తెల్ల బంగారం @ రూ. 7,610, వరంగల్‌లో ధర పలికిన క్వింటాల్ పత్తి, దేశవ్యాప్తంగా తగ్గిన పంట సాగు, అంతర్జాతీయంగా పెరిగిన డిమాండ్, ట్రేడర్ల వద్దే కొనుగోలయ్యే అవకాశం, నామమాత్రమే కానున్న సీసీఐ (CCI) పాత్ర!
తెల్ల బంగారంగా పిలిచే పత్తి రైతు బతుకును బంగారుమయం చేయనున్నది. ఈ ఏడాది పత్తికి భారీ ధర పలుకనున్నది. దేశవ్యాప్తంగా పంట సాగు తగ్గడం.. అదే సమయంలో అంతర్జాతీయంగా డిమాండ్ పెరగడంతో రికార్డు ధర ఖాయమని మార్కెట్ వర్గాలు అంచనా వేస్తున్నాయి. ఎంఎస్పీ కంటే ఎక్కువ ధర పలికే అవకాశాలు ఉండటంతో కాటన్ కార్పొరేషన్ ఆఫ్ ఇండియాకు పత్తి కొనుగోలు చేసే అవసరం రాకపోవచ్చని పేర్కొంటున్నారు.
ప్రస్తుతం పత్తి మద్దతు ధరకు పొడవు గింజ రకం రూ.6,025, మద్యస్థం రూ.5,726గా ఉన్నది. కానీ, కొన్ని నెలలుగా పలు మార్కెట్లలో మద్దతుకు మించి ధర పలుకుతున్నది. ఆగస్టు మొదటి వారంలో వరంగల్ మార్కెట్లో రికార్డుస్థాయిలో రూ.8 వేలకుపైగా ధర రావడం గమనార్హం. కనిష్ఠంగా రూ.6 వేల నుంచి రూ.7,200 వరకు ధర వచ్చింది. ఈ సీజన్‌లో కొత్త పత్తి మార్కెట్లోకి రావడం మొదలుకాగా.. మంగళవారం వరంగల్ మార్కెట్లో క్వింటాల్‌కు రూ.7,610 ధర పలికింది.
తగ్గిన సాగు.. పెరిగిన డిమాండ్
—————————
దేశవ్యాప్తంగా ఈ ఏడాది పత్తి సాగు 20 లక్షల ఎకరాలదాకా తగ్గింది. గతేడాది 312.46 లక్షల ఎకరాల్లో పంటవేయగా.. ఈసారి 292.35 లక్షల ఎకరాల్లోనే సాగైంది. పత్తిని ప్రధానంగా పండించే ఐదు రాష్ర్టాల్లో ఈసారి సాగు తగ్గింది. ముఖ్యంగా మహారాష్ట్ర, తెలంగాణలో భారీగా తగ్గింది. ఈసారి పత్తి సాగులో మహారాష్ట్ర 97.26 లక్షల ఎకరాలతో మొదటి స్థానంలో ఉన్నది. 55.62 లక్షల ఎకరాలతో గుజరాత్, 50.68 లక్షల ఎకరాలతో తెలంగాణ రెండు, మూడు స్థానాల్లో నిలిచాయి. ప్రపంచ మార్కెట్‌ను పరిశీలిస్తే ఈసారి భారత్ నుంచే ఎక్కువ పత్తి ఉత్పత్తి అవుతుందని ట్రేడ్ వర్గాలు అంచనా వేస్తున్నాయి.
తెలంగాణ వ్యవసాయ విశ్వవిద్యాలయం మార్కెటింగ్ వింగ్ అంచనాల ప్రకారం 2021-22లో ప్రపంచవ్యాప్తంగా 82.28 మిలియన్ ఎకరాల్లో పత్తి సాగు చేయగా 118.8 మిలియన్ బేల్స్ (ఒక్కో బేల్ 217.72 కేజీలు) ఉత్పత్తి అవుతుందని అంచనా వేసింది. ఇందులో భారత్ నుంచి 29 మిలియన్ బేల్స్, చైనా నుంచి 26.8, అమెరికా 17.3, బ్రెజిల్ 12.5, పాకిస్థాన్ నుంచి 5 మిలియన్ బేళ్ల పంట ఉత్పత్తవుతుందని చెప్తున్నారు.