ఈ నెల 18న నిర్వహించనున్న ఖమ్మం బహిరంగసభలో రెండో విడత కంటివెలుగు కార్యక్రమానికి ముఖ్యమంత్రి కేసీఆర్ శ్రీకారం చుట్టనున్నారు. ప్రపంచంలోనే అతిపెద్ద నేత్రపరీక్ష కార్యక్రమాన్ని మూడు రాష్ట్రాల ముఖ్యమంత్రుల చేతుల మీదుగా లాంఛనంగా ప్రారంభించనున్నారు. ఢిల్లీ ముఖ్యమంత్రి అర్వింద్ కేజ్రీవాల్, కేరళ సీఎం పినరాయి విజయన్, పంజాబ్ సీఎం భగవంత్ మాన్ ఈ కార్యక్రమంలో పాల్గొననున్నారు.
ఈ సందర్భంగా కంటివెలుగు కార్యక్రమం, ఉచితంగా కండ్లద్దాల పంపిణీకి సంబంధించిన విషయాలను వారికి సీఎం కేసీఆర్ వివరించనున్నారు. ఇప్పటికే ప్రభుత్వం గతంలో నిర్వహించిన తొలి విడత కంటివెలుగు కార్యక్రమంలో రాష్ట్రవ్యాప్ంతగా సుమారు 1.54 కోట్ల మందికి కంటి పరీక్షలు నిర్వహించి 50 లక్షల మందికి కండ్లద్దాలు పంపిణీ చేశారు. ఈ సారి అవసరాన్ని బట్టి దాదాపు 60 లక్షల మందికి కండ్లద్దాలు పంపిణీచేసేందుకు ఏర్పాట్లు చేస్తున్నారు.