Gulf News : గల్ఫ్ తదితర దేశాల లోని వలస కార్మికుల సంక్షేమం కోసం ‘గల్ఫ్ బోర్డు’ ఏర్పాటు చేయాలని, గల్ఫ్ మృతుల కుటుంబాలకు రూ.5 లక్షల ఎక్స్ గ్రేషియా చెల్లింపుకు స్పష్టమైన జీవో జారీ చేయాలని, ఎన్నారై పాలసీ ప్రవేశపెట్టాలని, రూ.500 కోట్ల నిధులు విడుదల చేయాలని గల్ఫ్ కార్మిక సంఘాల ప్రతినిధులు శుక్రవారం అసెంబ్లీ ఆవరణలో ముఖ్యమంత్రి ఏ. రేవంత్ రెడ్డికి వినతి పత్రం సమర్పించారు. సీఎం సానుకూలంగా స్పందించారు.
చొప్పదండి ఎమ్మెల్యే మేడిపల్లి సత్యం చొరవతతో ఏర్పాటైన ఈ భేటీలో ధర్మపురి ఎమ్మెల్యే అడ్లూరి లక్ష్మణ్ కుమార్, టీపీసీసీ కార్యనిర్వాహక అధ్యక్షులు, ఎమ్మెల్సీ బి. మహేష్ కుమార్ గౌడ్, టీపీసీసీ ఎన్నారై సెల్ చైర్మన్ డా. బిఎం వినోద్ కుమార్, గల్ఫ్ సంఘాల ప్రతినిధులు దొనికెని క్రిష్ణ, మంద భీంరెడ్డి పాల్గొన్నారు. వేములవాడ ఎమ్మెల్యే ఆది శ్రీనివాస్, ఎమ్మెల్సీ టి. జీవన్ రెడ్డి సీఎం అపాయింట్మెంట్ కు సహకరించారు.