మీడియా మిత్రులకు నమస్కారం..
Live Liquor online Tenders : మేము ఏదో వ్యాపారం చేసుకోవచ్చని లిక్కర్ టెండర్లలో పాల్గొన్నాం. ఆన్ లైన్ టెండర్, లాటరీ సిస్టమ్ అంటే అంతా న్యాయబద్ధంగా జరుగుతుందని నమ్మి దిగాం. కాని ఆన్ లైన్ టెండర్ లో పాల్గొని, లాటరీలో కూడా మా అదృష్టం బాగుండి ఐదు షాపులదాకా వచ్చాయి. కాని అది దురదృష్టమని తర్వాత తేలింది. తాడిపత్రి, రాప్తాడు పరిధిలో మేం ఆ ఐదు షాపులు నడపాల్సి ఉంది. కాని ఇప్పటివరకు మమ్మల్ని షాపులు తెరవనివ్వలేదు.. తర్వాత ఎవరినీ మాకు షాఫులు అద్దెకు ఇవ్వనివ్వలేదు.
తాడిపత్రిలో జేసీ ప్రభాకర్ రెడ్డి మనుషులు.. రాప్తాడులో పరిటాల శ్రీరామ్ మనుషులు మమ్మల్ని బెదిరించారు. ఇప్పటికీ బెదిరిస్తూనే ఉన్నారు. షాపులు వదిలేయాలని నేరుగా చెబుతున్నారు. పోలీసులకు కంప్లయింట్ ఇచ్చాం.. ఎక్సైజ్ వాళ్లకు కంప్లయింట్ ఇచ్చాం.. అయినా నో రెస్పాన్స్. అన్నీ తెలిసీ ఏమీ తెలియనట్లుగా పోలీసులు, ఎక్సైజ్ శాఖ వారు ప్రవర్తిస్తున్నారు. ఇలా కాదని నేరుగా సీఎం చంద్రబాబునాయుడు గారికి, డిప్యూటీ సీఎం పవన్ కల్యాణ్ గారికి, మంత్రి లోకేష్ గారికి, ఎక్సైజ్ మంత్రి కొల్లు రవీంద్ర గారికి మా సమస్యలను వివరంగా లేఖల ద్వారా పంపాం. అయినా ఎలాంటి స్పందనా రాలేదు.
ఇప్పటివరకు ఎవరూ పట్టించుకోలేదు. ఇప్పటికే లక్షలు లక్షలు నష్టపోయాం. ఇక ఈ రాష్ట్రంలో ఇంతే అని షాపులు వదిలేయాలా.. లేక ఎవరో ఒకరు స్పందించి న్యాయం చేయకపోతారా అని ఇంకా నష్టపోతూనే ఎదురు చూడాలా మాకు అర్ధం కావడం లేదు. మీడియా ద్వారా అయినా ఈ విషయం పెద్దలు గుర్తించి మాకు న్యాయం చేస్తారని ఆశిస్తున్నాం. ధన్యవాదములతో – మారం గోపీనాథ్ – లిక్కర్ షాపులు దక్కించుకున్న అభాగ్యుడు.