కింగ్ అక్కినేని నాగార్జున, యువసామ్రాట్ నాగచైతన్య, రమ్యకృష్ణ, కృతి శెట్టి కాంబినేషన్‌లో తెరకెక్కిన చిత్రం `బంగార్రాజు . అన్నపూర్ణ స్టూడియోస్ ప్రై.లి., జీ స్టూడియోస్ సంయుక్తంగా నిర్మిస్తున్న ఈ చిత్రానికి నాగార్జున నిర్మాతగా వ్యవహరించారు. కళ్యాణ్ కృష్ణ దర్శకుడు. ఈ చిత్రం సంక్రాంతి సందర్భంగా జనవరి 14న థియేటర్లలో విడుదలకానుంది. సినిమా ప్రమోషన్లలో భాగంగా శుక్రవారం మ్యూజిక్ డైరెక్టర్ అనూప్ రూబెన్స్ మీడియాతో ముచ్చటించారు.
నాగ్ సర్ అందరికీ ఫ్రీడమ్ ఇస్తారు. మా కాంబినేషన్‌లో మంచి మ్యూజిక్ రావడానికి అది ఒక కారణం. నేను ఆయనకు లక్కీనా? ఆయన నాకు లక్కీనా? అని ఎప్పుడూ ఆలోచించలేదు. లక్ అనేది దేవుడి దయ. ఆయన టెక్నికల్ టీంకు ఫ్రీడం ఎక్కువగా ఇస్తారు. ప్రతీ సినిమాకు ఒకేలా కష్టపడతాం. కానీ హీరోలు, డైరెక్టర్లతో ఉన్న ర్యాపో వల్ల కొన్ని హోం బ్యానర్లలా ఫీల్ అవుతాం. వాళ్లకి ఏం కావాలో మనకు తెలుస్తుంది.. మన నుంచి ఏం తీసుకోవాలో వాళ్లకి తెలుస్తుంది. అందుకే కాంబినేషన్‌లకు అంత క్రేజ్ ఉంటుంది.
సీక్వెల్ సినిమాకు మ్యూజిక్ చేయడం కాస్త కష్టమే. సోగ్గాడే చిన్ని నాయన సినిమా మ్యూజికల్ బ్లాక్ బస్టర్ అవ్వడంతో అందరూ పోలికలు పెడతారు. అందులో ఆ పాట అలా ఉంది.. ఇందులో ఈ పాట ఇలా ఉందని అంటారు. ప్రేక్షకుల అంచనాలు అందుకోవాలంటే కనీసం ఒకటికి పది సార్లు ఆలోచించుకుని చేయాల్సి ఉంటుంది. మనకో బెంచ్ మార్క్ ఉంది దాన్ని రీచ్ అవ్వాలని నాగ్ సర్ కూడా చెప్పేవారు.
మనం సినిమాలో పియ్యో పియ్యోరే సాంగ్ షూట్ సమయంలో వెళ్లాను. నాగ్ సర్ పాడుతూ కనిపించారు. వాయిస్ బాగుందని ట్రై చేద్దామని చెప్పాను. కానీ అప్పుడు కుదరలేదు. అందుకే సోగ్గాడే చిన్ని నాయనలా ట్రై చేశాం. అది బాగా క్లిక్ అయింది. బంగార్రాజులో కూడా సిట్యువేషన్ కుదిరింది. ముందు ఒక లైన్ మాత్రమే అనుకున్నాం. పాట విన్నాక మొత్తం పాడాలా? అని నాగ్ సర్ అడిగారు. అంతకన్నా ఎక్కువేముంది? అని సరే అన్నాం.ఇది పూర్తిగా గ్రామీణ నేపథ్యంలో ఉంటుంది. ఒక్క పాట కూడా వెస్ట్రన్ ఉండదు. అన్నీ కూడా ట్రెడిషనల్‌గా, పల్లెటూరి వాతావరణంలోనే ఉంటాయి. బ్యాక్ గ్రౌండ్ స్కోర్‌లో కూడా వెస్ట్రన్ ఇన్‌స్ట్రూమెంట్ పరికరాలు వాడలేదు. సోగ్గాడే చిన్ని నాయనలోని ఫ్లేవర్‌ను ఇందులో కూడా కంటిన్యూ చేయాలని అనుకున్నాం.
రీ రికార్డింగ్ చాలా తక్కువ సమయంలో చేసేశాం. రోజుకు 20 గంటలు పని చేశాం. 20 రోజుల్లో అంతా పూర్తి చేసేశాం. అన్ని డిపార్ట్మెంట్లు అంతే స్థాయిలో కష్టపడ్డాయి. నాలుగు నెలల్లోనే షూటింగ్ పూర్తి చేశారు. డైరెక్టర్ కళ్యాణ్ కృష్ణ చాలా కష్టపడ్డారు. ఈ సినిమా అంత కలర్ ఫుల్‌గా ఉంటుంది. సోగ్గాడే చిన్ని నాయన కంటే ఓ ముప్పై శాతం ఎక్కువే ఉంటుంది. పండుగకు థియేటర్లో చూసే సినిమాలా ఉంటుంది.