మహిళలు సంతోషంగా ఉన్నప్పుడే రాష్ట్రం సుభిక్షంగా ఉంటుందన్నారు ఎమ్మెల్సీ కల్వకుంట్ల కవిత. రాచకొండ పోలిస్ కమిషనరేట్ పరిధిలో, రాచకొండ సెక్యూరిటీ కౌన్సిల్ వారి సంఘమిత్ర సర్టిఫికేషన్ కార్యక్రమానికి ఎమ్మెల్సీ కవిత హాజరయ్యారు. ఈ సందర్భంగా ఎమ్మెల్సీ కవిత మాట్లాడుతూ, ఆడబిడ్డల రక్షణ కోసం ఏర్పాటు చేసిన షీ టీంలు కేసీఆర్ మానస పుత్రిక అన్నారు. అంతేకాదు షీ టీంలు, తెలంగాణ పోలీస్ శాఖలో మహిళలకు 33 శాతం రిజర్వేషన్లను, ఇతర రాష్ట్రాలు సైతం ఆదర్శంగా తీసుకున్నాయన్నారు. ఆడపిల్లలపై అఘాయిత్యాలు తగ్గాలంటే చట్టాల అమలు సరిగా జరగాలన్న ఎమ్మెల్సీ కవిత, పోలీసులు ప్రజలతో మమేకం అయినప్పుడే చట్టాలు పూర్తిస్థాయిలో అమలవుతాయన్నారు.
రాచకొండ పోలీస్ కమీషనర్ మహేష్ భగవత్ షీ టీంలకు తోడుగా సంఘమిత్ర కార్యక్రమాన్ని రూపొందించడం అభినందనీయమని, సంఘమిత్ర లను తెలంగాణలోని అన్ని జిల్లాల్లో ఏర్పాటు చేయాలని సీఎం కేసీఆర్ ను కోరుతానన్నారు ఎమ్మెల్సీ కవిత. కడుపులో ఉన్నప్పటి నుండే అడబిడ్డలపైన దౌర్జన్యం జరుగుతోందన్న ఎమ్మెల్సీ కవిత, మహిళలు అంతా సంఘటితం అయ్యి తమ సమస్యలను ఎదుర్కోవాలన్నారు. హాజీపూర్ లో జరిగిన ఘటన పై కఠినంగా వ్యవహరించడమే కాకుండా, మరోసారి అలాంటి నేరాలు జరకుండా చర్యలు తీసుకున్నందుకు రాచకొండ సీపీ మహేష్ భగవత్ ను ఎమ్మెల్సీ కవిత అభినందించారు. అంతేకాదు తనను కూడా సంఘమిత్ర లో జాయిన్ చేసుకోవాలని సీపీ మహేష్ భగవత్ ని కోరారు ఎమ్మెల్సీ కవిత. ఈ కార్యక్రమంలో రాచకొండ సీపీ మహేష్ భగవత్, సీఎస్ ఐఆర్ ఐఐసీటీ డైరెక్టర్ శ్రీవరి చంధ్రశేఖర్, సంఘమిత్ర సభ్యులు పాల్గొన్నారు.