ఎన్నికల సెల్ అధికారులు మరియు సిబ్బందికి నగదు రివార్డులు అందించిన కమిషనర్
లోక్ సభ ఎన్నికల నిర్వహణలో సమర్థవంతంగా విధులు నిర్వర్తించిన రాచకొండ ఎన్నికల సెల్ అధికారులు మరియు సిబ్బందిని కమిషనర్ శ్రీ తరుణ్ జోషి ఐపీఎస్ గారు అభినందించి నగదు రివార్డులు అందించారు. ఈ సందర్భంగా కమిషనర్ మాట్లాడుతూ ఎన్నికల సెల్ పనితీరును డీజీపి ఆఫీసుతో పాటు ఎన్నికల అబ్జర్వర్లు కూడా ప్రశంసించినట్లు తెలిపారు. లోక్ సభ ఎన్నికల నిర్వహణలో ఎలక్షన్ సెల్ పాత్ర ఎంతో ముఖ్యమని, ఎన్నికల నోటిఫికేషన్ విడుదల నుండి ఎన్నికలు ముగిసే వరకు ప్రతీ దశలోనూ ఎన్నికల సెల్ తమ బాధ్యతను సమర్థవంతంగా నిర్వర్తించిందని తెలిపారు. ఎన్నికల నిర్వహణ అనేది ఎన్నో సవాళ్లతో కూడుకున్నదని, క్షేత్రస్థాయిలో బందోబస్తు విధులు నిర్వర్తిస్తున్న అన్ని విభాగాల పోలీసు సిబ్బందికి ఎలక్షన్ సెల్ చక్కటి మార్గనిర్దేశనం చేసిందని పేర్కొన్నారు.
ఎన్నికల నోటిఫికేషన్ విడుదల అయినప్పటి నుండి రాచకొండ పరిధిలోని అన్ని ప్రాంతాలలోనూ జరుగుతున్న పరిణామాలను ఎప్పటికప్పుడు ఎలక్షన్ సెల్ ద్వారా పర్యవేక్షించడం వల్ల ఎటువంటి ఇబ్బందులూ లేకుండా ఎన్నికల ప్రక్రియ ముగిసింది అన్నారు. విధి నిర్వహణలో ఉన్న అన్ని విభాగాల అధికారులు మరియు సిబ్బంది ప్రతీ ఒక్కరూ తమ బాధ్యతను సక్రమంగా నిర్వర్తించడం వల్లనే ఎటువంటి అవాంఛనీయ సంఘటనలు లేకుండా ఎన్నికలు ప్రశాంతంగా జరిగాయి అని పేర్కొన్నారు.