జర్నలిస్టులంటే ప్రజలకు కేవలం రిపోర్టర్లు మాత్రమే తెలుసు. కానీ వారు ఇచ్చే ఇన్ పుట్స్ తో వార్తను అందంగా తీర్చిదిద్దేది డెస్క్ జర్నలిస్టు. టెలివిజన్ మాద్యమం అయినా.. పత్రికా మాద్యమం అయినా.. డెస్క్ జర్నలిస్టుల శ్రమ చాలా ఎక్కువగా ఉంటుంది. రిపోర్టర్లు నాలుగు లైన్లు చెబితే దాన్ని నలభై లైన్లు చేయాలి. నలభై లైన్లు ఇస్తే దాన్ని నాలుగు లైన్లకు కుదించాలి. పేపర్లో అయితే ఫొటోల తిప్పలు. ఈ మధ్య పేపర్ డిజైన్ తిప్పలు కూడా సబ్ ఎడిటర్లదే అయింది. టీవీలో అయితే విజువల్స్ తిప్పలు. దీనికి తోడు 5W, 1H సూత్రం ఫాలో అవ్వాలి(చాలా ఛానళ్లు దీన్ని పక్కనపెట్టేశాయనుకోండి). బ్రేకింగులు, స్పెషల్ ప్రోగ్రాములు, వగైరా, వగైరా.. ఇదంతా టీవీ చానల్ నాలుగు గోడల మధ్య జరిగే పోరాటం.
అయితే.. డెస్క్ జర్నలిస్టుది షిఫ్ట్ డ్యూటీ. పేపర్లలో అయితే సెంట్రల్ డెస్క్ లో కొందరికి మినహా మిగతా వాళ్లందరికి ఫిక్స్ డ్ గా సాయంత్రం 4 గంటల నుంచి రాత్రి 12 నుంచి ఒంటి గంట వరకు డ్యూటీ. అదే టీవీల్లో అయితే దానికి ఓ లెక్కా పత్రం ఉండదు. 6AM-2PM, 2PM-10PM, 10PM-6AM. ఇవి సాధారణంగా సాఫ్ట్ వేర్ వాళ్లకు కూడా ఇలాగే ఉంటాయి. కానీ ఇక్కడ అవసరాన్ని బట్టి, పరిస్థితిని బట్టి, మన మీద ఉండే ఇంచార్జ్ ను బట్టి డ్యూటీలు, షిష్ట్ లు మారుతూ ఉంటాయి.
ఏముంది సాఫ్ట్ వేర్ వాళ్లు చేయడం లేదా షిఫ్ట్ డ్యూటీలు.. డెస్క్ జర్నలిస్టులే చేస్తున్నారా.? అనే ప్రశ్న రావొచ్చు. కానీ సాఫ్ట్ వేర్ వాళ్ల జీతాలు ఎక్కువ. మీడియాలో జీతాలు తక్కువ (ఇక్కడ క్రీమీలేయర్ సిద్ధాంతం ఉంటుంది. పైనున్న క్రీమ్ ని నాకేసే పెద్ద తలకాయలు. కిందున్నవాడికి అత్తెసరు జీతాలిచ్చి ఉత్త బ్రెడ్డు ముక్క పెట్టే యవ్వారాలే ఉంటాయి). అసలు ఇవ్వకుండా ఎగనామం పెడుతున్న ఛానళ్లు చాలా ఉన్నాయి. ఇదే వాళ్ల కొంప ముంచుతున్నది.
ఎందుకంటే.. డెస్క్ జర్నలిస్టుగా పనిచేసే ప్రతీ ఒక్కరు ఖచ్చితంగా ఏదో ఒక అనారోగ్య సమస్యతో బాధపడుతూ ఉంటారు. జీర్ణ సమస్యలు, వెన్నెముఖ సమస్యలు, నడుము నొప్పి, మెడనొప్పి, గ్యాస్ ట్రబుల్, విటమిన్ లోపాలు, కళ్ల సమస్యలు, అవి పెరిగి.. పెరిగి.. బీపీలు, షుగర్లు వచ్చి అల్లాడుతున్న వారికి లెక్కే లేదు. ఇవన్నీ కూడా లైఫ్ స్టైల్ డిసీజెస్. అంటే జీవన విధానంలో అసంబద్ధ మార్పుల వల్ల వచ్చే రోగాలు. శరీరానికి పొద్దటి ఎండ తగిలేది లేదు. మార్నింగ్ షిఫ్ట్ పోతే వచ్చేది మూడు నాలుగింటికి. మధ్యాహ్నం 2 గంటలకు పోతే రాత్రి ఇంటికి పోయేది 11.. 12 గంటలకు. రాత్రి 10 గంటలకు పోతే పొద్దున ఏడు, ఏడున్నరకు పోయి ముసుగుతన్ని పండుడే. ఇగ ఎండతగిలేది ఎక్కడ..? శరీరంలో కొవ్వు తరిగేది ఎలా.? శరీరానికి కావాల్సిన డీ విటమిన్ సహా ఇతర విటమిన్లు అందేది ఎలా?
నెక్ట్స్… పొద్దు పోయి పంటే పగటాల్లకు లేసి తింటే.. పొద్దటి పూట కడుపుఖాళీ. మధ్యాహ్నం 2 గంటలకు పోతే రాత్రి 11, 12 గంటలకు వచ్చి తినాలే. అది ఎప్పుడు అరగాలే. రాత్రి 9 గంటలకు తినిపోతే.. రాత్రంతా నిద్రలేక అది అరగది. ఓ దిక్కు నిద్రకు, ఉంకో దిక్కు కడుపులున్నది అరగక.. మెల్ల మెల్లగా ఎసిడిటీ, గ్యాస్ పుట్టుకొస్తయ్. కుర్సీల కూసోని కూసోని ముంగట పొట్ట పెరుగుతది.
పొద్దటి షిఫ్ట్ పోయినోడు సాయంత్రం ఎక్సర్ సైజ్ చేయొచ్చు కదా అంటే.. మూడింటికి అచ్చి పంటే పాణమంతా మజ్జు అయితది. ఇగ లేసుడెట్ల ఎక్సర్ సైజ్ చేసుడెట్ల.? మూడు రోజులు ఏదో తీర్ల తిప్పలవడి ఎక్సర్ సైజ్ చేద్దామనే వరకు షిఫ్ట్ మారుతది. మల్ల కథ మొదటికి వస్తది. టైం ప్రకారం తిండి ఉండది. టైం ప్రకారం నిద్ర ఉండది. (పొద్దుగాల 10కి పోయి సాయంత్రం టంచన్ గా ఆరింటికి ముల్లెమూట సదురుకుని అవుతల పడే కొందరు పనిమంతులకు తప్ప.) మీదికెళ్లి డెస్కుల బ్రేకింగులని, ఆ వార్త ఎందుకు మిస్సైందని, ఈ తప్పులు ఎందుకు వచ్చినయని, ఆ వార్త నిన్ను ఎవడు రాయిమన్నడని.. పక్క ఛానలోడు బ్రేకింగు ఏసే దాకా నువ్వే పీకుతున్నవ్.. ( ఇది చాలా చిన్న మాటే. పెద్ద పెద్ద బూతులు డెస్కుల్లో నిత్యకృత్యం).
వీటన్నింటితో అరికాలి నుంచి నడినెత్తులున్న మెదడు దాకా వేడెక్కి.. రోగాలతో వెక్కి వెక్కి ఏడుస్తుంటయ్. వచ్చే అరకొర జీతానికి హాస్పిటల్ కు పోయి చూయించుకునే ధైర్యం చేయలేక.. మెడికల్ షాపుకి పోయి నాలుగు గోలీలతో సరిపెట్టుకునేవాళ్లు, మధుశాలకు వెళ్లి ఓ నాలుగు పెగ్గులేసి సేదదీరే వాళ్లూ చాలా మందే ఉన్నారు. ఈ సోదంతా ఎందుకంటే.. షిఫ్టులు ఇబ్బంది.. అనే మాటను పీకి పక్కకు పెట్టి.. లైఫ్ స్టైల్ ను మార్చుకోండి. సమయానికి తిండి, సరిపడా నిద్ర ఉండేలా చూసుకోండి. బీర్లు, బిర్యానీల అలవాటు ఉంటే తగ్గించి, కూరగాయలు, పచ్చి కూరగాయ జ్యూస్ లు మొలకలు, పండ్లు తినడం అలవాటు చేసుకోండి. బియ్యం తక్కువ కూరలు ఎక్కువ తినండి. ఉదయాన్ని ఓ లీటరు వేడి నీళ్లు తాగి కడుపు సాఫ్ చేసుకోండి. పైసలు ఇవాళ కాకుంటే రేపు సంపాదించుకోవచ్చు.
కానీ.. ఓ సారి రోగం వచ్చి ఆరోగ్యం దెబ్బతింటే మళ్లీ బాగుపడటం కష్టం. మన జీవన విధానికి తగులుకునే రోగాలన్నీ ఎల్లకాలం ఉండేలా ఫిక్సయ్యి వచ్చేటివే. అందుకే అవి మనల్ని తగులుకోకుండా ముందస్తుగా జాగ్రత్తపడాలి. లేకుంటే ముందస్తు ఎన్నికలు వచ్చినట్టు.. మనకు కూడా ముందస్తు………… అది వచ్చి పలకరిస్తుంది. బతికుంటే బలుసాకు తినొచ్చు అని.. పెద్దలు ఊరికే చెప్పలేదు.
…సమాప్తం…