తులాభార సమయంలో రుక్మిణి కేవలం తులసి దళంతో తన భర్తను సొంతం చేసుకుంది. అహంభావానికి సత్యభామ ప్రతీక అయితే వినమ్రతకు ప్రత్కీక రుక్మిణి. శ్రీకృష్ణుడికి సైతం రుక్మిణిపట్ల అవ్యాజమైన ప్రేమ వుందండంలో సందేహం లేదు. అయితే, అలాంటి రుక్మిణి కృష్ణుడికి దూరంగా వుండడంలో ఆంతర్యం ఏమిటి? దీనికి ఓ నేపథ్యం వుంది.
ఓసారి ద్వారకను సందర్శించమని రుక్మిణి, శ్రీకృష్ణుడు దుర్వాస మహామునిని కోరారు. అయితే, ఆయన ఒక నిబంధన విధించాడు. అదేమిటంటే, రుక్మిణి, శ్రీకృష్ణుడు స్వయంగా వచ్చి తనను పల్లకీలో తీసుకెళితే వస్తానన్నాడు. దీంతో ఆయన మాట ప్రకారమే ఇద్దరూ వెళ్లి పల్లకీలో దుర్వాస మహామునిని పల్లకీలో ఎక్కించుకుని వెళుతుండగా దారిలో రుక్మిణికి దాహం వేసింది. దీంతో శ్రీకృష్ణుడు తన కాలి బొటనవేలితో నేల నుండి నీటిని పైకి రప్పించాడు.
అయితే, రుక్మిణి దుర్వాస మహామునిని ‘మంచినీరు తీసుకుంటారా?’ అని అడగకనే తను నీటిని తాగేసింది. దీంతో ఆగ్రహించిన దుర్వాస మహాముని ‘నువు నీ భర్తకు పుష్కర కాలంపాటు… అంటే పన్నెండేళ్లపాటు భర్తకు దూరమవుతావు.’ అని శపించాడు. అందుకే, ద్వారకలోని శ్రీకృష్ణుడి ఆలయానికి రెండు కిలోమీటర్ల దూరంలో రుక్మిణి ఆలయంలో వుంటుంది. ఇప్పటికీ తను శ్రీకృష్ణుడికి దగ్గరవాలనే కాంక్షతో రుక్మిణి అక్కడ తపస్సు చేస్తోందని అంటారు. అంతేగాక, రుక్మిణి దుర్వాసుడిచే శాపం పొందిన కారణంగా రుక్మిణి ఆలయంలో భక్తులకు ప్రసాదంగా మంచినీటినే ఇస్తారు.