Vijasaireddy: విశాఖ రైల్వే జోన్ పై టీడీపీ, కొన్ని మీడియా సంస్థలు తప్పుడు ప్రచారం చేస్తున్నాయని వైసీపీ ఎంపీ విజయసాయిరెడ్డి మండిపడ్డారు. రైల్వేజోన్ విషయంలో ఈనాడు, ఆంధ్రజ్యోతివి తప్పుడు వార్తలు రాస్తున్నాయని ఆరోపించారు. ఏపీ సమస్యలపై మంగళవారం ఢిల్లీలో జరిగిన అధికారుల సమావేశంలో రైల్వేజోన్ అంశమే చర్చకు రాలేదని స్పష్టం చేశారు. విశాఖకు రైల్వే జోన్ వచ్చి తీరుతుందని, విశాఖకు రైల్వే జోన్ రాకపోతే తన పదవికి రాజీమానా చేస్తానని సవాల్ చేశారు.
సీఎం జగన్ ప్రభుత్వంపై అక్కసుతోనే తప్పుడు రాతలు రాస్తున్నారని, తప్పుడు రాతలపై రామోజీ, రాధాకృష్ణ సమాధానం చెప్తారా? అని ప్రశ్నించారు. అవాస్తవాలను ప్రచురించి తమ స్థాయిని దిగజార్చుకోవద్దని హితవు పలికారు. ఇదిలా ఉండగా ఏపీ రైల్వే జోన్ ఇచ్చేది లేదని, లాభదాయకం లేని చోట రైల్వే జోన్ ఇవ్వడం సాధ్యం కాదని కేంద్ర పెద్దలు తెలిపినట్లు మీడియాలో కథనాలు వచ్చాయి. రైల్వే జోన్ పై మీ స్థాయిలో నిర్ణయాలు తీసుకోవద్దని, కేబినెట్ కు పంపాలని కేంద్ర హోంశాఖ కార్యదర్శి అన్నట్లు తెలుస్తోంది.
ఈ అంశంపై ఏపీ బీజేపీ అధ్యక్షులు సోము వీర్రాజు మాట్లాడుతూ.. రైల్వే జోన్ అంశాన్ని వివాదాస్పదంగా మార్చారని, రైల్వే జోన్ కు తెలంగాణకు సంబంధంలేదన్నారు. రైల్వే జోన్ కు ఏపీ కేబినెట్ అప్రూవల్ ఇచ్చింది, డీపీఆర్ తయారైందని అన్నారు. రైల్వే జోన్ పనులకు రాష్ట్ర ప్రభుత్వం కొంత భూమి ఇవ్వాల్సి ఉందని, ఇప్పటికే రైల్వే జోన్ కు సంబంధించిన పనులు జరుగుతున్నాయని, రైల్వే జోన్ గురించి గతంలో ఎందుకు అడగలేదని ప్రశ్నించారు. మేం రైల్వే జోన్ తెస్తుంటే మాపై బురదజల్లుతున్నారని మండిపడ్డారు.