కాలం తిరగబడింది. దశాబ్దాలపాటు కరువుతో ఆకలికి ఏడ్చిన తెలంగాణ నేల ఇప్పుడు దేశం నలుమూలల నుంచి పొట్టచేతపట్టుకొని వచ్చిన కార్మికుల కడుపు నింపుతున్నది. ఆప్యాయంగా ఆలింగనం చేసుకొని కన్న ఊరిని మరిపిస్తున్నది. బీహార్, ఉత్తరప్రదేశ్, ఛత్తీస్‌గఢ్, ఒడిశా, కర్ణాటక, మహారాష్ట్ర, ఆంధ్రప్రదేశ్.. ఇలా అనేక రాష్ర్టాల నుంచి కుటుంబాలకు కుటుంబాలే తరలివచ్చి తెలంగాణ నలుమూలలా కష్టించి పనిచేస్తూ నిశ్చింతగా జీవిస్తున్నాయి. ఏడున్నరేండ్లలో టీఆర్‌ఎస్ ప్రభుత్వం భారీగా నీటిపారుదల ప్రాజెక్టులు నిర్మించటంతో ఇప్పుడు బంజరు భూముల్లో కూడా మూడు పంటలు పండుతున్నాయి. దీంతో వరి, పత్తి, మిరప, తోటపంటల్లో కూలీలకు భారీగా డిమాండ్ ఏర్పడింది. వరి నాట్లు వేయటం మొదలు.. ధాన్యాన్ని మిల్లులకు తరలించేవరకు, పత్తి విత్తటం నుంచి తెల్లబంగారాన్ని కాంటావేసే వరకు అన్ని దశల్లోనూ మహిళలు, పురుషులకు సమానంగా పని దొరుకుతున్నది. చెరుకు, కూరగాయల సాగు కూడా భారీగా పెరగటంతో కూలీలకు ఏడాదంతా పని దొరుకుతున్నది.
చేతినిండా పని… ఆదిలాబాద్, కరీంనగర్, నల్లగొండ, ఖమ్మం, మెదక్, మహబూబ్‌నగర్, రంగారెడ్డి.. ఇలా రాష్ట్రంలోని అన్ని ఉమ్మడి జిల్లాల్లో ఇప్పుడు మహారాష్ట్ర, ఛత్తీస్‌గఢ్, మధ్యప్రదేశ్, బీహార్, ఆంధ్రప్రదేశ్ నుంచి వచ్చిన కూలీల సందడి కనిపిస్తున్నది. ఉమ్మడి ఆదిలాబాద్ జిల్లాలో వివిధ రాష్ర్టాల నుంచి వచ్చిన 8 వేల మంది వ్యవసాయ కూలీల కుటుంబాలు పత్తి, వరి, సోయాబీన్, కంది, శనగ, జొన్న, మొక్కజొన్న, పెసర, మినుము పంటలు వేసిన పొలాల్లో పనిచేస్తున్నారు. సెప్టెంబర్, అక్టోబర్‌లో వీరు కుటుంబాలతోసహా వచ్చి ఆరునెలలు ఇక్కడే ఉంటారు. ఒక్కో కూలీ రోజుకు రూ.600 నుంచి రూ.800 వరకు సంపాదిస్తున్నారు. కాళేశ్వరం ప్రాజెక్టు అందుబాటులోకి రావడంతో ఉమ్మడి కరీంనగర్ జిల్లాలో వ్యవసాయం ఊహించని రీతిలో విస్తరించి కూలీల కొరత ఏర్పడింది. దీంతో బీహార్, పశ్చిమబెంగాల్, ఒడిశా, ఛత్తీస్‌గఢ్, మహారాష్ట్ర నుంచి కూలీలు వచ్చి పనులు చేసుకొంటున్నారు. వీరిలో 80 శాతం బీహార్ నుంచే ఉంటున్నారు. ప్రభుత్వ ధాన్యం కొనుగోలు కేంద్రాల్లోనూ బీహారీలు హమాలీలుగా పనిచేస్తున్నారు. జిల్లాలోని 175 రైస్ మిల్లుల్లో సుమారు 3,500 మంది వలస కూలీలు పని చేస్తున్నారు.
వలసల జిల్లాకే వలసలు… ఖమ్మం జిల్లాలో 6 లక్షల ఎకరాల్లో పంటలు సాగవుతున్నాయి. దీంతో ఏడాదంతా కూలీలకు పని దొరుకుతున్నది. మహారాష్ట్ర, ఒడిశా, ఛత్తీస్‌గఢ్ నుంచి ఎక్కువమంది కూలీలు జిల్లాకు వలస వస్తున్నారు. నాలుగేండ్ల నుంచి వలసలు బాగా పెరిగాయి. రైతులు సీజన్ ఆరంభంలోనే ఇతర రాష్ర్టాలకు వెళ్లి అడ్వాన్సులు ఇచ్చి కూలీలను రప్పిస్తున్నారు. పాలమూరు అంటేనే వలసల జిల్లాగా పేరు. తెలంగాణ రాష్ట్రం ఏర్పడిన తర్వాత పరిస్థితి పూర్తిగా మారిపోయింది. ఇప్పుడు వలసల జిల్లాకే ఇతర రాష్ర్టాల నుంచి కూలీలు వలస వస్తున్నారు. జోగుళాంబ గద్వాల జిల్లాలో సీడ్ పత్తి క్రాసింగ్‌కు ఏపీలోని కర్నూలు, ప్రకాశం, కర్ణాటకలోని రాయ్‌చూర్ జిల్లాల నుంచి వలస కూలీలు వస్తున్నారు. గద్వాల జిల్లాకు 10 వేలమంది, నారాయణపేట జిల్లాకు సుమారు 9 వేల మంది, వనపర్తి జిల్లాకు 8 వేల మంది, మహబూబ్‌నగర్ జిల్లాకు 4 వేల మంది, నాగర్‌కర్నూలు జిల్లాకు 5 వేల మంది వరకు వలస వచ్చారు. రోజుకు ఒక్కో కూలీ రూ.700 నుంచి రూ.1,000 వరకు సంపాదిస్తున్నారు. మెతుకు సీమ మెదక్ జిల్లా బీహార్ వలస కూలీల కడుపు నింపుతున్నది. బీహార్ నుంచి ప్రస్తుత సీజన్‌లో సుమారు 5 వేల మంది కూలీలు వచ్చారు. ఒక్కో బృందంలో 10 నుంచి 20 మంది చొప్పున రోజూ పనులు చేస్తారు. తమ రాష్ర్టాల్లో తగినంతగా పని లేకపోవడంతో ఇక్కడికి వస్తున్నామని హమాలీలు తెలిపారు. సంగారెడ్డి జిల్లాలోని నారాయణఖేడ్ ప్రాంతం వలసలకు మారుపేరుగా ఉండేది. ప్రస్తుతం ఈ ప్రాంతానికి ఆంధ్ర, కర్ణాటక నుంచి కూలీలు వలస వస్తున్నారు.
రోజూ పని.. గిట్టుబాటు కూలి… ఉమ్మడి నల్లగొండ జిల్లాకు మూడునాలుగేండ్లుగా ఆంధ్రప్రదేశ్‌లోని కర్నూలు, అనంతపురం, ఒంగోలు జిల్లాల నుంచి కూలీలు వలస వస్తున్నారు. ఈ ఏడాది మునుగోడు, దేవరకొండ, నాగార్జునసాగర్, తుంగతుర్తి, ఆలేరు నియోజకవర్గాలకు ఇప్పటికే ఐదు వేలమంది వచ్చారు. పత్తి ఏరే పనుల్లో ఒక్కో కూలీ రోజూ రూ.500 నుంచి రూ.600 సంపాదిస్తున్నారు. నిజామాబాద్ జిల్లాలో పని చేసేందుకు గత ఐదారేండ్లుగా బీహార్, ఉత్తరప్రదేశ్ నుంచి కూలీలు ఎక్కువగా వస్తున్నారు. వీరికి రోజూ రూ.1,000 చెల్లిస్తూ స్థానిక రైతులు పనులు చేయించుకొంటున్నారు. బీహార్ కూలీలు వేగంగా నాట్లు వేయడం నుంచి ఏ పనైనా చకచకా చేస్తుండటంతో ఖర్చు ఎక్కువైనా రైతులు వీరిపైనే ఆధారపడుతున్నారు. జుక్కల్, బాన్సువాడ, నిజాంసాగర్, ఎల్లారెడ్డి, గాంధారి, సదాశివనగర్, మాచారెడ్డి, భిక్కనూర్, కామారెడ్డి, లింగంపేట మండలాల్లో చెరుకు నరికేందుకు మహారాష్ట్ర కూలీలు నెలల తరబడి వస్తుంటారు.
కర్నూలు టూ షాబాద్, కర్ణాటక టూ పరిగి… రంగారెడ్డి, వికారాబాద్, జనగామ తదితర జిల్లాలకు ఏపీ, కర్ణాటక రాష్ర్టాల నుంచి పెద్ద ఎత్తున కూలీలు వలస వస్తున్నారు. షాబాద్ మండలం మన్‌మర్రి, బోడంపహాడ్, ఆమనగల్‌లోని మాడ్గుల, పెద్ద మాడ్గుల, ఎదివేడు, బ్రాహ్మన్‌పల్లి ప్రాంతాల్లోని పొలాల్లో వేలమంది ఏపీ కూలీలు పనిచేస్తున్నారు. ఒక్కో మహిళా కూలీ రెండు నెలల్లో ఖర్చులన్నీ పోను రూ.30వేల వరకు సంపాదిస్తారు. వికారాబాద్ జిల్లాకు ఏపీలోని కర్నూలు, కర్ణాటకలోని చిత్తాపూర్ నుంచి కూలీలు వచ్చి రెండుమూడు నెలలు పనిచేసుకొని వెళ్తున్నారు. గోదావరి పరీవాహక ప్రాంతంలో భారీగా సాగుచేసే మిర్చి పంట ఏరేందుకు వేలమంది కూలీలు ఛత్తీస్‌గఢ్ నుంచి వలస వస్తారు. బస్తర్, బీజాపూర్ ప్రాంతాల్లోని ఆవుపల్లి, కొండపల్లి, భీమారం, కుందన్‌పల్లి, కుంజర, గంగులూరు, తొండపార, కొవ్వుపార, బద్దిపార, బైరన్‌గాడ్ తదితర గ్రామాల నుంచి 5 వేలమంది కూలీలు ఏటా వస్తుంటారు. ఒక్కో వలస కుటుంబం సీజన్‌లో రూ.50 వేలవరకు సంపాదిస్తున్నారు.