ఇలాంటి స్టోరీ మనం రాజేంద్ర ప్రసాద్ వంటి కామెడీ హీరోల కాలంలో చేసినట్టుగా ఇట్టే గుర్తించేస్తాం.. దర్శకుడి ఏజ్ దీన్నిబట్టి చూస్తే చాలా చాలా పాతదే అనిపిస్తుంది. కానీ, కానీ, డైలాగుల్లోని ట్రెండీ నెస్ చాలా చాలా ఎంగ్ ఏమో అనిపిస్తుంది…
అనగనగా ఒక హీరో డిగ్రీ పాసైతే ఆస్తి కలసి రావడం వగైరా వగైరా బ్రహ్మచారి అనే కమల్ హాసన్ అనే సినిమా తో పాటు మరో రాజేంద్ర ప్రసాద్ సినిమాను జ్ఞప్తికి తెస్తుంది. అయితే ఇక్కడే దర్శకుడు తన తెలివితేటలను విపరీతంగా వాడేశాడు.
హీరోకి కాకుండా ఆ ఫిట్టింగ్ ఆయన తండ్రికి పెట్టాడు. లాఫాలజీకి లాజిక్కులుండవని.. నలభై ఏళ్ల పాటు ఒక వ్యక్తి డిగ్రీ పూర్తి చేస్తే కానీ ఆస్తి రాదన్న మాట చాలా చాలా ఇల్లాజికల్. నిజంగా ఆ డిగ్రీయే కావల్సి వస్తే.. ఇయ్యాల్రేపు వెయ్యి రూపాయలకే డిగ్రీ ప్రింట్ తీసి చేతికిస్తారు. కానీ ఇది సినిమా కాబట్టి.. మనం అలాంటిదొకటి వెతకరాదు.
కట్ చేస్తే.. ఈ సినిమాలో వాడిన అన్న చెల్లెళ్ల వరుస ఇందుకు కలిపిన రాఖీ అనే పులిహోర. నిబ్బ అనే పదాన్ని వీలైనంతగా వాడ్డం. తర్వాత ఒక జులపాల జుట్టబ్బాయి కులం మీద చేసిన సైటరికల్ షార్ట్స్ తరహా కేరెక్టరైజేషన్ అన్నీ కలిపేసి అద్భుతమైన డైలాగ్ కామెడీ క్రియేట్ చేశాడు దర్శకుడు రామ్ అబ్బరాజు. సినిమా లోని కథ నాటు కొట్టుడు కంపు కొట్టినా డైలాగుల్లోని సోషల్ మీడియా లాంగ్వేజ్.. మీమ్స్ ఇతర పంచులు బ్రహ్మాండంగా పేలడంతో హమ్మయ్యా చాలా కాలానికి మంచి కామెడీ మూవీ దొరికిందోచ్ అని కుటుంబ కథా చిత్రాలనాశించే ప్రేక్షకజనం ఎగేస్కుని వచ్చేస్తున్నారు హాళ్లకు..
అన్నీ మంచి శకునములే. హాళ్లకు ఈ మాత్రం ప్రేక్షకులు రావల్సిన రోజులు మరి ఏం చేద్దాం. నిజానికి ఇలాంటి డైలాగ్ కామెడీలు అల్లరి నరేష్ ఒక స్థాయిలో చేసి వదిలేసి.. అతడే మారేడిమిల్లి వంటి రిమోట్ ఏరియాస్ కి వెళ్లి.. నవ్వీ నవ్వీ ఆనంద భాష్పాలు కార్చడం ఇక వర్కవుట్ కాదని చెప్పి.. డైరెక్టుగా తెరపై ఉగ్రం రూపం చూపించి కన్నీళ్లు తెప్పించే ట్రెండ్ కి షిఫ్ట్ కావడంతో.. ఈ ఏరియాలో చాలా మంచి స్పేస్ తిరిగి రీ- క్రియేట్ అయ్యింది. దీంతో శ్రీవిష్ణులాంటి ఫ్యామిలీ హీరోస్ కి ఇదో అడ్డ దారి దొరికినట్టయ్యింది. దీంతో తండ్రి డిగ్రీ ఫార్ములా మొదలు, రాఖీ సెంటిమెంటు, చెల్లెలి ప్రేమ ఫెయిల్ అయ్యింది కాబట్టి ఇక అందరి ప్రేమా ఫెయిల్యూరే అనే రొడ్డకొట్టుడు అన్నీ కలసి ఫుల్ కామెడీ ఎంటర్ టైన్మెంట్ ను ఇచ్చేశాయ్…
జాతిరత్నాలు తర్వాత ఈ తరహా కామెడీలకు స్కోప్ బాగా ఎక్కువైంది. కూసింత కామెడీ సెన్స్ ను రీజనబుల్ గా వర్కవుట్ చేస్తే చాలు.. హాళ్లకు ప్రేక్షకులు క్యూ కడుతున్నారు. పేర్లెందుకులే గానీ కొందరు దర్శకులుంటారు కామెడీని కలపడంలో భాగంగా మరీ ఓవర్ ఇల్లాజికల్ థింగ్స్ ని బేస్ చేసుకుంటారు. ఇలాంటి వాటి జోలికి పోకుండా.. పర్లేదు.. ఎక్కడా ఎలాంటి మకిలి లేదనిపిస్తే చాలు.. బాగానే వర్కవుట్ అయ్యేలా ఉంది చూస్తుంటే. చిన్నపాటి క్లాస్ ను మెయిన్ టైన్ చేస్తే చాలు.. ఫుల్ పైసా వసూల్. ఇక్కడే కొందరు క్లిక్కవుతుంటారు.. కొందరు బొక్కబోర్లా పడుతుంటారు.
అయితే అన్నిసార్లు డైలాగ్ కామెడీస్ వర్కవుట్ అవుతాయా అంటే కావు.. ఏదో మనం కామెడీ డైలాగ్ గుప్పించేస్తున్నాం అన్న భ్రమల్లో పడి ఓవర్ డైలాగ్ ఓరియెంటేషన్ కూడా ఏమంత మంచిది కాదు. ఒక్కోసారి అది ఎబ్బెట్టుగా మారిపోయినా పోతుంది. ఇంతకీ ఆఫ్ట్రాల్ గారూ.. మేం ఏషియన్ సినిమాస్ లో పని చేస్తున్నామని ఎగతాళి చేస్తున్నారు సరే.. మీరెక్కడ చేస్తున్నట్టో అంటే.. నేను పీవీఆర్ లో అంటాడా ఆడపిల్ల తండ్రి. ఇలాంటి పంచ్ లు చాలానే ప్రాసతో పాటు ఫన్ను కూడా తెప్పించాయి. ఇక పోతే.. అన్నా చెల్లెలు ఒక రాఖీ సెంటిమెంటుతో అయితే ఏకంగా ఫుట్ బాల్ ఆడేసుకున్నాడు దర్శకుడు. తర్వాత కుల శేఖర్ అనే వెన్నెల కిషోర్ ఎపిసోడ్ కూడా బాగానే పండింది..
ఇలా నాలుగైదు నవ్వు-గుండు సామాగ్రి భారీగా పేలడంతో థియేటర్లలో నవ్వుల పటాసులు బాగానే సౌండు చేశాయనిపించింది.
ఎనీహౌ.. జాతిరత్నాలు తర్వాత మరో నవ్వుల ఘుమ ఘుమగా సామజవరగమన నిలిచిందనే చెప్పాలి.. ఇలాంటి సినిమాలు మరిన్ని రావాలని ఆశిద్దాం.. మళ్లీ థియేటర్లకు కుటుంబ కథా ప్రేక్షకులు క్యూ కట్టాలని కోరుకుందాం.