Taraka Ratna : నందమూరి హీరో తారకరత్న ఇటీవల గుండెపోటుకు గురికావడంతో ఆయనకు బెంగళూరులోని నారాయణ హృదయాలయలో చికిత్స అందిస్తున్నారు. ముందు కుప్పంలోని ఆసుపత్రిలో ప్రథమ చికిత్స అందించి, అటుపై మెరుగైన చికిత్స కోసం బెంగళూరుకు తరలించారు. గత రెండు రోజులుగా ఆయనకు చికిత్స అందిస్తున్న వైద్యులు, ఆయన త్వరగా కోలుకోవాలని ప్రయత్నిస్తున్నారు.
కాగా, తాజాగా మరోసారి తారకరత్న హెల్త్ అప్డేట్‌ను వైద్యులు రిలీజ్ చేశారు. తారకరత్న పరిస్థితి ఇంకా విషమంగానే ఉందని.. ఆయనకు ప్రస్తుతం వెంటిలేటర్‌పైనే చికిత్స అందిస్తున్నట్లుగా వైద్యులు పేర్కొన్నారు. ఆయనకు ఎలాంటి ఎక్మో సపోర్ట్ ఇవ్వడం లేదని.. కుటుంబ సభ్యులకు ఆయన ఆరోగ్యం గురించి ఎప్పటికప్పుడు సమాచారం అందిస్తున్నామని తాజా హెల్త్ బులెటిన్‌లో వైద్యులు పేర్కొన్నారు. ఇప్పటికే నందమూరి కుటుంబ సభ్యులు ఆసుపత్రికి చేరుకుని నిరంతరం తారకరత్న ఆరోగ్యంపై ఆరా తీస్తున్నారు. కార్డియాలజిస్ట్‌లు, ఇంటెన్సివిస్ట్, ఇతర స్పెషలిస్టుల వైద్య బృందం పర్యవేక్షణలో ప్రస్తుతం తారకరత్నకు వైద్యం అందిస్తున్నారు. ఆయన త్వరగా కోలుకోవాలని కుటుంబ సభ్యులు, అభిమానులు కోరుతున్నారు.
డాక్టర్లు లైఫ్ సపోర్ట్ సిస్టమ్ మద్దతును కొద్దిగా తగ్గించారని, మందుల వాడకం కూడా కొద్దిగా తగ్గించారని వివరించారు. గుండె, కాలేయం పనితీరు సాధారణ స్థితికి చేరుకున్నట్టు తెలిపారు. అయితే, న్యూరో విషయంలో కోలుకునేందుకు కొంత సమయం పడుతుందని వివరించారు. అన్నింటికన్నా శుభపరిణామం ఏమిటంటే, తారకరత్న తనకు తానుగా శ్వాస తీసుకుంటున్నాడని నందమూరి రామకృష్ణ తెలిపారు. ఇది తమకు చాలా సంతోషం కలిగించిందని అన్నారు. తారకరత్న త్వరగా కోలుకోవాలని కోరుకుంటున్నామని ఆకాంక్షించారు. ఈ సందర్భంగా అభిమానులకు కృతజ్ఞతలు తెలుపుకుంటున్నామని, వారి ఆశీస్సులు తమకు ఎల్లప్పుడూ ఉండాలని కోరుకుంటున్నామని రామకృష్ణ పేర్కొన్నారు.