తెలంగాణ యువ పర్వతారోహకుడికి రాచకొండ సీపీ అభినందన
ఇటీవల ఆస్ట్రేలియా లోని ఎత్తయిన కోషియాస్కో పర్వతాన్ని అధిరోహించిన తెలంగాణ యువపర్వతారోహకుడు భూక్యా యశ్వంత్ ను రాచకొండ కమిషనర్ డిఎస్ చౌహన్ ఐపిఎస్ గారు అభినందించారు. భారత జాతీయ జెండాతో పాటుగా పర్వతారోహకుడిగా మరిన్ని విజయాలు సాధించడానికి ఎంతో తోడ్పాటు అందిస్తున్న రాచకొండ కమిషనర్ శ్రీ డి ఎస్ చౌహాన్ ఐపీఎస్ గారి ఫోటోను యశ్వంత్ కోషియాస్కో పర్వతం మీద ప్రదర్శించడం గమనార్హం. రాచకొండ సిపి చౌహన్ గారు పర్వతాలు ఎక్కడానికి ప్రోత్సాహం అందించారని, సీపీ మీద అభిమానంతో ఆయన ఫోటో ప్రదర్శించానని యశ్వంత్ తెలిపారు.
ఈ సందర్భంగా కమిషనర్ మాట్లాడుతూ.. పర్వతారోహణ ఎన్నో సవాళ్లతో కూడుకున్న పని అని, ఎంతో కష్టతరమైనదని అన్నారు. అటువంటి రంగంలో గొప్ప విజయాలు సాధించడం ఎంతో గర్వకారణం అన్నారు. ప్రపంచంలోని మరిన్ని ప్రఖ్యాత పర్వతాలను నిరంతర శ్రమతో దిగ్విజయంగా అధిరోహించి దేశానికి, రాష్ట్రానికి మరింత పేరు తీసుకురావాలని ఆయన ఆకాంక్షించారు. మరిన్ని పర్వతాలు అధిరోదించడానికి ఆయనకు ఎల్లపుడూ అండగా ఉంటామని ఆయన తెలిపారు.