడిగిన తర్వాత 50 రోజులు గడిచిపోయినా సమాధానం రాకుంటే ఏమనుకోవాలని ప్రశ్నించారు.
కార్లు ఎక్కించి చంపుతున్నరు
———————-
సంవత్సర కాలంగా ఢిల్లీలో రైతులు ధర్నా లు చేస్తున్నా, 600 మంది చనిపోయినా పట్టించుకునే దిక్కులేదని కేసీఆర్ ఆవేదన వ్యక్తంచేశారు. ఉల్టాగా రైతులపై కార్లు ఎక్కించి తొక్కి చంపుతున్నరని చెప్పారు. ఇది రాజకీయం కాదని.. దీని ద్వారా వాళ్ల పతనం తప్ప లాభం ఏ మాత్రం జరగదని హెచ్చరించారు.
రైతులకు స్పష్టతనిచ్చే బాధ్యత మాది
————————–
ఈ నెలలోనే అనురాధ కార్తె మొదలైతదని, రైతులు వరి నారు పోస్తరని సీఎం తెలిపారు. నారు పోసిన తర్వాత వరి సాగు వద్దంటే రైతులు నష్టపోతరు కాబట్టి.. వరి సాగు చేయాలో వద్దో తేల్చి చెప్పాల్సిన బాధ్యత రాష్ట్ర ప్రభుత్వంగా తమపై ఉన్నదన్నారు. ‘మేం చాలా కష్టపడి రాష్ట్రంలో వ్యవసాయం స్థిరీకరించుకున్నాం.. వేల కోట్లు పెట్టి ప్రాజెక్టులు కట్టుకున్నాం. మిషన్ కాకతీయతో భూగర్భ జలాలు పెంచుకున్నాం. రైతుబంధు ఇచ్చి పెట్టుబడి సమకూర్చినం. రైతుబీమా ఇచ్చి రైతులు చనిపోతే ఆ కుటుంబాన్ని ఆదుకుంటున్నాం. మంచినీళ్ల కోసం బాధ లేదు. ఈ రోజు వందల కోట్ల బకాయిలను రద్దు చేసి, నీటి తీరువా తీసుకోకుండా రైతులకు నీళ్లు ఇచ్చే ఒకే ఒక రాష్ట్రం దశంలో తెలంగాణ మాత్రమే’ అని స్పష్టం చేశారు.
జైలుకు పంపుతాననడం
—————
మెదడు లేని వాళ్లు మాట్లాడే మాటతమపై కేసులు పెట్టారని బీజేపీ చేస్తున్న విమర్శలపై సీఎం స్పందిస్తూ, ‘చాలా కేసులు పెట్టారు. రాబోయే రోజుల్లో మీరే చూస్తారు. నిన్ను జైలుకి పంపుతా, నన్ను జైలుకి పంపుతా అని మెదడులేని మనుషులు మాట్లాడుతారు. ఎక్కడైనా ముఖ్యమంత్రిని జైలుకు పంపుతారా? దానికి ఒక చట్టం, కోర్టులు, వ్యవస్థ ఉంటది. అవే నిర్ణయిస్తాయి’ అని చెప్పారు.
విద్యుత్తు, రైతు చట్టాలను వ్యతిరేకించాం
————————-
విద్యుత్తు, రైతు చట్టాల విషయంలో తమకు స్టాండ్ లేదని తలకుమాసిన సన్నాసి ఎలా అంటాడని సీఎం కేసీఆర్ ఆగ్రహం వ్యక్తం చేశారు. విద్యుత్తు చట్టాన్ని శాసనసభ సాక్షిగా వ్యతిరేకించామని, అసెంబ్లీలో తీర్మానం చేశామని గుర్తుచేశారు. రైతు చట్టాలు రైతులకు వ్యతిరేకంగా ఉన్నాయని, అవి నల్లచట్టాలని అభివర్ణించారు. లోక్‌సభలో, రాజ్యసభలో తాము వ్యతిరేకించామని, వ్యవసాయశాఖ మంత్రి వందసార్లు వ్యతిరేకించారన్నారు.
తలాతోక లేని పార్టీ బీజేపీ
——————
తలాతోకా లేకుండా మాట్లాడే పార్టీ బీజేపీ అని, తలాతోకా లేకుండా మాట్లాడే ప్రభు త్వం కేంద్ర ప్రభుత్వమని కేసీఆర్ ఎద్దేవా చేశారు. తమకు ప్రతి అంశంపైనా ఒక స్పష్టత ఉన్నదని, తాము చెప్పిన ప్రతిదాన్నీ చేసి చూపామని పేర్కొన్నారు. కేంద్రం సమస్య సృష్టించడం వల్ల ఇబ్బందులు వస్తున్నాయని చెప్పారు. కేంద్రం ద్వంద్వ వైఖరి అవలంబిస్తున్నదని, దాన్ని కప్పిపుచ్చేందుకు మాయామశ్చీంద్ర యాత్రలు చేస్తాం, అడ్డగోలుగా మాట్లాడుతామంటే జరిగేపని కాదని స్పష్టంచేశారు. ఇది తెలంగాణ గడ్డ అని, ఉద్యమాల గడ్డ అని, కచ్చితంగా నిలదీస్తుందని, వెంటాడుతుందని, వేటాడుతుందని, ఫలితం రాబట్టే దాక కొట్లాడుతదని కేసీఆర్ స్పష్టంచేశారు. ధాన్యం కొనుగోలు విషయంలో వాళ్లు ఎగబెడతరా, ఎస్ అంటారా చూస్తామని సీఎం పేర్కొన్నారు. ఎమ్మెల్సీ ఎన్నికల్లో అన్ని స్థానాలూ గెలుస్తామని పేర్కొన్నారు.
ఈ పిచ్చోళ్ల మాటలు నమ్మితే మునిగిపోతాం
—————————–
ధాన్యం కొనుగోలుపై కేంద్రం ఒకమాట చెప్తుంటే.. వరిసాగుపై బీజేపీ రాష్ట్ర అధ్యక్షుడు మరోమాట చెప్తూ రైతులను, ప్రజలను గందరగోళపరుస్తున్నారని సీఎం కేసీఆర్ ఆగ్రహం వ్యక్తంచేశారు. కేంద్రంలోని బీజేపీ ప్రభుత్వంపై తమకు నమ్మకం కుదరడం లేదన్న కేసీఆర్.. ‘ప్రత్యామ్నాయమే ఆలోచించండి. ఈ పిచ్చోళ్ల మాటలు నమ్ముకొని వరివేసి మునిగిపోతే మళ్లీ ఇబ్బంది వస్తది’ అని రైతులకు హితవు చెప్పారు. రైతులు బాగుండాలనే తాము కోరుకుంటామన్న సీఎం.. ఈసారి యాసంగిలోనూ ఠంచన్‌గా రైతుబంధు ఇస్తామని స్పష్టంచేశారు.
బీజేపీని వెంటాడుతూనే ఉంటం…
———————
‘కేంద్రం స్పష్టత ఇచ్చేవరకు వాళ్లను వదిలిపెట్టం. పార్లమెంట్ సహా అన్ని వేదికల్లో బీజేపీని వెంటాడుతాం. మా ధాన్యం కొనాలని, మా టార్గెట్ ఎంతో చెప్పాలని డిమాండ్ చేస్తూనే ఉంటాం. 18న ధర్నా తర్వాత కూడా ఫైట్ కంటిన్యూ చేస్తాం. మా రైతులు నష్టపోకూడదు కాబట్టి.. వాళ్లకు నిజానిజాలు తెలిసేలా చేస్తాం’ అని కేసీఆర్ అన్నారు. ప్రజాస్వామ్యంలో ఒక రాష్ర్టానికి చెందిన వందకు పైగా ఎమ్మెల్యేలు, ఎమ్మెల్సీలు, ఎంపీలు ధర్నాకు కూర్చున్న తర్వాత స్పందించకుంటే ఏంచేయాలో ప్రజలే నిర్ణయిస్తారని కేసీఆర్ అన్నారు. కేంద్రం వైఖరి స్పష్టంచేసేవరకు ఈ రభస నడుస్తూనే ఉంటుందని చెప్పారు.
బండి రంగు బయటపడింది
——————-
పండిన ధాన్యాన్ని కొనడంలో కేంద్ర ప్రభుత్వ చేతకానితనాన్ని రాష్ట్ర ప్రభుత్వంపై రుద్దుతున్నారని సీఎం కేసీఆర్ ఆగ్రహం వ్యక్తంచేశారు. అరాకిరి చేస్తామని కొనుగోలు కేంద్రాలకు వెళ్తే పరాభవం ఎదురవుతున్నదని ఎద్దేవాచేశారు. ‘అసలు కొనుగోలు కేంద్రాల దగ్గరికి ఎందుకు వెళ్లారు? రైతుల దగ్గరకు వెళ్లినప్పుడు వాళ్ల ప్రశ్నలకు జవాబివ్వాలి కదా? అవేవీ మాట్లాడకుండా.. మల్లొక కిరికిరి పెడతానంటే తీవ్ర నిరసనలు ఎదుర్కొంటున్నావు. అది నీ ఖర్మ. నీకు వాళ్లతో తిట్లుపడే బాకీ ఉన్నది కాబట్టే నువ్వు పోతున్నవ్’ అని సీఎం తీవ్రస్థాయిలో విరుచుకుపడ్డారు. కొనుగోలు కేంద్రాల్లో వడ్లు కొంటూనే ఉన్నరని.. బండి సంజయ్ అక్కడికి పోయి ఏం చేస్తరని ప్రశ్నించారు. వట్టిగ కన్‌ప్యూజ్ క్రియేట్‌చేసి చిచ్చురేపుతున్నారని ఆగ్రహం వ్యక్తంచేశారు.
ఎఫ్‌సీఐ ఒక మాట.. కేంద్రం మరో మాట
———————-
గత యాసంగిలో ధాన్యం కొంటమని ఎఫ్‌సీఐ రాత పూర్వకంగా ఇచ్చిందని, కానీ కేంద్రం కొనబోమని చెప్పిందని సీఎం కేసీఆర్ చెప్పారు. ఎఫ్‌సీఐ హామీమేరకు రాష్ట్ర ప్రభుత్వం రైతుల నుంచి ధాన్యం సేకరించి పైసలు కూడా ఇచ్చి.. హామీమేరకు ధాన్యం సేకరించాలని ఎఫ్‌సీఐని అడిగితే.. వచ్చే యాసంగిలో బాయిల్డ్ రైస్ ఇవ్వబోమని అంగీకరిస్తేనే 20 లక్షల టన్నులు తీసుకుంటామని షరతు పెట్టినట్లు తెలిపారు. రైతుల సంక్షేమం కోసం ఒప్పుకున్నామని చెప్పారు. మరి మరో 5 లక్షల టన్నుల సంగతి ఏంటని ప్రశ్నిస్తే రకరకాలుగా చెప్పారే తప్పా.. స్పష్టమైన జవాబు రాలేదన్నారు. రెండు మూడు సార్లు కేంద్ర మంత్రికి ఫోన్ చేసినా.. పూర్తి సమాధానం రాలేదని తెలిపారు.
ధాన్యం కొనుగోళ్లపై కేంద్రం చేతులెత్తేస్తున్నదని, రైతు ప్రయోజనాలు కాపాడే విధంగా లేదని గుర్తించే.. ఈ యాసంగిలో వరి సాగు చేయొద్దని, రాష్ట్రం కొనే పరిస్థితి ఉండదని వ్యవసాయశాఖ మంత్రి రైతాంగానికి పిలుపు ఇచ్చినట్లు గుర్తుచేశారు. దీనిపై బండి సంజయ్ రెచ్చిపోయి ‘వరి పంటనే వేయండి.. ఎట్ల కొనరో చూస్తాం.. మెడలు వంచుతం’ అని మాట్లాడారని అన్నారు. తాను కేంద్రమంత్రికి ఫోన్ చేసి ‘మీరేమో ధాన్యం కొనబోమని చెప్తారు? ఇక్కడ మీ పార్టీ అధ్యక్షుడేమో వరి వెయ్యాలని చెప్తున్నడు.. రైతులను ఎలా కన్‌ఫ్యూజ్ చేస్తరు? దేశాన్ని పరిపాలించే పార్టీ ఇంత బాధ్యతా రాహిత్యంగా చెప్పొచ్చా’ అని నిలదీసినట్లు తెలిపారు. దీనికి స్పందించిన కేంద్ర మంత్రి తమ అధ్యక్షుడిది పొరపాటైందని, ఆయన అట్లా మాట్లాడకుండా ఉండాల్సిందన్నారని పేర్కొన్నారు. కేంద్రానితో కొట్లాడి వానకాలం వరకు తాము ధాన్యం కొంటామని, కానీ యాసంగి పంట మాత్రం వేయకండని తాము రైతాంగానికి చెప్పామని తెలిపారు.
వడ్లుకొనాలంటే రైతులపై దాడులా?
————————
రాష్ట్రంలో వానకాలం ధాన్యం కొనుగోలు కొనసాగుతున్నదని, గతం కన్నా రెండు మూడు వందలు పెంచి 6,667 కేంద్రాలు ఏర్పాటు చేసినట్లు సీఎం తెలిపారు. డ్రామా పెట్టాలని బీజేపీ నాయకులు కొనుగోలు కేంద్రాల వద్దకు వెళ్తే.. కోపంగా ఉన్న రైతులు నిరసన తెలిపారని, బీజేపీ నేతలు వెంట తెచ్చుకున్న రాళ్లు, ఇతర వస్తువులతో వారిపై దాడి చేస్తున్నారని చెప్పారు. ‘ప్రశ్నిస్తే దేశ ద్రోహులంటరు? వడ్లు కొంటరా? కొనరా? అని అడిగితే రైతు తప్పు చేసినట్లా? ఎందుకు రైతులపై దాడి చేస్తున్నరు? కొనుగోలు కేంద్రాలు ప్రారంభమైనయి. కొనుగోళ్లు జరుగుతున్నయి. మొత్తం ధాన్యం కొంటామని మేం చెప్పినం. అయినప్పటికీ నువ్వు పోవడం ఎందుకు?’ అని సీఎం కేసీఆర్ ఆగ్రహం వ్యక్తం చేశారు. దీనికితోడు టీఆర్‌ఎస్‌పై బదనాం పెడుతున్నరని అన్నారు. టీఆర్‌ఎస్‌కు 60 లక్షల మంది కార్యకర్తలున్నారని, ఇందులో లక్షల మంది రైతులు ఉంటారని చెప్పిన కేసీఆర్.. వాళ్లు ధాన్యం అమ్ముకునేందుకు కొనుగోలు కేంద్రానికి రారా? నిన్ను నిలదీస్తే తప్పేంటి? అని ప్రశ్నించారు. బండి సంజయ్ వరి వేయాలని చెప్పిండు కాబట్టి.. ఆయనను టీఆర్‌ఎస్సే కచ్చితంగా నిలదీస్తదని స్పష్టంచేశారు.
టీఆర్‌ఎస్ మిమ్మల్ని వేటాడడం
——————-
ప్రారంభించింది. మేం ఉద్యమకారులం. భయంకరమైన ఉద్యమాలు చేసి, తెలంగాణ రాష్ర్టాన్ని సాధించాం. రాష్ట్ర రైతుల ప్రయోజనాలు కాపాడేందుకు ఎంతకైనా తెగిస్తాం. వెనక్కి పోయే ప్రశ్నే ఉత్పన్నం కాదు. కచ్చితంగా ఏది ఏమైనా రాష్ర్టాన్ని, రాష్ట్ర రైతాంగాన్ని కాపాడుకుంటాం.డొంక తిరుగుడు కాదు.. మేమేం ఇంగ్లిష్‌ల, హిందీల, మరాఠీల అడుగుతలేం.. స్వచ్ఛమైన తెలుగు భాషలో అడుగుతున్నం.. యాసంగిలో వరి వేయాలని నువ్వు (బండి సంజయ్‌నుద్దేశించి) చెప్పినవ్.. నువ్వు తప్పు చెప్పినవా? కరెక్టా? నువ్వు నీ స్టాండ్ మీద ఉన్నవా? లేవా? సీదాసీదా చెప్పు. ఒకవేళ నువ్వు అన్నమాటమీదే ఉంటే.. తెలంగాణలో యాసంగిలో ఎంత పండినా సేకరణ చేస్తామని కేంద్రం నుంచి ఆర్డర్ తీసుకురా. కేంద్రం కొంటా అంటే 75 లక్షల ఎకరాల్లో వరి వేయిస్తామని మొన్ననే స్పష్టంగా చెప్పిన.