Chandrababu : ఆంధ్రప్రదేశ్ లో రాజకీయాలు వాడివేడిగా మారుతున్నాయి. ఆయా పార్టీలు 2024 లో ఎన్నికలను దృష్టిలో ఉంచుకొని తమ వ్యూహాలను రచిస్తున్నాయి. ఇప్పటికే ఆయా పార్టీల అధినేతలు కార్యకర్తలు, నేతల్లో ఉత్తేజం నింపేలా చర్యలు చేపడుతూ… వరుస సమీక్షలు నిర్వహిస్తున్నారు. రాయలసీమ పర్యటనలో ఉన్న టీడీపీ అధినేత చంద్రబాబుకు అడుగడుగునా నిరసన సెగలు తగులుతున్నాయి. ఈ క్రమం లోనే కర్నూలు జిల్లాలో శాంతి యుతంగా నిరసన చేస్తున్న వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీ నేతలపై చంద్రబాబు తీవ్ర విమర్శలు చేశారు. బట్టలిప్పించి కొట్టిస్తానంటూ రెచ్చగొట్టే వ్యాఖ్యలు చేశారు.
తాను రౌడీలకు రౌడీని, గూండాలకు గూండానంటూ పరుష పదజాలంతో చంద్రబాబు మాట్లాడారు. అనుకుంటే మిమ్మల్ని తరిమితరిమి కొట్టిస్తానంటూ వైఎస్సార్సీపీ కార్యకర్తలను ఉద్దేశించి వ్యాఖ్యానించారు. ఇదిలా ఉంటే, మరోవైపు చంద్రబాబుకు వ్యతిరేకంగా కర్నూలు జేఏసీ నేతలు, న్యాయవాదులు, విద్యార్థులు తీవ్ర నిరసన వ్యక్తం చేశారు. చంద్రబాబు గో బ్యాక్ అంటూ నినాదాలు ఇచ్చారు. బాబుకు వ్యతిరేకంగా నల్లజెండాలు, బ్లాక్బెలూన్లతో ప్రదర్శన నిర్వహించారు. కర్నూలు న్యాయరాజధానిపై చంద్రబాబు వైఖరి చెప్పాలంటూ నిలదీశారు. విద్యార్థి జేఏసీ, న్యాయవాదులను పోలీసులు అడ్డుకున్నారు.
అలానే ఇటీవల టీడీపీ అధినేత చంద్రబాబు చేసిన చివరి ఎన్నికల వ్యాఖ్యలు పొలిటికల్ సర్కిల్స్లో ఆసక్తి కరంగా మారాయి. సొంత పార్టీలోనే ఒకింత ఆశ్చర్యాన్ని గురి చేశాయి. అధినేత చివరి ఎన్నికల అనడంతో కేడర్ కూడా ఆలోచనలో పడింది. వ్యూహంలో భాగంగా చంద్రబాబు ఈ కామెంట్స్ చేశారా… భావోద్వేగంతో అలా అన్నారా అంటూ చర్చ జరుగుతోంది. ప్రస్తుతం చంద్రబాబు చేసిన వ్యాఖ్యలు రాష్ట్ర వ్యాప్తంగా సంచలనంగా మారాయి.