Bhakthi హిందూ సంప్రదాయంలో దేవీదేవతలకు తలనీలాలు సమర్పించడం ఓ ఆచారం. బిడ్డ పుట్టిన తర్వాత కేశఖండన పేరుతో ప్రత్యేకంగా ఓ కార్యక్రమాన్నే నిర్వహిస్తారు. అలానే… చిన్నాపెద్ద అనే తేడా లేకుండా ఆలయాల్ని దర్శించినప్పుడు తలనీలాలు సమర్పిస్తుంటారు. ఇక తిరుమల్లో అయితే… ఈ కార్యక్రమం నిరంతరం సాగుతూనే ఉంటుంది. ఇంతకీ తలనీలాల సమర్పణలో ఉన్న ఆంతర్యం ఏంటో తెలుసా..? ఒక్క తిరుమలేశుడికే కాదు.. ఇతర ఆలయాల్లోనూ తలనీలాలు సమర్పించడం ఓ సంప్రదాయం. హిందూ ఆచారాల ప్రకారం మనిషి తన జీవితంలో చేసిన పాపలు, అహంకారం శిరోజాలకు అంటుకుని ఉంటాయి. అందుకే వాటిని స్వామికి సమర్పించుకుని… తమ పాపకర్మలు తొలగించుకుంటారు భక్తులు. అంతే కాదు… శిరోజాలు అందానికి ప్రతీక. అలాంటి జుట్టును దేవుడికి ఇచ్చేయడం ద్వారా అందం శాశ్వతం కాదని చెప్పడమూ దీని వెనుక ఉన్న పరమార్థం. అలానే… హిందూ సాంప్రదాయం ప్రకారం వివాహమైన మహిళ.. భర్త ఉండగా శిరోజాలను తలగించదు. అందుకే మహిళలు మూడు కత్తెర్ల రూపంలో స్వామి వారికి మొక్కులు చెల్లించుకుంటారు. ఇక గర్భంలోని శిశువు తల మొదటిగా బయటకు వస్తుంది. ఈ సమయంలో శిశువుకున్న తల వెంట్రుకల్లో పూర్వజన్మకు సంబంధించిన పాపాలు ముడిపడి ఉంటాయని, అందుకనే జన్మించిన సంవత్సరంలో ఆ చిన్నారికి.. కేశఖండన నిర్వహించడం తరాలుగా ఆనవాయితీగా సాగుతుంది.
తిరుమల్లో తలనీలాలు సమర్పించడం వెనుక ఓ పురాణగాథ ప్రచారంలో ఉంది. అందేంటంటే… మహా విష్ణువు వైకుంఠాన్ని వదిలి వేంకటేశ్వర స్వామి రూపంలో భుమికి వచ్చి పుట్టలో ఉంటాడు. ఆ సమయంలో గొడ్డలి దెబ్బకుగాయమైన శ్రీనివాసుడికి నీలా అనే భక్తురాలు ఎదురుపడి… తలకు అయిన గాయానికి పసరు మందు పూసి, అక్కడ తొలగిన వెంట్రుకల స్థానంలో తన వెంట్రులను స్వామి వారికి అతికించి గాయానికి కట్టు కడుతుంది. అలా… నీలా భక్తికి మెచ్చిన వేంకటేశ్వరుడు… తన దర్శనానికి వచ్చే భక్తులు తనపై భక్తి భావంతో సమర్పించే తలనీలాలు… నీలాకే చెందుతాయన్నారు. అలా… ఆనాటి నుంచి నేటి వరకు తిరుమల దివ్యక్షేత్రంలో నిరంతరాయంగా తలనీలాల తంతూ కొనసాగుతూనే ఉంది.