స్టార్టప్స్ హబ్‌గా తెలంగాణ, ఆవిష్కర్తలకు ప్రభుత్వ తోడ్పాటు, సాదరంగా స్వాగతిస్తున్న టీహబ్, వీహబ్, టీఎస్‌ఐసీ, టీవర్క్స్, టాస్క్, మొత్తం 6,660 సంస్థల రిజిస్ట్రేషన్, రూ.1,300 కోట్లతో స్టార్టప్ ఫండ్.
ఆలోచనలే పెట్టుబడిగా, ఆవిష్కరణలే ధ్యేయంగా ముందుకు సాగుతున్న నేటితరం యువత.. ఉద్యోగాలు చేయాలనుకోవడానికి బదులు పదిమందికి ఉద్యోగాలిచ్చే స్థాయికి ఎదగాలని చూస్తున్నది. ఈ క్రమంలో వారికి అంకుర సంస్థల (స్టార్టప్స్) ఏర్పాటు ఆశాదీపంలా కనిపిస్తున్నది. పేటీఎం, ఓయో రూమ్స్, ఓలా క్యాబ్స్, బైజూస్, స్విగ్గీ, ఉడాన్, జొమాటో లాంటి ఆవిష్కరణలన్నీ ఒకప్పుడు స్టార్టప్స్‌గా ప్రారంభమై ఇప్పుడు లక్షల కోట్ల టర్నోవర్‌తో దూసుకెళ్తున్నాయి. ఇలా ఒక్క స్టార్టప్ విజయవంతమైతే ప్రపంచంలో సత్తా చాటవచ్చనే కసితో ఆవిష్కరణల బాట పడుతున్న యువతకు తెలంగాణ ప్రభుత్వం దేశంలోనే ఎక్కడా లేనంత గొప్ప ప్రోత్సాహాన్ని అందిస్తున్నది. దీనిలో భాగంగా 2016లోనే ఇన్నోవేషన్ పాలసీని ప్రారంభించిన తెలంగాణ సర్కారు.. రెండో ఐసీటీ (2021-26) పాలసీ ద్వారా స్టార్టప్స్‌కు మరింత ఊతమిస్తున్నది.
ప్రత్యేక విభాగాల ఏర్పాటు
———————–
ఉద్యోగాల కల్పనతోపాటు ఆర్థికాభివృద్ధికి స్టార్టప్స్ బాసటగా నిలుస్తుండటంతో వాటికి తెలంగాణ ప్రభుత్వం ప్రత్యేక ప్రోత్సాహకాలను అందిస్తున్నది. ఫలితంగా ప్రపంచ ప్రఖ్యాతి గాంచిన పలు ఐటీ కంపెనీలు హైదరాబాద్‌లో తమ కార్యాలయాలను ఏర్పాటు చేసుకున్నాయి. ఇప్పటికే టెక్నాలజీ, ఫార్మా, రక్షణ రంగాల్లో దూసుకుపోతున్న తెలంగాణను స్టార్టప్స్‌కి నెలవుగా తీర్చిదిద్దాలన్నది రాష్ట్ర ప్రభుత్వ లక్ష్యం. దీనికి అనుగుణంగా ఆవిష్కరణల వాతావరణాన్ని పెంపొందించేందుకు దేశంలో ఎక్కడా లేనివిధంగా టీ-హబ్, వీ-హబ్, టీఎస్‌ఐసీ, టీ-వర్క్స్, టాస్క్ లాంటి ప్రత్యేక విభాగాలను ఏర్పాటుచేసి ఔత్సాహిక పారిశ్రామికవేత్తలను వెన్నుతట్టి ప్రోత్సహిస్తున్నది. వారి సృజనాత్మక ఆలోచలకు ఆవిష్కరణల రూపమిచ్చేందుకు అన్నిరకాల చర్యలు చేపడుతున్నది. ఫండింగ్, మెంటార్‌షిప్, మార్కెట్ యాక్సెస్, రిక్రూట్‌మెంట్ తదితర విషయాల్లో అడుగడుగునా తోడ్పాటునందిస్తున్నది. దీంతో ఇప్పటివరకు రాష్ట్రంలో 6,600 స్టార్టప్స్ రిజిస్టర్ అయ్యాయి.
దృష్టి సారించిన రంగాలు
———————
భవిష్యత్‌లో మంచి అవకాశాలున్న రంగాలను గుర్తించి ఆయా రంగాల్లో స్టార్ట ప్స్ అభివృద్ధికి తెలంగాణ ప్రభుత్వం చర్య లు చేపడుతున్నది. మల్టీమీడియా, యానిమేషన్, గేమింగ్ అండ్ ఎంటర్‌టైన్‌మెంట్ (ఇమేజ్), లైఫ్ సైన్సెస్, వ్యవసాయం, రక్షణ తదితర రంగాలపై ప్రత్యేకంగా దృష్టి సారించింది. వచ్చే ఐదేండ్లలో 5 వేల సోష ల్ ఇంపాక్ట్ స్టార్టప్స్‌కు తోడ్పాటునివ్వాలని లక్ష్యంగా పెట్టుకున్నది. ఇలాంటి స్టార్టప్స్‌కు దేశ, విదేశాల్లోని ప్రైవేటు భాగస్వాముల నుంచి పెట్టుబడులు సమకూర్చనున్నది. ఐసీటీ-2 పాలసీ లో అంకుర సంస్థలకు మద్దతిచ్చేందుకు రూ.1,300 కోట్లతో స్టార్ట ప్ ఫండ్‌ని ఏర్పాటు చేస్తున్నది. 8 వేల స్టార్టప్స్‌కి సంస్థాగతంగా మద్దతు ఇవ్వడంతోపాటు 10 వేలకోట్ల పెట్టుబడులను సమకూర్చాలని ప్రభుత్వం యోచిస్తున్నది.
రాష్ట్రంలోని అంకుర సంస్థల వివరాలు
——————————–
రిజిస్టర్డ్ స్టార్టప్స్ :6,660
సీడ్ ఫండెడ్ స్టార్టప్స్ :356
వెంచర్ ఫండెడ్ స్టార్టప్స్ :148
ఇంక్యుబేటీస్ :3,420
పర్చేస్ ఆర్డర్ అవార్డెడ్ :150