కొంచెం బలంగా వున్న కర్రను విరగ్గొట్టాలంటేనే మనకు సాధ్యం కాదు. అట్టాంటిది క్రికెట్ బ్యాట్లూ, బేస్ బాల్ బ్యాట్లూ విరగ్గొట్టాలంటే ఎవరివల్ల అవుతుంది చెప్పండి…! మాంఛి వయసులో వున్నవారికే సాధ్యం కాదంటే అరవై మూడేళ్ల వయసులో వున్నవారు చేయగలరా? ఏ, ఎందుకు చేయలేనూ అంటూ ముందుకు దూకి ఉత్తి చేతులతోనే అన్నింటినీ విరగ్గొట్టేస్తూ అందరినా ఆశ్చర్యపరుస్తున్నాడు జర్మనీకి చెందిన మహమ్మద్ కహ్రిమనోవిక్ అనే మార్షల్ ఆర్టిస్ట్.
అదికూడా ఎలాగనుకుంటున్నారూ, ఒకటి విరగ్గొట్టేసి ఓ పది నిమిషాలు రెస్టు తీసుకుని కాదు. వరుసగా విరగ్గొట్టేస్తూనే వుంటాడు. అందుకే, ఈ అంకుల్ ని అందరూ ‘హ్యామర్ హ్యాండ్’ అని పిలుస్తారు. ఈ మధ్యే వరుసగా 68 బేస్ బాల్ బ్యాట్లను విరగ్గొట్టి రికార్డు సృష్టించి గిన్నిస్ బుక్ లోకి ఎక్కాడు. ఇలా అంకుల్ బేస్ బాల్ బ్యాట్లను విరగ్గొడుతూంటే దాన్ని వీడియో తీసి తమ యూ ట్యూబ్ ఛానెల్ లో విడుదల చేసింది గిన్నిస్ బుక్ సంస్థ. దీనికన్నా ముందు మహమ్మద్ కేవలం ఒకే ఒక్క నిమిషంలో 148 కొబ్బరికాయల్ని పగులగొట్టి అదో రికార్డు సృష్టించాడుట…! ‘హ్యామర్ హ్యాండ్’ అని పిలవడంలో తప్పులేదులెండి. అంతకు మించి ఇంకేదైనా పేరుందేమో ఆలోచించాలి మరి…!!