లిఫ్టులో ఇరుక్కున్న విద్యార్థులను పోలీసులు బయటకు తీసుకొచ్చిన ఘటన ఉప్పల్ స్కైవాక్ వద్ద మంగళవారంనాడు జరిగింది. ఉప్పల్ రింగ్ రోడ్డు చౌరస్తాలోని స్కైవాక్ లిఫ్టులో విద్యార్థులు ఇరుక్కుపోయి దాదాపు నలభై నిమిషాల పాటు డోర్లు ఓపెన్ కాక లోపలే ఇబ్బంది పడిన ఈ ఘటనలో జ్యోతి, వాసవి, జాన్సన్ అనే ముగ్గురు విద్యార్థులు మెట్రోస్టేషన్ వైపు వెళ్లేందుకు ఉప్పల్ రింగ్ రోడ్డులోని స్కైవాక్ లిఫ్ట్ ఎక్కారు. బయటకు వెళ్లేందుకు ఎంతసేపటికీ డోర్లు ఓపెన్ కాకపోవడంతో ఆందోళన చెంది 100కు కాల్ చేశారు. సమాచారం అందిన తక్షణమే స్పందించిన ఉప్పల్ ట్రాఫిక్ పోలీసులు వెళ్లి లిఫ్ట్ డోర్ పగలగొట్టి విద్యార్థులను బయటకు తీసుకొచ్చారు.
కమిషనర్ శ్రీ సుధీర్ బాబు ఐపిఎస్ గారు పెట్రో కార్ మరియు బ్లూ కోల్ట్స్ వంటి క్షేత్రస్థాయి విధి నిర్వహణలో మహిళా సిబ్బందికి కూడా మరింత ప్రాధాన్యత ఇస్తూ వారి శక్తియుక్తులను మరియు ప్రతిభను ప్రదర్శించే అవకాశం కల్పిస్తున్నారు. తద్వారా సామాన్య ప్రజలు, మహిళలు మరింత ధైర్యంగా తమ సమస్యలను పోలీసుల దృష్టికి తీసుకువస్తున్నారు.
ఈ ఉప్పల్ స్కైవాక్ వద్ద ఘటనలో మహిళా కానిస్టేబుళ్లు కూడా తోటి పురుష సిబ్బందితో పాటు శక్తివంచన లేకుండా శ్రమించి లిఫ్టులో ఇరుక్కున్న విద్యార్థులను బయటకు తీసుకురావడం జరిగింది. ఈ ఘటనలో సమన్వయంతో వ్యవహరించి, ఎంతో శ్రమించి విద్యార్థులను రక్షించిన కానిస్టేబుల్ ఝాన్సీ మరియు ఇతర కానిస్టేబుళ్లను కమిషనర్ అభినందించి సత్కరించారు. ఈ కార్యక్రమంలో ఎసిపి ఐటి సెల్ నరేందర్ గౌడ్, ఉప్పల్ స్టేషన్ హౌజ్ అధికారి ఎలక్షన్ రెడ్డి, ఇన్స్పెక్టర్ ట్రాఫిక్-1 లక్ష్మీమాధవి మరియు ఇతర అధికారులు పాల్గొన్నారు.