Jaggareddy: వైఎస్సార్ తెలంగాణ పార్టీ అధ్యక్షురాలు వైఎస్.షర్మిళపై తెలంగాణ కాంగ్రెస్ పార్టీ ఎమ్మెల్యే జగ్గారెడ్డి తీవ్రస్థాయిలో మండిపడ్డారు. షర్మిల తనపై నిందలు వేయడం దురదృష్టకరం అని, తాను కోవర్టునో కాదో తర్వాత సమాధానం చెబుతానని అన్నారు. విజయమ్మకు తాను సలహా ఇస్తున్నానని, షర్మిలను సీఎం చేయాలనుకుంటే జగన్‍కు నచ్చజెప్పి ఏపీలో సీఎం చేయాలన్నారు. మూడు రాజధానులు ఎందుకు? మూడు రాష్ట్రాలు చేయండని జగన్ ను ఉద్దేశించి ఎద్దేవా చేశారు.
వైజాగ్, అమరావతి, కడపను రాష్ట్రాలుగా చేసుకోండని, మూడు ప్రాంతాలకు ముగ్గురిని సీఎంలుగా చేసుకోండని తెలిపారు. విశాఖకు విజయసాయిరెడ్డిని సీఎంగా చేయాలని, విశాఖను విజయసాయిరెడ్డి కబ్జా చేశారు కదా అని అన్నారు. షర్మిల ఏం చేసినా తెలంగాణలో నాయకురాలు కాలేదని స్పష్టం చేశారు. మీ కుటుంబంలో పంచాయితీ తీసుకొచ్చి రాష్ట్రాల మధ్య పంచాయితీలా మార్చొద్దని, మీ ఇంట్లో వాళ్లే సీఎంలుగా ఉండాలా? అని ప్రశ్నించారు.
షర్మిల ఆనాడు పాదయాత్ర చేస్తూ జగనన్న వదిలిన బాణాన్ని అని చెప్పిందని, ఇక ఇప్పుడు ఇక్కడ దస్తీ వేసి వైయస్ వదిలిన బాణాన్ని అని చెబుతోందని మండిపడ్డారు. రాహుల్ గాంధీ ప్రధాని కావాలని దివంగత ముఖ్యమంత్రి వైయస్ రాజశేఖర్ రెడ్డి ఆకాంక్షించారని గుర్తు చేశారు. వైయస్సార్ బొమ్మ పెట్టుకుని ఆయన కొడుకు, కూతురు ఆయన ఆశయం కోసం పనిచేయడం లేదని నిప్పులు చెరిగారు. ఎన్టీఆర్ యూనివర్సిటీ పేరు మార్పు పైనా జగ్గారెడ్డి స్పందించారు. వైయస్సార్ యూనివర్సిటీ అని పేరు మార్చి వైయస్ జగన్మోహన్ రెడ్డి తీసుకున్న నిర్ణయం తప్పని స్పష్టం చేశారు.