ఆరు గ్యారంటీలు ఇచ్చి కాంగ్రెస్ ప్రభుత్వం ప్రజలను మోసం చేసిందని బీఆర్ఎస్ నేత జగదీశ్ రెడ్డి విమర్శించారు. తెలంగాణ వేదికగా కాంగ్రెస్ నేతలు మరో మోసానికి తెరలేపారని మండిపడ్డారు. తెలంగాణలో కాంగ్రెస్ ఇచ్చిన హామీలు నీటిమూటలని తేలిపోయిందన్నారు. కర్ణాటక, తెలంగాణలో చేసినట్టే ప్రజలందరికీ కాంగ్రెస్ దోఖా ఇచ్చిందని ఆగ్రహం వ్యక్తం చేశారు.
మార్పు కొత్తగా ఉంటుందని ప్రజలు భ్రమ పడ్డారని 2014కు ముందు దుస్థితి వస్తుందని వాళ్లు అనుకోలేదని జగదీశ్ రెడ్డి అన్నారు. మహిళలకు నెలకు రూ.2500 ఇస్తామని ఇవ్వలేదని మండిపడ్డారు. ఇప్పుడు మహిళలకు ఏడాదికి లక్ష ఇస్తామని మళ్లీ హామీ ఇస్తున్నారని విమర్శించారు. బీఆర్‌ఎస్ నుంచి చేరిన వారిని పక్కన పెట్టుకుని కాంగ్రెస్ నాయకులు నీతులు చెబుతున్నారని ఎద్దేవాచేశారు. రాహుల్‌గాంధీకి చిత్తశుద్ధి ఉంటే ఆ ముగ్గురు ఎమ్మెల్యేలపై అనర్హత వేటు వేయించాలని సూచించారు. బీఆర్‌ఎస్ నుంచి చేరిన ఎమ్మెల్యేలతో రాజీనామా చేయించాలని సవాలు విసిరారు.
రైతుబంధు అడ్డుకోబోమని కేసీఆర్ చెప్పారని జగదీశ్ రెడ్డి అన్నారు. రైతుబంధు ఇవ్వకుండా ప్రభుత్వాన్ని ఎవరూ అడ్డుకోరని స్పష్టం చేశారు. రైతుల ప్రయోజనాలే ముఖ్యమని కేసీఆర్ చెప్పారని అన్నారు. కేసీఆర్ వస్తుంటే కాంగ్రెస్ నేతలకు లాగులు తడిసినయ్ అని అన్నారు. అందుకే కేసీఆర్ వస్తున్నారని ప్రాజెక్టుల నుంచి నీళ్లు వదిలారని అన్నారు. లేవన్న నీళ్లు ఎట్ల వచ్చినయ్.. పనిచేయవన్న మోటార్లు ఎట్ల నడిచినయ్ అని ప్రశ్నించారు. పంటలు ఎండిన తర్వాత నీళ్లుస్తుంటే రైతులు నవ్వుకుంటున్నారని అన్నారు. ముందే నీళ్లు వదిలి ఉంటే పంటలకు నష్టం జరిగేది కాదని అభిప్రాయపడ్డారు. వ్యవసాయాన్ని నిలబెట్టేందుకు కేసీఆర్ రేయింబవళ్లు కష్టపడ్డారని చెప్పారు. పదేండ్లు కష్టపడి వ్యవసాయాన్ని కేసీఆర్ నిలబెడితే.. మూడు నెలల్లోనే కాంగ్రెస్ ప్రభుత్వం నాశనం చేసిందని మండిపడ్డారు. దీనికి కాంగ్రెస్ ప్రభుత్వం సిగ్గుపడాలన్నారు. సాగర్‌లో నీటిమట్టం ఇంతకంటే తక్కువ ఉన్నప్పుడు కూడా నీళ్లు ఇచ్చామని చెప్పారు.
వంద రోజుల్లో రాష్ట్రంలో వసూళ్లు చేసి ఢిల్లీకి కప్పం కడుతున్నారని విమర్శించారు. కుర్చీని కాపాడుకునేందుకు మంత్రులు కష్టపడుతున్నారని ఎద్దేవా చేశారు. మిల్లర్లు, క్రషర్ యజమానులు, కాంట్రాక్టర్ల దగ్గర వసూళ్లకు కష్టపడుతున్నారని అన్నారు. మిల్లర్ల దయదాక్షిణ్యాలపై రైతులను వదిలేశారని ఆవేదన వ్యక్తంచేశారు. కాంగ్రెస్ ప్రభుత్వం వచ్చినంక ఉన్న ధర పోయిందని రైతులు బాధపడుతున్నారని అన్నారు. నిన్న తుక్కుగూడలో జరిగిన సభలో కాంగ్రెస్ నేతల మాటల్లో రైతుల ప్రస్తావనే లేదని మండిపడ్డారు. మంత్రులకు ఐపీఎల్ చూడటానికి ఉన్న ప్రాధాన్యం రైతులపై లేదని అన్నారు. జేబు దొంగలు, పగటి దొంగల్లా కాంగ్రెస్ దుర్మార్గపు పాలన ఉందని మండిపడ్డారు. 2014 కంటే ముందు ఉన్న ఆరాచకాలు అన్నీ మళ్లీ మొదలయ్యాయని ఆవేదన వ్యక్తం చేశారు.
మాట్లాడితే కేసులు పెడతాం.. జైలులో పెడతామని కాంగ్రెస్ నేతలు ఉడత ఊపులకు పోతున్నారని అన్నారు. కేసీఆర్ ముఖ్యమంత్రిగా ఉన్నప్పుడు ఏనాడైనా ఇలా కేసులు పెడతామని బెదిరించారా? అని ప్రశ్నించారు. ఎండిన పంటలకు తక్షణమే ఎకరానికి 25వేల చొప్పున పరిహారం అందించాలని జగదీశ్ రెడ్డి డిమాండ్ చేశారు. అన్ని పంటలకు క్వింటాలుకు రూ.500 బోనస్ ఇవ్వాలని సూచించారు. రైతులకు వెంటనే రూ.2లక్షలు రుణమాఫీ చేయాలన్నారు. రైతుల జోలికి వెళ్లొద్దని బ్యాంకులకు ప్రభుత్వం హామీ ఇవ్వాలని కోరారు.