పీహెచ్‌సీల నుంచి మెడికల్ కాలేజీల వరకు అన్ని ప్రభుత్వ దవాఖానలను ఆకస్మికంగా తనిఖీ చేయనున్నట్టు వైద్య, ఆరోగ్యశాఖ మంత్రి తన్నీరు హరీశ్‌రావు స్పష్టంచేశారు. ప్రాథమిక, కమ్యూనిటీ, ఏరియా, జిల్లా దవాఖానల పనితీరును మెరుగుపరిచి, ప్రజలు విశ్వాసాన్ని చూరగొనాలని అధికారులను ఆదేశించారు. శనివారం ఆయన బీఆర్కే భవన్ నుంచి అన్ని జిల్లాల కలెక్టర్లు, డీఎంహెచ్‌వోలు, డీసీహెచ్‌లతో వీడియోకాన్ఫరెన్స్ నిర్వహించారు. వ్యాక్సినేషన్, దవాఖానలు, నూతన మెడికల్ కాలేజీల్లో వసతుల కల్పన తదితర అంశాలపై సమీక్షించారు. ఈ సందర్భంగా మంత్రి హరీశ్‌రావు మాట్లాడుతూ.. దవాఖానలకు మంజూరైన ఆక్సిజన్ ప్లాంట్ల పనులను పూర్తి చేయించాలని పేర్కొన్నారు. ఆశ వర్కర్స్ నుంచి దవాఖాన సూపరింటెండెంట్ వరకు అందరి పనితీరును మానిటర్ చేయాలని చెప్పారు. ఇకపై పనితీరును బట్టే పోస్టింగ్‌లు, ప్రోత్సాహకాలు ఉంటాయని స్పష్టంచేశారు. ప్రతి ఒక్కరికీ టీకాలు వేసి, వందశాతం కొవిడ్ వ్యాక్సినేషన్ జరిగిన రాష్ట్రంగా మార్చాలని, ఆవాసాలు, గ్రామాలు, మండలాలవారీగా లక్ష్యాలను నిర్దేశించాలని కలెక్టర్లను ఆదేశించారు. రాష్ట్రంలో 18 ఏండ్లకు పైబడినవారు 2.77 కోట్ల మంది ఉండగా.. ఇప్పటివరకు 3.43 కోట్ల డోసులు ఇచ్చామని తెలిపారు. ఇందులో 2.35 కోట్ల మందికి అంటే టీకాలు పొందేందుకు అర్హత కలిగినవారిలో 85 శాతం మందికి మొదటి డోస్ ఇచ్చినట్టు వెల్లడించారు. 1.80 కోట్ల మందికి రెండో డోస్ వేసినట్టు తెలిపారు.
డిసెంబర్‌లోగా మెడికల్ కాలేజీల భవనాలు
————————————–
ప్రభుత్వం కొత్తగా మంజూరుచేసిన 8 మెడికల్ కాలేజీల భవనాలను డిసెంబర్‌లోపు పూర్తి చేయాలని కలెక్టర్లను మంత్రి హరీశ్‌రావు ఆదేశించారు. వాటికి అనుబంధంగా ఉన్న దవాఖానల పడకల సామర్థ్యాన్ని పెంచాలని, విద్యార్థుల వసతి కోసం అనువైన హాస్టల్ భవనాలను గుర్తించాలని సూచించారు. ప్రభుత్వ, ప్రైవేటు దవాఖానల్లో ఆరోగ్యశ్రీ ద్వారా ఉచితంగా 946 రకాల వైద్యసేవలు అందిస్తున్నామని చెప్పారు. ప్రభుత్వ దవాఖానల్లో ఆరోగ్యశ్రీకి అదనంగా ఆయుష్మాన్ భారత్ కింద 646 రకాల వైద్య సేవలను చేర్చినట్టు వెల్లడించారు. వైద్యానికి మరో రూ.10 వేల కోట్లు ఖర్చు పెడతామని సీఎం కేసీఆర్ చెప్పిన విషయాన్ని ఆయన గుర్తుచేశారు. తెలంగాణ డయాగ్నోస్టిక్స్ సేవలను ప్రజలకు అందించాలని ఆదేశించారు. కార్యక్రమంలో ఆరోగ్యశాఖ కార్యదర్శి రిజ్వీ, డీపీహెచ్ శ్రీనివాసరావు, డీఎంఈ రమేశ్‌రెడ్డి, సీఎం ఓఎస్డీ డాక్టర్ గంగాధర్ తదితరులు పాల్గొన్నారు.
నిలోఫర్‌లో 100 పడకల ఐసీయూ ప్రారంభం
—————————————-
హైదరాబాద్‌లోని నిలోఫర్ దవాఖానలో హైసియా, నిర్మాణ్ సంస్థలు ఆధునికీకరించిన వంద పడకల ఐసీయూను హరీశ్‌రావు శనివారం ప్రారంభించారు. కరోనా వైరస్ సెకండ్ వేవ్ తర్వాత దవాఖానల్లో మౌలిక వసతుల బలోపేతానికి ఈ రెండు సంస్థలు రూ.18 కోట్లు అందించాయని చెప్పారు. రూ.1.75 కోట్లతో మరో 25 ఐసీయూ పడకలను ఏర్పాటు చేసేందుకు ఇన్ఫోసిస్, నిర్మాణ్ ఒప్పందం చేసుకొన్నాయని వెల్లడించారు. రూ.33 కోట్లతో నిలోఫర్‌లో మరో 800 పడకలు అందుబాటులోకి తెస్తామని ప్రకటించారు. కరోనా మూడో వేవ్ వస్తే సమర్ధంగా ఎదుర్కొనేందుకు ప్రభుత్వం రూ.133 కోట్లు కేటాయించిందని చెప్పారు. చిన్న పిల్లల కోసం ఐదు వేల పడకలు అందుబాటులో ఉన్నాయని తెలిపారు. వైద్య, ఆరోగ్యశాఖ మంత్రి హోదాలో తొలిసారిగా నిలోఫర్‌ను సందర్శించిన హరీశ్‌రావు దాదాపు గంటపాటు దవాఖానలో కలియ తిరిగారు. పాత, కొత్త భవనాలను పరిశీలించారు. చిన్నారులకు అందుతున్న వైద్యసేవల గురించి సహాయకులను అడిగి తెలుసుకున్నారు. చిన్నారి చికిత్స కోసం ఆదిలాబాద్ జిల్లా నుంచి వచ్చిన యాదమ్మను ఆప్యాయంగా పలకరించారు. దవఖనాలో పనిచేసే నర్సులు దేవి, శాంతమ్మతో సమస్యలపై అడిగి తెలుసుకున్నారు.
కొత్తగూడెం వైద్యులకు అభినందనలు
—————————————-
కొత్తగూడెం: అడవిదున్న దాడిలో తీవ్రంగా గాయపడి, ముఖమంతా ఛిత్రమైన ఒక గిరిజనుడికి ఫేషియల్ రికన్‌స్ట్రక్షన్ చికిత్స చేసి, ప్రాణాలు కాపాడిన కొత్తగూడెం ప్రభుత్వ దవాఖాన వైద్యులను మంత్రులు హరీశ్‌రావు, పువ్వాడ అజయ్‌కుమార్, సత్యవతి రాథోడ్ అభినందించారు. భదాద్రి కొత్తగూడెం జిల్లా పాల్వంచ మండలం రేగులగూడెం గ్రామానికి చెందిన పశువుల కాపరి మొక్కటి సమ్మయ్యపై ఇటీవల అడవిదున్న దాడి చేసింది. ప్రాణాపాయ స్థితిలో ఉన్న ఆయనను కొత్తగూడెం ప్రభుత్వ దవాఖానకు తరలించగా.. డాక్టర్ రవిబాబు బృందం ఫేషియల్ రీ కన్‌స్ట్రక్షన్ సర్జరీ చేసింది. కార్పొరేట్ దవాఖానలో రూ.10 లక్షలయ్యే చికిత్సను ఉచితంగా చేసినట్టు వైద్యులు తెలిపారు.