Renu Desai-Pawan Kalyan : ఏపీ రాజకీయ పరిణామాలపై సినీనటి రేణూ దేశాయ్ స్పందించింది. దయచేసి తన పిల్లలను రాజకీయాల్లోకి లాగవద్దని కోరింది. పిల్లలకు రాజకీయాలంటే తెలియవని, వాళ్ల చుట్టూ ఏం జరుగుతుందో వాళ్లకు తెలియదన్నారు. తన పిల్లలనే కాదు ఏ పిల్లలను, ఆడవాళ్లను ఇందులోకి లాగొద్దని అభిమానులు, రాజకీయ నాయకులు, విమర్శకులకు విజ్ఞప్తి చేస్తున్నట్లు చెప్పారు. ఈ మేరకు ఇన్‌స్టాగ్రామ్‌లో ఓ వీడియోను పోస్ట్ చేశారు.
తన మాజీ భర్త పవన్ కళ్యాణ్ ఓ అరుదైన వ్యక్తి అని, రాజకీయంగా ఆయనకే తన మద్దతు ఉంటుందని చెప్పుకొచ్చారు. మొదటి రోజు నుంచి ఇప్పటి వరకు కూడా రాజకీయంగా పవన్‌కు తాను సపోర్టు చేస్తూనే ఉన్నానని తెలిపారు. “నేను నా జీవితంలో ముందుకు సాగిపోతున్నా. సమాజానికి మంచి చేయాలని పవన్ రాజకీయాల్లోకి వచ్చారు. నాకు తెలిసినంత వరకు ఇలాంటి వ్యక్తులు చాలా అరుదుగా ఉంటారు. ఆయన డబ్బు మనిషి కాదు. సమాజం, పేదవాళ్ల సంక్షేమం కోసం పని చేయాలనుకుంటారు. నా వ్యక్తిగత బాధను పక్కనపెట్టి రాజకీయంగా తనకు ఎప్పుడు మద్దుగా ఉంటా.” అని రేణూ దేశాయ్ అన్నారు.
పవన్ తన వ్యక్తిగత జీవితాన్ని పక్కనబెట్టి రాజకీయాల్లోకి వచ్చారన్నారు. ఎన్నికలు వస్తున్నాయని, పవన్‌కు ఒక్కసారి అవకాశం ఇచ్చి చూడాలని ప్రజలను కోరారు. ఇది తాను ఆయన మాజీ భార్యగా చెప్పడం లేదని, సమాజంలో ఓ పౌరురాలిగా మాత్రమే అడుగుతున్నానన్నారు. ప్రతీసారీ ఆయన వ్యక్తిగత జీవితం గురించి మాట్లాడవద్దని, వ్యక్తిగత జీవితాన్ని రాజకీయాలతో ముడిపెట్టవద్దని కోరారు.
ఓ తల్లిగా నా అభ్యర్థన ఒక్కటే. పరిస్థితులు ఏమైనప్పటికీ పిల్లలను మాత్రం ఇందులోకి లాగకండి. మా పిల్లలు సినీ నేపథ్యం ఉన్న కుటుంబంలో పుట్టారు. ఆయన తండ్రి ఓ నటుడు, రాజకీయ నాయకుడు. ఏదైన ఉంటే మీరు మీరు చూసుకోండి అని వీడియోలో రేణు దేశాయ్ కోరారు.