‘సర్కారు నౌకరి’ నినిమా రివ్యూ by సీనియర్ జర్నలిస్ట్ ఆది
దర్శకేంద్రుడు రాఘవేంద్రుడు నిర్మాతగా శేఖర్ గంగనమోని అనే కొత్త దర్శకుడి డైరెక్షన్లో.. సింగర్ సునిత కొడుకు ఆకాష్ గోపరాజు హీరోగా.. భావన అనే కొత్త కథానాయిక డెబ్యూగా వచ్చిన థియేటిర్ రిలీజ్ మూవీ. ఈ సినిమా మొదట బాపూ బొమ్మగా మొదలై.. తర్వాత రాఘవేంద్రుడి రొమాంటిక్ యాంగిల్ టచ్ ఇస్తూ.. చివరికి దాసరి మార్క్ సోషల్ రిఫార్మ్ మూవీగా ఎండవుతుంది.
సినిమా ఎలా ఉంది? అని చూస్తే ఈ సినిమా స్టార్టింగ్ సాగదీత బాగా విసిగిస్తుంది. తర్వాత చిన్న చిన్న కారణాలతో ఎలాంటి లీడ్స్ లేకుండానే అవి ఏమంత గొప్పగా ఎస్టాబ్లిష్ కాకుండానే ముందుకెళ్లిపోతుంటుంది. ఒక దశలో ఫ్లాష్ బ్యాక్ ని లైవ్ లో చూపిస్తూ.. ఈ కుటుంబ కథ ద్వారా ఏం చెబుతాడో అన్న ఆలోచన చేయిస్తుంది. సరిగ్గా అదే సమయంలో సినిమాలో వాడిన తెలంగాణ స్లాంగ్ దాన్ని ఆంధ్రులు పలికిన ఆ అచ్చీ పచ్చిదనం స్పష్టంగా తెలిసిపోతుంటుంది.
ఇగ అది దక్షిణ తెలంగాణలోని మహబూబ్ నగర్ కావడం.. అందునా బర్రెలక్క ద్వారా ఇటీవల బాగా పాపులరైన కొల్లాపూర్ కావడం.. కొన్ని రిలవెంట్ ఇష్యూస్ ని జ్ఞప్తికి తెస్తూ.. ఎంతైనా సీమ\కర్ణాటక బోర్డర్ డిస్ట్రిక్ట్ కదా? ఈ యాస కొంత అలాగే ఉంటుంది లే.. అన్న కోణంలో సర్దుకుపొమ్మంటుంది. అయితే ఈ దర్శక నిర్మాతల తాపత్రయమేంటి? ఎందుకీ చిత్రం నిర్మించదలిచారు? అన్న ప్రశ్న కూడా వేసుకోవల్సి వస్తుంది. నిజానికి రాఘవేంద్రరావు ఇష్టపడే చిత్రాలకు ఒక లెక్క ఉంటుంది. ఆయన శైలి.. కాస్తా ఫ్యామిలీ ఓరియెంటెడ్ కమ్ రొమాంటిక్ మూడ్ లో సాగే చిత్రాలనే ఎక్కువగా ప్రిఫర్ చేస్తుంది. కానీ తన దర్శక నైజానికి భిన్నంగా ఆయనీ చిత్ర కథను ఎంపిక చేసుకున్నారా? అనిపిస్తుంది.
ఇంతకీ కథ ఏంటంటే.. 90ల కాలంలో దేశాన్ని పట్టి పీడించిన ఎయిడ్స్ వ్యాధి.. తద్వారా దెబ్బ తిన్న కుటుంబాలు. ఆ రోజుల్లో ఈ వ్యాధిని పెద్ద రోగమని ఎలా పిలుస్తారు. ఈ వ్యాధి వచ్చిన వారిపై ఆనాటి ప్రజలకు ఎలాంటి దురభిప్రాయాలుండేవి. ఈ వ్యాధితోపాటు.. జనానికి ఉన్న అపోహలను తొలగించడానికి హీరో చేసే పోరాటమే.. ఈ చిత్ర స్థూల కథ. కథ, కథనం నడపటంలో ఒకరకంగా చెప్పాలంటే అక్కడక్కడా సినిమా స్టైల్ కన్నా.. డాక్యుమెంటరీ స్టైల్ ఎక్కువగా కనిపించింది. సినిమాలో కావల్సినంత ఎమోషన్ ఉందన్న విపరీతమైన నమ్మకంతో సీన్లను రక్తికట్టించడంలో చాలా చాలా వెనకబాటుదనం ప్రదర్శించారు. కొన్ని సీన్ల ఎస్టాబ్లిష్ మెంట్.. ఇలా కాకుండా ఇలా చేసి ఉంటే బావుండేది. అన్న ఆలోచనలొస్తుంటాయి.
అయితే ఇదే 90ల నాటి కథనంగా 90స్ బయోపిక్ అనే వెబ్ సీరిస్ విడుదలయ్యి.. ప్రేక్షక జనులను విపరీతంగా ఆకట్టుకుంటోంది. మరి ఈ చిత్రం కూడా అలాగే ఉండాలిగా. దానికి తోడు సినీ జనం పెద్దగా టచ్ చేయని ఎయిడ్స్ ని ప్రధాన కథాంశంగా మలుచుకున్న దర్శక నిర్మాతలు ఈ చిత్రాన్ని ప్రమోట్ చేసుకోవడంలో ఎందుకు వెనకబడ్డారు? అని చూసుకుంటే.. కొత్త వారితో సినిమా చేయడం. దర్శకరచయితల్లో లోపించిన చేయిదిరిగిన పనితనం. పాడింగ్ ఆర్టిస్టుల సపోర్టు సరిగా లభించక పోవడం సినిమాను బాగా ఇబ్బంది పెట్టాయి.
బలగం లాంటి సినిమాలు హిట్ కావడంతో తెలంగాణ యాసలో.. సినిమాలు తీస్తే వర్కవుట్ అవుతాయని తీసినట్టుంది కానీ.. ఎక్కడో ఈజ్ లోపించి సినిమా కనీసం నెటిజన్ల దగ్గర కూడా చర్చకు నోచుకోలేదు. సునీత కొడుకు నటిస్తున్నాడన్న మాట కూడా ఎక్కడా ప్రచారం కాకుండా చూసుకున్నట్టుంది. ఆమె కూడా అట్ లీస్ట్ సుమలాగైనా.. పబ్లిసిటీ చేయలేదు. చేసినా అదేమంత బాగా జనాల్లోకి వెళ్లినట్టు లేదు.
ఇక హీరో ఆకాష్.. ఆకాలపు హీరోలను గుర్తు చేశాడు. ఇప్పటి ఆకతాయి పాత్రలను ఇతనైతే చేయలేడనిపించింది. హీరోయిన్ అయితే ముందే చెప్పుకున్నట్టు బాపూ బొమ్మలా ఉంది. ఈ చిత్రం మేకింగ్ స్టైల్ ఎలా అనిపించిందంటే.. రుద్రంగి సినిమాలా. అది హిస్టారికల్ కదా? అంటారు కావచ్చు.. ఆ చిత్ర దర్శకుడు కూడా సరిగ్గా ఇలాగే.. సినిమాను పర్ఫెక్ట్ గా పిక్చరైజ్ చేయాలన్న కాన్షస్ తో సినిమా తీశాడు. అక్కడి వరకూ ఓకేగానీ.. మేకింగ్ లో ఉండాల్సిన ఏదో మ్యాజిక్ అయితే మిస్ అయినట్టు కనిపించింది.
ఇందాకే అనుకున్నాంగా ఇందులో ఈ రోగం ద్వారా ప్రబలే సెంటిమెంట్ బాగా వర్కవుట్ అవుతుంది కాబట్టి.. మిగిలిన పో ర్షన్ పెద్దగా టచ్ చేయక్కర్లేదనుకుంటూ.. తీస్కుంటూ వెళ్లిపోయారు. ఇదే ఈ మూవీకి మైనస్ గా మారింది. ఎనీహౌ.. రాఘవేంద్రరావుగారి ఈ సోషల్ మూవీ ఓకే. అయితే ఈ చిత్రం ఒక బలగంలా జనసమూహాన్ని ఇప్పటికీ అవలంభించేలాంటి సెంటిమెంట్స్ తో కట్టిపడేయ లేక పోవడం బ్యాడ్ లక్. సినిమా ఆకాలపు పరిస్థితులను గుర్తు చేసినా.. అట్ లీస్ట్ నైన్టీస్ బయోపిక్ లాగైనా.. అందరినీ కనెక్ట్ చేసి ఉండాలి. అలాంటిదేదో మిస్ అయినట్టుగానే చెప్పాలి.
ఓవరాల్ గా మూవీ నాట్ బ్యాడ్- బట్ ఇలాంటివన్నిటినీ కాస్త చూసుకుని ఉంటే మరింత బాగుండేది. సినిమా చూసే కొద్దీ కన్నీటి పర్యంతంగా అయితే అనిపించింది. ఈ విషయంలో దర్శక రచయితలకు మార్కులు వేయకుండా ఉండలేం. కంగ్రాట్స్. ఇంతకీ ఈ రివ్యూయర్ తిట్టాడా- పొగిడాడా అనుకోవద్దండీ ఉన్నది ఉన్నట్టు నాకు అనిపించినది అనిపించినట్టు చెప్పాలనిపించింది చెప్పా.
నినిమా రివ్యూ by సీనియర్ జర్నలిస్ట్ ఆది