ప్రత్యేక వ్యాసం by సీనియర్ జర్నలిస్ట్ ఆది
నిజంగానే ‘బీఆర్ఎస్’ పై ఫేక్ ప్రచారం జరిగిందా ?
చేతులు కాలాక ఆకులు పట్టుకున్నట్టు.. నేల విడిచి సాము చేసినట్టు… ఇలా చాలానే సామెతలు గుర్తుకు వస్తున్నాయి.. కేటీఆర్ కామెంట్లను బట్టీ చూస్తుంటే.. ఇక్కడ రెండు మూడు పాయింట్లను స్పష్టంగా పేర్కొనాల్సి ఉంది. మొదటిది తీన్మార్ మల్లన్నను బద్ధ వ్యతిరేకి చేసుకోవడం. జర్నలిస్టు జాతిని దూరం పెట్టడం. ఈ రెండు అంశాలు అంచెలంచెలుగా యాంటీ బీఆర్ఎస్ వాయిస్ కి కేంద్ర బిందువులయ్యాయి.
మొదటిది మల్లన్న విషయానికి వస్తే.. ఇతడు ఈ మొత్తం యూట్యూబ్ యాంటీ వాయిస్ కి మెయిన్ లీడర్. ట్రెండ్ సెట్టర్. ఐకానిక్ ఫేస్ కమ్ వాయిస్ కట్. ఇతడు బీఆర్ఎస్ కొంప నిలువునా ముంచాడంటే అతిశయోక్తి కాదేమో. ఒకరకంగా మాట్లాడాల్సి వస్తే.. ఇతడొక రక్తబీజుడు. వాటీజ్ దిస్ బ్లడీ రక్త బీజ కాన్సెప్ట్ అంటే… పురాణ కథనాన్ని అనుసరించి చెబితే.. రక్తబీజుడి ఒక్కో రక్తపు చుక్క తిరిగి ఒక్కో రక్తబీజుడ్ని(రాక్షసుడ్ని) తయారు చేస్తుంది. ఈ ఫార్ములా ఇక్కడ యాజ్ ఇటీజ్ గా అప్లై చేసుకోవచ్చు. మల్లన్న చూపిన బాటలో క్యూ కట్టిన యాంటీ వాయిస్ ఓరియెంటెడ్ ఛానెళ్లు 32 అంత కాకున్నా.. ఓ పన్నెండయితే బలంగానే ఉన్నాయ్.. వీటి పనల్లా ఒక్కటే ఉదయం లేస్తే ఆడ మగ తేడా లేకుండా ఓ పెద్ద స్మార్ట్ స్క్రీన్ ముందు చేరడం. ఆ ఫోటో ఈ ఫోటో అటు- ఇటు తిప్పడం.. ప్రభుత్వాన్ని వాయించి వదిలి పెట్టడం. మధ్య మధ్య బాధితుల ఫోన్ ఇన్లు. అవసరమైన చోట వారినే నేరుగా తెర మీదకు తీసుకురావడం.. ఇదో క్రొనాలజీ. రాన్రాను ఇదొక మానియా సరిగ్గా అదే సమయంలో ఒక మాఫియా కింద తయారైన విషయమూ తెలిసిందే.
మల్లన్న ఎక్కడి వరకూ వెళ్లాడంటే.. ఏదైనా ఒక సమస్య వస్తే.. ఇతడేదో హైకోర్టు చీఫ్ జస్టిస్ అయినట్టు అతడి దగ్గరకు క్యూ కట్టేవారు. ఇలాంటి ఉదాహరణలు, ఉదంతాలు చాలానే. ఇతడిలాగానే.. జర్నలిస్టు రఘు\ కాళోజీ తదితర యూట్యూబ్ ఛానెళ్లు.. మల్లన్న కా బాప్ అనిపించాయి. ఒక దశలో మల్లన్న మీద వరుస కేసులు పెట్టగా.. అవన్నీ అతడ్ని ఏమీ చేయలేక పోగా.. మరింత బలవంతుడ్ని చేశాయి. దీంతో అతడొక అతీత శక్తిగా మారిపోయాడు. దీనంతటికీ కారణం.. అతడొక గ్రాడ్యుయేట్ ఎమ్మెల్సీ టికెట్ ఆశిస్తే.. అది నాటి టీఆర్ఎస్ ఇవ్వక పోవడం. తర్వాత రేవంత్ అనుంగు శిష్యుడిగా మారటం. హుజూర్ నగర్ లో స్వతంత్రుడిగా పోటీ చేసి.. ఉత్తమ్ సతీమణి ఓటమికి కారకుడవ్వడం. ఆపై కాంగ్రెస్ లో చేరిక. తిరిగి బయటకు.. ఆ తర్వాత స్వతంత్రుడిగా ఎమ్మెల్సీ పోటీల్లో నిలవటం. బీజేపీలో చేరడం. మళ్లీ బయటకు రావడం. అరెస్టు కావడం. ఎన్నికలయ్యే వరకూ జైల్లోనే ఉంటాడన్న మాట వినిపించడం. అంతకన్నా ముందు 7200 అనే సమూహాన్ని ఒకటి పెడతానని ప్రతినబూననం.. ఇటీవల తెలంగాణ నిర్మాణ పార్టీ పెడతాడట.. అన్న మాట వినిపించడం.. ఇలా మల్లన్న ఒక మాయావిగా అవతరించేశాడు.
రీసెంట్ గా అంటే ఈ ఎన్నికల ముందు మల్లన్న అలియాస్ చింతపండు నవీన్ కి రేవంత్ 5 కోట్లు ఇచ్చాడని.. ఇతడి క్లోన్ జర్నలిస్ట్ రఘుకు మరో రెండు కోట్ల వరకూ ముట్టాయన్న టాకూ వెలువడ్డం వరకూ ఇదంతా ఒక ప్రహసనం. బీఆర్ఎస్ కొంప నిలువునా ముంచిన వ్యవహారానికి సంబంధించిన అతి కీలకమైన విషయం. వీసిక్స్ లో పని చేస్తున్నన్ని రోజులు.. ఉద్యమం జరుగుతున్నంత సేపూ.. మల్లన్న బీఆర్ఎస్ కి ప్రొ గానే ఉన్నాడు. కేసీఆర్ కి ఆకాశానికి ఎత్తేసేవాడు.. నాటి టీఆర్ఎస్ అంటే ఊగిపోయేవాడు. తీరా రాష్ట్రం వచ్చాక.. గ్రాడ్యుయేట్ ఎమ్మెల్సీ టికెట్ ఆశించ భంగపడ్డ ఇతడు తర్వాత విశ్వరూపం చూపించడంతో పాటు తనలాంటి ఎందరో జర్నలిస్టులకు యాంటీ govt., యూట్యూబ్ అనే దారి చూపడంతో.. చాలా పెద్ద డ్యామేజీ జరిగిపోయింది.
ఇక రెండో తప్పిదం.. జర్నలిస్టులను అస్సలు పట్టించుకోక పోవడం. ఉద్యమ కాలంలో.. ఆఫీస్ బాయ్ నుంచి సీఈఓ వరకూ ఇళ్ల స్థలాలిస్తానని నమ్మ బలికిన కేసీఆర్.. మొన్నా మధ్య.. పాముకు ఎవరైనా పాలు పోస్తర అనే వరకూ వచ్చేశాడు. దీంతో జర్నలిస్టులకు హ్యాండు ఇచ్చుట అనే ప్రక్రియ సంపూర్ణమయ్యింది. అంతే కాదు 70 శాతం జర్నలిస్టులకు ఏ మాత్రం ఇంటి స్థలం రావడానికి వీల్లేని విధంగా ఒక జీవోని తీసుకొచ్చి.. తద్వారా.. వారి గుండెల్లో గునపాలు దించేసింది కేసీఆర్ సర్కార్. ఈ టైంలో అయినా కేటీఆర్ పరిస్థితిని కాస్త చక్క దిద్దే పని చేయాల్సి ఉండే.. కానీ అలాంటిదేం చేయకుండా తన జల్సాలేవో తాను చేసుకుంటూ… తన ఇల్లు చక్కబెట్టుకోవడంతో మాత్రమే సరిపుచ్చడంతో ఇదిగో ఇదీ పరిస్థితి.
జకీర్ లాంటి చాలా మంది సీనియర్ జర్నలిస్టులు.. ఈ ప్రభుత్వం పోవాలి. కాంగ్రెస్ ప్రభుత్వం రావాలని ఆశించే వరకూ జరిగిన నష్టం మాటల్లో చెప్పనలవి కానిది. ఎప్పుడూగానీ ఒక రాజకీయ నాయకుడు రెండింటిని తన వెంట బలంగా ఉండేలా చూసుకోవాలి. వాటిలో మొదటిది కార్యకర్తల నుంచి చోటా మోటా లీడర్షిప్ ఫాలో- అప్. రెండోది.. జర్నలిస్టు జాతి మంచి చెడ్డలపై ఒక నజర్. ఈ ఇద్దరి అండదండలు లేకుండా రాజకీయాలు చేయడం అంటే అది చాలా చాలా కష్టం. ఫర్ సపోజ్ మల్లన్న అంతగా రెచ్చిపోతుంటే స్వచ్ఛందంగా ముందుకొచ్చి అది కాదు ఇది అని కౌంటర్ ఇచ్చిన జర్నలిస్టులు లేరు. సరే టీన్యూస్, నమస్తే తెలంగాణ.. పార్టీ లైన్ కి వాల్యూ ఇచ్చే ఇతర సో కాల్డ్ ప్రైమ్\ మెయిన్ స్ట్రీమ్ మీడియా చానెళ్లు ఉన్నాయంటే.. వాటి పరిధి అంతంత మాత్రమే.
మల్లన్న లాంటి వాళ్లు రెచ్చిపోతుంటే.. స్వచ్ఛందంగా ముందుకొచ్చి.. కౌంటర్ ఇవ్వాల్సిన జే- బ్రిగేడ్ ఒకటి ఉండాలి. అదలా ఉండాలంటే.. ఆ జాతి మొత్తానికి చాలానే మేలు జరగాలి. అలా జరక్క పోగా.. వారంతా కూడా.. అంతేగా! అంతేగా!! అంటూ మల్లన్న లాంటి వారికే తానతందాన పలికిన ఉదంతాలు బోలెడు. (చివరికి పార్కింగ్ లో కూడా జర్నలిస్టులకు వాల్యూ లేకుండా చేశారు. కేసీఆర్ జమాన్ల.. మీకు వాల్యూ ఇచ్చుడు లేదు గదన్న అంటూ ఒకడు నా మొహాన్నే అడిగేశాడు కూడా) ఈ కండీషన్ని ఎంత మాత్రం పట్టించుకోకుండా.. యాంటీ వాయిస్ గాళ్లను ఎంత మాత్రం క్రైటీరియాలోకి తీసుకోకుండా.. జర్నలిస్టుల బాగోగులు మరే మాత్రం పట్టించుకోకుండా.. పైపెచ్చు వారిపై ఉక్కు పాదం మోపినంత పని చేయడం చాలా పెద్ద చేటు తెచ్చిందని చెప్పక తప్పదు.
ఏదో అకాడమీ ఛైర్మన్ గా అల్లంనారాయణవంటి వారికి పెద్ద పీట వేసి.. ఎక్కడో ఎప్పుడో అరా కొర జర్నలిస్టులకు సంక్షేమం ఇచ్చామని చెప్పడంతో సరిపోయిందనుకుంది కేసీఆర్ ప్రభుత్వం. పాతరేస్తాం అంటూ… తొలినాళ్లలో కేసీఆర్ చేసిన యాంటీ జర్నలిస్టిక్ కామెంట్స్ ఇప్పటికీ చాలా మంది చెవుల్లో మారుమోగుతూనే ఉన్నాయ్. రీసెంట్ గా కూడా.. ఆయన జర్నలిస్టుల మేలు యాజమాన్యం దృష్టికోణంలో మాత్రమే చూశారన్న చెడ్డ పేరొచ్చింది.. ఇలా అనాలోచితంగా.. తమకు ఎంతో మేలు చేసిన జాతి వ్యతిరేకంగా తీసుకున్న నిర్ణయాల తాలూకూ ప్రభావమే ఇది.
ఈ క్రమంలో మాపై ఫేక్ ప్రచారం జరిగింది. మేం ఆ విధంగా నష్టపోయాం. ఆ నెటిజన్ అన్నట్టు 32 మెడికల్ కాలేజీలకు బదులు 32 యూ ట్యూబ్ ఛానెళ్లు పెట్టి ఉన్నా సరిపోయేదని ఆకులు పట్టుకుంటే సరిపోద్దా… ఒక వేళ మీరలా చానెళ్లు పెట్టుకున్నా సరిపోదు కేటీఆర్ సార్. ఎందుకంటే అటు వైపు మీ మీద దాడి చేసిన వర్గానిది కేవలం జర్నలిజం కాదు.. కడుపు మంట. ఆ స్ట్రమక్ ఫైర్స్ కి ధీటుగా కౌంటర్ అటాక్ చేయాలంటే.. ఇటు వైపు అంతే స్థాయిలో జాతి తరఫు మాట్లాడే గళం కావాలి. అలా కావాలంటే.. దాన్ని అంతకన్నా ముందే బాగా చూసుకుని ఉండాలి.
ఇవాళ చంద్రబాబు చూడండీ.. తాను పేరు ప్రకారం- సీ అయినా రెండు- జేలను ఎట్టి పరిస్థితుల్లోనూ వదలుకోడు. పట్టు వీడడు. తన బలమైన ప్రత్యర్ధి జే- మీన్స్ జగన్ మోహన రెడ్డిని ఢీ కొట్టడానికి.. ఫస్ట్ జే- జ్యుడిషియరీ, సెకండ్ జే- జర్నలిజాన్ని అస్సలు వదులుకోడాయన. పైపెచ్చు మనల్ని కాపాడే ప్రధానాస్త్రాలు ఇవేనని బలంగా విశ్వసిస్తాడు. దాని ఫలితం ఇవాళ 2024- ఏపీ ఎలెక్షన్స్ లో స్వతహాగా తనకు పెద్ద గెలుపు నమ్మకాలు లేక పోయినా.. జగన్ పని అయిపోయిందీ అయిపోయిందీ అంటూ తాను పెంచి పోషిస్తూ వస్తోన్న సెకండ్- జే ఆయనకు ఎక్కడా లేని బూస్టప్ ఇస్తోంది. ఇక వచ్చేది బాబు ప్రభుత్వమే అంటూ జనాన్ని ఒక రకంగా టాంపరింగ్ చేసేస్తోంది.
ఇదేదీ గుర్తించకుండా యూట్యూబ్ ఛానెళ్లు పెట్టి ఉంటే సరిపోయి ఉండేదని వాపోవడంలో ఎలాంటి యూజ్ లేదు మిష్టర్ ఎక్స్ మినిష్టర్. ఆ రోజున మీరు పెట్టాల్సింది యూట్యూబ్ చానెళ్లు కూడా కావు. జర్నలిస్టు సంక్షేమం. అది సరిగ్గా చేపట్టి ఉంటే.. ఈ రోజున ఇంత పెద్ద ఉపద్రవం వచ్చి ఉండేది కాదు. ఇప్పటికైనా మించి పోయింది లేదు. మీ నాన్నగారి యాంటీ జర్నలిస్టిక్ పంథాను వీడి.. ప్రొ మెథడ్ ఫాలో కండి.. మీకంతా మంచే జరుగుతుందని చెప్పలేం కానీ. ఆశించొచ్చు. ఏమంటారు???
ప్రత్యేక వ్యాసం by సీనియర్ జర్నలిస్ట్ ఆది