Telangana TDP President L Ramana Joined in TRS Party, CM KCR, Chandrababu Naidu, Telangana Poltical News,Telugu World Now,
Telangana Political News: తెలంగాణ టీడీపీ అధ్యక్ష పదవికి ఎల్ రమణ రాజీనామా.
తెలంగాణ టీడీపీ అధ్యక్ష పదవికి ఎల్ రమణ గురువారం ఉదయం రాజీనామా చేశారు. తన రాజీనామా లేఖను చంద్రబాబుకు రమణ పంపారు. తెలంగాణలో మారుతున్న రాజకీయ సమీకరణాల నేపథ్యంలో ప్రజలకు మరింత చేరువగా, రాష్ట్ర ప్రగతిలో భాగస్వామ్యం కావాలనే భావనతో టీఆర్ఎస్ పార్టీలో చేరాలని నిర్ణయించుకున్నాను అని రమణ తెలిపారు. ఈ క్రమంలో తెలంగాణ టీడీపీ అధ్యక్ష పదవికి రాజీనామా చేస్తున్నాను. గత 30 సంవత్సరాలుగా తన ఎదుగుదలకు తోడ్పాటునందించిన చంద్రబాబుకు రమణ హృదయపూర్వక ధన్యవాదాలు తెలిపారు.
టీఆర్‌ఎస్ అధినేత, ముఖ్యమంత్రి కే చంద్రశేఖర్‌రావుతో ఎల్. రమణ గురువారం రాత్రి భేటీ అయిన విషయం విదితమే. రాష్ట్ర పంచాయతీరాజ్‌శాఖ మంత్రి ఎర్రబెల్లి దయాకర్‌రావుతో కలిసి ఆయన ప్రగతిభవన్‌కు వచ్చారు. ఈ సందర్భంగా వీరి మధ్య దాదాపు గంటన్నరకుపైగా చర్చలు జరిగాయి. అనంతరం మంత్రి ఎర్రబెల్లి దయాకర్‌రావుతో కలిసి ఎల్. రమణ మీడియాతో మాట్లాడుతూ.. తాను సీఎం కేసీఆర్‌ను కలిసి, జగిత్యాలకు వైద్య కళాశాల ఇచ్చినందుకు కృతజ్ఞతలు తెలిపినట్టు వెల్లడించారు. తెలంగాణ రాష్ట్ర సాధన ఉద్యమ ప్రస్థానం, గత ఏడేండ్లలో స్వరాష్ట్రంలో సాధించిన అభివృద్ధి, సంక్షేమ పథకాలపై సీఎం కేసీఆర్‌తో సుదీర్ఘంగా చర్చించినట్టు వివరించారు.
దేశంలో వివిధ రాష్ట్రాలు ఏర్పడిన తర్వాత ఆయా రాష్ట్రాల్లో జరిగిన పరిణామాలు.. తెలంగాణలో జరుగుతున్న ప్రగతిపై సీఎం కేసీఆర్ విడమరచి చెప్పారని ఆయన తెలిపారు. సామాజిక తెలంగాణ సాధించాలన్న సంకల్పంతో సీఎం కేసీఆర్ రాష్ట్రంలోని అన్ని వర్గాల అభివృద్ధి, సంక్షేమానికి అధిక ప్రాధాన్యం ఇస్తున్నారని కొనియాడారు. సీఎం కేసీఆర్ చేపట్టిన పాలనా సంస్కరణలు అద్భుత ఫలితాలిస్తున్నాయని ప్రశంసించారు. కొవిడ్ విషయంలో ప్రభుత్వం బాధ్యతాయుతంగా వ్యవహరించిందని కితాబిచ్చారు.