పూర్వం మునులు తపస్సు చేసి దేవుళ్లనూ, దేవతలనూ మెప్పించి వరాలు పొందేవారు. అసురులు కూడా ఇలా చేసినప్పటికీ వారు వరాలను దుర్వినియోగం చేసేవారు. తత్ఫలితంగా దైవాల చేతుల్లోనే సమ్హరించబడేవారు. సజ్జనులు మాత్రం దైవాల చేత పొందిన వరాలను లోక కళ్యాణార్థం వినియోగించేవారు.
అయితే, సాధారణంగానే భోళా శంకరుడిగా పేరొందిన పరమేశ్వరుడు, భక్తుల కోర్కెలను తీర్చడంలో పెట్టింది పేరు. ఈ కలియుగంలోనూ ఓ భక్తుడు మహా శివుడి మనసును గెలుచుకుని ఆయన ఆవిర్భవించేలా చేసిన క్షేత్రం ఏదో మీకు తెలుసా? అనంతపురం జిల్లాలోని ముసలమ్మ కట్టలో వుంది ఈ క్షేత్రం. ఆ క్షేత్ర విశేషాలేంటో తెలుసుకుందాం.
స్థల పురాణాన్ని పరిశీలిస్తే ప్రాచీన నేపథ్యం ఈ క్షేత్రానికి వుందనీ, హరిహర బుక్కరాయల కాలంలో ప్రసిద్ధి పొందిందనీ స్పష్టంగా తెలుస్తుంది. ఆలయం శిధిలావస్థకు చేరుకోగా, తమిళనాడు ప్రాంతానికి చెందిన ఓ అవధూతకు స్వామివారు స్వప్న దర్శనమిచ్చి తన జాడను తెలియజేశారు. స్వామి ఆదేశం మేరకు ఆయన కాశీ నుంచి సాలగ్రామ శిల అయినటువంటి శివలింగాన్ని ఇక్కడికి తీసుకు వచ్చి ప్రతిష్ఠించారు. ఈ కారణంగానే స్వామివారిని భక్తులు కాశీ విశ్వేశ్వరుడిగా కొలుస్తుంటారు. గర్భాలయంలో శివుడు మహిమాన్వితుడై మహా తేజస్సుతో వెలిగిపోతుంటాడు. నిస్వార్ధమైన భక్తితో తనని వెదుక్కుంటూ వచ్చే భక్తుల కోసం ఆత్రంగా ఎదురు చూస్తున్నట్టుగా దర్శనమిస్తాడు. ఇక ఆ పక్కనే అమ్మవారు ‘విశాలాక్షి’గా కుంకుమ పూజలు అందుకుంటూ వుంటుంది. స్వామివారికి నాలుగు సమయాల్లో సమర్పించే హారతులు ఇక్కడి ప్రత్యేకతగా చెబుతుంటారు. భక్తులు ఈ హారతుల కోసం తప్పనిసరిగా వేచివుంటారు.
ఇదే ప్రాంగణంలో అమృత గణపతి, శ్రీసుబ్రహ్మణ్యస్వామి, శ్రీఅయ్యప్పస్వామితో పాటు నవగ్రహ మందిరం సైతం కొలువుదీరి వుంది. పర్వదినాల సమయంలో భక్తులు అధిక సంఖ్యలో ఇక్కడి స్వామివార్లను దర్శించుకుంటూండడంవల్ల ఆయా సమయాల్లో ఆలయం కిటకిటలాడుతూంటుంది. పచ్చని ప్రకృతి అందాల నడుమ ఆధ్యాత్మిక సుగంధాలను వెదజల్లుతోన్న ఈ క్షేత్రాన్ని దర్శించుకుంటే పాపాలు పటాపంచలవుతాయనీ, సమస్త దోషాలు తొలగిపోతాయనేది భక్తుల ప్రగాఢ విశ్వాసం.