టీడీపీ, జనసేన, బీజేపీ, వైసీపీ … ???? లేదంటే స్వయం కృతాపరాధమా ?
రాజేష్ మహాసేన ఎక్కడ దెబ్బ తిన్నాడంటే.. అతడు గతంలో కొంత పాపులర్ అవడంలో భాగంగా కొన్ని కమ్యూనిటీ వైజ్ కామెంట్స్ తో పాటు.. హిందుత్వ ను కూడా భారీ ఎత్తున కెలికాడు. రాముడు, పార్వతీదేవి వంటి హిందూ దేవీ దేవతలపై అనుచిత వ్యాఖ్యలు చేశాడు. సరిగ్గా మాట్లాడితే.. ఇదే పార్వతీదేవి వ్యవహారంలో.. రామ్ గోపాల్ వర్మ కూడా గతంలో ఇలాంటి సంచలన కామెంట్లే చేశాడు. ఆ మాటకొస్తే.. అప్పుడప్పుడూ.. గరికపాటి కూడా మతాచార భిన్నమైన వ్యాఖ్యలు చేస్తుంటాడు. కానీ గరికపాటి తప్పించుకున్నట్టు.. మిగిలిన వారెవరికీ ఇలాంటి కామెంట్లు చేసి బతికి బట్టకట్టడం సాధ్యపడలేదు. వర్మ కూడా ఈ దేవీ దేవతల కామెంట్లకు బలైన వాడే. కేసులను ఎదుర్కున్నవాడే.
గతంలో కత్తి మహేష్.. కూడా రాముడి ఆహార నియమాలపై తీవ్ర వ్యాఖ్యలు చేసి.. తర్వాత కేసులు ఎదుర్కోవడం మాత్రమే కాక.. నగర బహిష్కరణ సైతం ఫేస్ చేసి.. దురదృష్టవశాత్తూ.. కాలగర్భంలో కలిసిపోయాడు. ఈ తరహా వ్యాఖ్యలు చేసిన\ చేస్తున్న వారిలో రాజేష్ రేజర్ల, బైరి నరేష్ ఇంకా ఇదే కోవలో తమ ప్రయాణం సాగిస్తూనే ఉన్నారు. ఈ సంచలన వ్యాఖ్యానాల సుడిగుండాల్లో ఇంకా కొట్టుమిట్టాడుతూనే ఉన్నారీ ఇద్దరు. ఇప్పుడు మహాసైనికుడి వంతు వచ్చింది.
నిజానికి రాజేష్ మహాసేన.. ఏపీ తీన్మార్ మల్లన్న తరహా వ్యక్తిగానే ఇప్పటి వరకూ అందరికీ తెలుసు. అతడు రాజకీయంగా ఎదగడం కోసం.. మొదట వైసీపీలో ఉండి. తర్వాత జనసేనకు మారి. అక్కడా తన పప్పులు ఉడకవని తెలుసుకుని టీడీపీకి షిఫ్ట్ అవడం. బేరం కుదరడం. పి. గన్నవరం సీటు ఎట్టకేలకు దక్కించుకోవడం.. కలలో జరిగినట్టు జరిగిపోయాయి. కానీ ఇక్కడే అతడి పాత చిత్రాలు మొత్తం బయటకొచ్చాయి.
మొదటగా రిలీజైన చిత్రం అగ్రవర్ణాల అమ్మాయిలను లేపుకొస్తే లక్ష ఇస్తా! అన్నది. ఇక రెండోది రాముడు హీరో కానే కాడు.. అంటూ రావణాసురుడ్ని ఆకాశానికి ఎత్తే యత్నం. ముచ్చటగా మూడోది.. పరమేశ్వరుడు లేని సమయంలో వినాయకుడ్ని కనడం అంటే పార్వతీదేవి ప్రాతివ్రత్యాన్ని మనమెలా అర్ధం చేసుకోవాలి? అన్న అర్ధంలో అన్న మాటలు. ఈ మూడు.. కామెంట్లు అతడ్ని నిలువునా ముంచాయి.
ఇది చాలదన్నట్టు వినాయకుడి పుట్టుకే ప్రశ్నార్ధకం చేసిన రాజేష్.. అయినవోలు వినాయకుడ్ని దర్శించి మరీ తన ప్రచారం మొదలు పెట్టడం కొసమెరుపు. ఇక్కడే రాజేష్ మహాసేన హిందూ వ్యతిరేక ప్రాతివ్రత్యం ప్రశ్నార్ధకంగా మారింది. అతడి నైతికత దారుణంగా దెబ్బతింది. అందుకు సవాలక్ష సాకులు చెప్పినా.. అంతగా నప్పలేదు. సరికదా తీవ్ర వ్యతిరేకత వ్యక్తమైంది.
ఇప్పటికే పీకలోతు మత విద్వేష పూరిత కామెంట్లు చేశాడన్న ముద్ర పడ్డంతో.. ఇతడి అభ్యర్ధిత్వాన్ని ప్రశ్నిస్తూ. సోషల్ మీడియా హోరెత్తడం. ఎన్నో విశ్లేషణాత్మక వీడియోలు ఇతడిపై రావడం… ఇలాంటి పరిణామాలతో పాటు.. అగ్రకులాల అమ్మాయిలను లేపుకు రమ్మన్న కామెంట్ల కారణంగా బ్రాహ్మణ సంఘాలు.. పార్వతి దేవి ప్రాతివ్రత్యాన్ని ప్రశ్నించినందుకు.. విశ్వ హిందూ పరిషత్ వంటి హిందూ సంఘాలు.. ఇక శ్రీరాముడి కథానాయకత్వాన్నే అవమాన పరిచినందుకు.. శ్రీరామ్ సేన తదితర సంఘాలు.. ఇతడిపై తీవ్ర స్థాయిలో విరుచుకుపడ్డం మాత్రమే కాదు.. చంద్రబాబు ఇంటి ముట్టడికి పిలుపునివ్వడంతో.. ఒక్కసారిగా రాజేష్ మహాసైన్యంలో అలజడి మొదలైంది.
తాను ఎంత పెద్ద తప్పు చేస్తూ వచ్చానో స్వయానా అతడికే తెలిసి వచ్చింది. తన కారణంగా.. సుమారు 40 సీట్లలో ప్రభావవంతంగా ఉన్న హిందూ అర్బన్ ఓటు బ్యాంకుకు టీడీపీ దూరం కావడం ఖాయం అన్న విశ్లేషణలు వెలుగు చూడ్డంతో పాటు.. ఈ పొత్తులో వేలు పెడదామా వద్దా? అంటూ నాన్చుతోన్న బీజేపీకి ఇదొక సాకుగానూ దొరికింది. వాడుంటే మేముండం అంటూ ఒక అల్టిమేంటం జారీ చేసినట్టు భోగట్టా. ఈ పరిణామ క్రమాల మధ్య.. రాజేష్ తాను తన అభ్యర్ధిత్వాన్ని వదులుకుంటున్నట్టు ప్రకటించడంతో ప్రస్తుతం ఇదొక చర్చ. ఎటు చూసినా ఇవే కథనాలు.
విక్రమార్కా.. ఇప్పుడు చెప్పు .. ఈ కథలో తప్పెవరిది? అంటూ ఆ భేతాళుడు ప్రశ్నించినట్టు తయారైంది పరిస్థితి. నిజానికి సాటి దళిత బహుజన సోదరులు.. ఎప్పటిలాగానే.. తమ వాళ్లంటే చిన్న చూపు చూస్తున్నారనీ. ఇది తామంటే ఇంకా బతికే ఉన్న దారుణమైన వివక్షలో భాగమనీ. దీన్ని మేము ముమ్మాటికీ ఖండిస్తున్నామనీ తెగేసి చెబుతున్నారు. ఇక రెండో వర్గం ఏదంటే.. బ్రాహ్మణ. వీరైతే.. అగ్రవర్ణాల అమ్మాయిలను లేపుకొస్తే లక్ష ఇస్తానంటాడా ఆయ్.. అంటూ మీదికొస్తున్నారు. ఆ టైంలో తాను అన్న మాటల వెనక ఒక దళితుడు ప్రాణాలు పోగొట్టుకున్నాడనీ అంటాడు రాజేష్. ఇక మూడో వర్గం ఏదయా అనంటే.. అది స్వక్షేత్రంలోని స్వజనులే. అంటే, సొంత టీడీపీ లీడర్లే.. ఇతడిపై దండయాత్ర మొదలు పెట్టడం.
ఇప్పటికే పవన్ మత మార్పిడి వ్యవహారంలో చేసిన కామెంట్లకు భారీ ఎత్తున కౌంటర్లు జారీ చేసిన రాజేష్.. పవన్ తో పాటు కాపులను కూడా దుమ్మెత్తి పోసిన ఉదంతాలున్నాయి. ఇవన్నీ కడుపులో పెట్టుకున్న ఈ పార్టీ కేడర్.. రాజేష్ కి ఒక రేంజ్ లో హెచ్చరికలు జారీ చేసింది. ఇవన్నీ ఇలా ఉంటే అసలు రాజేష్ ఇన్ని పార్టీలు ఎందుకు మారాల్సి వచ్చిందన్నది మరో టాపిక్. రాజేష్ కి ఎప్పటికైనా పి. గన్నవరం నుంచి పోటీ చేయాలన్నది ఒక కోరికగా చెబుతారు. అందుకే మొదట వైసీపీలో ఉండి.. ట్రై చేశాడనీ. ఆపై అక్కడ తనకు టికెట్ రాదన్న క్లారిటీ వచ్చాక.. జనసేనకు కన్వర్ట్ అయ్యాడనీ.. అక్కడా తన టికెట్లు ఉడకవని తెలిసి.. టీడీపీకి వచ్చాడనీ. ఇక్కడ అతడి ఆశ ఆశయాలను గౌరవిస్తూ శ్రీయుత చంద్రబాబుల వారు.. టికెట్ ప్రసాదించారనీ చెప్పుకొస్తారు.
ఇతనితో పాటు.. కొలికిపూడి అనే మరో దళితుడికి కూడా టికెట్ దక్కడం ఒక శుభపరిణామమనీ సంబర పడుతున్న వేళ.. రాజేష్ గతంలో రాజేసిన మాటల మంటలు.. తిరిగి అతడి సీటుకిందకే నిప్పు పెట్టే వరకూ వచ్చేశాయి. ఆ మాటకొస్తే బీజేపీ లీడర్ విష్ణువర్ధన్ రెడ్డిని చెప్పుతో కొట్టడంతో లైమ్ లైట్ లోకి వచ్చాడు కొలికిపూడి. ఇతడికి సీటివ్వడం కూడా బీజేపీ అభ్యంతర పెట్టే అవకాశముంది. కానీ విష్ణువర్ధన్ రెడ్డే బీజేపీ నుంచి పోటీ చేస్తాడా? లేదా తెలియదు. దానికి తోడు అతడికి వైసీపీ వైపు గాలి మళ్లిందన్న మాట కూడా వినవస్తోంది. ఈ సిట్యువేషన్లో.. పార్టీ అతడ్ని అడ్డు పెట్టి.. కొలికిపూడికి టికెట్ ఇస్తే మేం మీతో పొత్తు కలవం అన్న మాట అనలేకపోతున్నారనీ అంటారు.
రీసెంట్ గా కూడా కొలికిపూడి.. రెండు అభ్యంతరకరమైన కామెంట్లు చేశాడు. వాటిలో ఒకటి రామ్ గోపాల్ వర్మ తల తెచ్చిన వారికి కోటి రూపాయలు ఇస్తాననడం. అది కూడా కేసు కావడం వగైరా వగైరా నడిచిందనుకోండి. ఇక పోతే రీసెంట్ గా తమ పార్టీ టీడీపీ పవర్ లోకి వస్తే.. వైయస్ఆర్ విగ్రహాలు రాష్ట్రంలో ఎక్కడా లేకుండా చేస్తామని సంచలన ప్రకటన చేశాడు.
ఇవన్నీ వర్గాల వారీగా వ్యక్తుల వారీగా మాత్రమే పరిమితమైన కామెంట్లు. ఇదే రాజేష్ చేసిన కామెంట్లు కులమతవర్గ ప్రాంతాలకు అతీతమైనవి. అన్ని కులాల వారికి రాముడు, పార్వతీదేవి, వినాయకుడు అవసరమైన వారే. ఆ మాటకొస్తే అగ్రవర్ణాలంటే కేవలం బ్రాహ్మణులు మాత్రమే కాదు.. కమ్మ\రెడ్డి\క్షత్రియ\కాపు\ వైశ్య వర్గాల వారు కూడా ఇదే కోవలోకి వస్తారు. చంద్రబాబు ఇతడికి టికెట్ ఇవ్వడం ద్వారా.. బాబు, పవన్ తమ ఇంటి ఆడవాళ్ల భద్రతను సైతం తమ రాజకీయాల కోసం గాలికొదిలేశారు చూడమంటూ.. చాలానే ట్రోలింగ్ నడిచింది.
ఇంత మంది ఏకకాలంలో కనెక్టయ్యారు. ఇక రాముడి సంగతి సరే సరి.. ఆయన మానియాతో ప్రస్తుతం దేశ వ్యాప్త ప్రజానీకమంతా ఊగిపోతోంది. ముస్లిం\ క్రిస్టియన్ వంటి వర్గాల వారు కూడా రాముడ్ని పల్లెత్తు మాట అనాలంటే ముందు వెనక ఆలోచించడం అటుంచితే.. వాళ్లే రామాలయ సందర్శన చేసి.. తమ సంఘీభావం తెలుపుతున్న పరిస్థితులు. ఈ సిట్యువేషన్లో.. రాజేష్ అడ్డంగా బుక్ అయిపోవడం దానంతటదే జరిగిపోయింది. దళితులను తొక్కేయడానికి ఒక వ్యవస్థ మొత్తం ఏకమైందన్న కోణంలో రాజేష్ బాధ పడ్డం మాత్రమే కాదు.. ఇంకా తమ జాతిని అణిచివేసే ధోరణి కొనసాగుతోందని. అంబేద్కర్ కూడా సరిగ్గా ఇలాంటి దుస్థితినే ఎదుర్కున్నట్టు తాను పుస్తకాల్లో చదివాననీ. ఇపుడు నేరుగా తానా కష్టాన్ని ఎదుర్కుంటున్నాననీ అంటున్నాడు.
ఏది ఏమైనా.. ఒకటి మాత్రం నిజం.. ఇదే అంబేద్కర్ రాసిన రాజ్యాంగంలో.. ఇతరుల మనోభావాలను దెబ్బ తీసే విధమైన వ్యవహారశైలి కలిగి ఉండటం కూడా నేరమే అవుతుందన్న మాట కూడా ఉంది. అది ఏ సెక్షను ఏంటన్నది పక్కన పెడితే.. రాముడు, పార్వతి, వినాయకుడు వీరంతా తెలిసో తెలియకో కొందరి మనోభావాలను ప్రభావితం చేసే పురాణ ఇతిహాస పాత్రలకు చెందిన వారు. ఆయా పాత్రల చిత్రణలో కావచ్చు.. భావనలో కావచ్చు.. ఎన్నో ఇల్లాజికల్ థింగ్స్ ఉండొచ్చుగాక. కానీ వాటిని మనమెందుకు అలౌ చేయాల్సి ఉంటుందంటే.. అదెంత నమ్మశక్యం కానిదైనా సరే.. పది మంది దాన్ని నమ్ముతూ.. ఇప్పటికీ ఆరాధిస్తూ.. తమ మనోభావాలను అందులో దాచుకుని ఉన్నారు కాబట్టి.. సాటి వారి కోసమైనా.. మనం అటు వైపు మాట తుళ్లకుండా బిహేవ్ చేయాల్సి ఉంటుంది. ఒక్క మాటలో చెబితే ఒళ్లు దగ్గర పెట్టుకోవల్సి ఉంటుంది.
బేసిగ్గా జర్నలిజంలో కావచ్చు.. చట్టం\ న్యాయం\ ధర్మం వంటి అంశాల్లో కావచ్చు… మనోభావాలను రెచ్చగొట్టేలా మాట్లాడ్డం నేరం. కులమత చిచ్చు రాజేయడం తప్పు. ఇంత అంబేద్కరిజాన్ని అవగతం చేసుకున్న మహాసేనాని రాజేష్.. ఇది కూడా తెలుసుకుని ఉండాల్సింది. ఎక్కడో క్లారిటీ మిస్సయ్యి ఎమోషన్ డామినేట్ చేయడంతో.. ఇదిగో ఇప్పుడు తన గొయ్యి తానే తీసుకున్నట్టయ్యింది. చెరపకురా చెడేవు\ ఆకాశం మీద ఉమ్మేస్తే.. అది నీ నెత్తి మీదే పడుతుంది.. అన్న సామెతెలను మరోసారి నిజం చేశాడు రాజేష్. అంతే కాదు హిందూ దేవీ దేవతలతో పెట్టుకుంటే.. అప్పుడు కత్తి మహేష్, ఇప్పుడు రాజేష్ మహాసేన బెస్ట్ ఎగ్జాంపుల్స్ గా మిగిలిపోతారన్న మాటకూ ఆస్కారమేర్పడింది.
ఒక సబ్జెక్ట్ తీసుకుంటే.. దానికి లోబడి చర్చ చేయాలి కానీ.. పరిమితి దాటి.. ఆ నేర తీవ్రతను మరింత పెంచి పెద్దది చేయటం సరైనది కాదని అంటారు విశ్లేషకులు. అయినా ఇదంతా ఒప్పుకునేవాళ్లు ఎవరున్నారు కానీ.. ఏది ఏమైనా తానెపుడో తెలిసీ తెలియక వీరావేశంలో అన్న మాటలకు.. ఇప్పుడేకంగా అందివచ్చిన అవకాశం చేజారిపోయింది.. కాబట్టి… దళిత దళితేతర అగ్రవర్ణ హిందూ భక్తజన సోదరులు మనమేదైనా మాట్లాడుతున్నపుడు ఆచి తుచి వ్యవహరించక తప్పదని చెబుతోందీ ఉదంతం.
ప్రత్యేక కధనం సీనియర్ జర్నలిస్ట్ ఆది