Latest News : సినిమా పరిశ్రమ అంటే మేమే అన్న రీతిలో ఒంటెద్దు పోకడలతో కొందరు సినీ పెద్దలు గత ప్రభుత్వ హయాంలో చర్చలకు వెళ్ళేటప్పుడు ఎలా ప్రవర్తించారో…ఇప్పుడు ప్రభుత్వం మారిన తర్వాత కూడా అలానే వ్యవహరిస్తున్నారని సీనియర్ నిర్మాత, డిస్ట్రిబ్యూటర్, ఎగ్జిబిటర్ నట్టి కుమార్ ఫైర్ అయ్యారు.
ఈ మేరకు ఆయన ఓ ప్రకటన విడుదల చేస్తూ..
“మళ్ళీ కొందరు ఆ పెద్దలే సీనులోకి వచ్చేసి, ఎవ్వరికీ సమాచారం ఇవ్వకుండా కొత్త ప్రభుత్వానికి, గౌరవ డిప్యూటీ సీఎం పవన్ కల్యాణ్ గారిని కలసి అభినందనలు చెప్పడానికి సోమవారం వెళుతున్నట్లు తెలిసింది. నిజానికి అభినందనలు చెప్పడానికి వారు వెళుతుండటం మహదానందమే. అయితే వారి వరకే వారు గిరిగీచుకోకుండా, ఇతర చిన్న నిర్మాతలను కూడా కలుపుకుని వెళి తే బావుండేది. వీళ్ళు ప్రవర్తిస్తున్న పద్ధతులను చూస్తుంటే వాళ్లలో ఇక మార్పు రాదు అనిపిస్తోంది.
సినీ పరిశ్రమ మనుగడకు పెద్ద సినిమాలతో పాటు మధ్యతరహా బడ్జెట్, చిన్న బడ్జెట్ సినిమాలు అత్యంత ఆవశ్యకం. తెలుగు సినీ పరిశ్రమలో ఎనభై శాతం చిన్న సినిమాల నిర్మాణమే సాగుతుంటుంది. వీటిని ఆధారం చేసుకుని ఎంతోమంది జీవిస్తున్నారు. ఇంతటి ప్రాధాన్యం సంతరించుకున్న చిన్న సినిమా అనేక ఆటుపోట్లను ఎదుర్కుంటోంది. నిర్లక్ష్యానికి గురవుతోంది. ఏపీలోని గత ప్రభుత్వం వల్ల చిత్ర పరిశ్రమకు ఒరిగింది ఏమీ లేదు. అప్పట్లో కూడా ప్రభుత్వం చర్చలకు పిలిచినపుడు ఎవరైతే సినీ పెద్దలు వెళ్లారో…. ఇప్పుడొచ్చిన కొత్త ప్రభుత్వం వద్దకు కూడా ఆ పెద్దలే తిరిగి వెళుతున్నారు.
కొత్త ప్రభుత్వానికి, గౌరవ డిప్యూటీ సీఎం పవన్ కల్యాణ్ గారిని కలసి అభినందనలు చెప్పడానికి వారు వెళుతుండటం మహదానందమే. కానీ విభజించు పాలించు రీతిలో కాకుండా తెలుగు ఫిలిం ఛాంబర్, తెలుగు ఫిలిం ప్రొడ్యూసర్స్ కౌన్సిల్ తరపున అఫిషియల్ గా అనౌన్స్ చేసి, చిన్న, మధ్య తరహా బడ్జెట్ నిర్మాతలను కలుపుకుని వెళితే చాలా బావుండేది. గత ప్రభుత్వ హయాంలో మాదిరిగా సినిమా పరిశ్రమ అంటే మేమే అన్న రీతిలో ఒంటెద్దు పోకడలతో ఎలా ప్రవర్తించారో ఇప్పుడు ప్రభుత్వం మారగానే మళ్ళీ సీనులోనికి వచ్చేసి, ఎవ్వరికీ సమాచారం ఇవ్వకుండా కొంతమంది పెద్దలు వారికి వారే వెళ్లాడానికి పూనుకోవడం ఎంతమాత్రం కరెక్ట్ కాదు.
గౌరవ ఏపీ సీఎం శ్రీ చంద్రబాబు నాయుడు గారు, డిప్యూటీ సీఎం శ్రీ పవన్ కల్యాణ్ గారు, ఐటీ, విద్యాశాఖా మంత్రి శ్రీ నారా లోకేష్ గారు వీరి కపట నాటకాన్ని గ్రహించాలి.
గత సీఎం జగన్ కు, నాటి ప్రభుత్వానికి భయపడి, ఏ రోజు అన్యాయాన్ని వీరు ఎదిరించి ఎరుగరు. పరిశ్రమ మేలు కోసం నిలదీసిన దాఖలాలు అసలే లేవు. అరాచక ప్రభుత్వం పోవాలి. కూటమి ప్రభుత్వం రావాలని కనీసం సపోర్ట్ చేయలేకపోయిన వీళ్లంతా మళ్ళీ మేమే సినిమా పరిశ్రమ అంటూ విభజించి పాలిస్తున్నారు. 2014లో శ్రీ చంద్రబాబు నాయుడు గారిని కూడా తప్పుదోవ బట్టించి హైదరాబాద్ ఫిలిం నగర్ కల్చరల్ క్లబ్ వేరు, విశాఖపట్నం ఫిలిం కల్చరల్ క్లబ్ వేరు అంటూ కె.ఎస్.రామారావు గారు డబ్బులు సైతం వసూలు చేశారు. ఈ విషయాలను ఏపీ ప్రభుత్వ పెద్దలు అర్థం చేసుకుని ఎవరికి ఎలాంటి ప్రాధాన్యం ఇవ్వాలో ఆ లోచించాలని కోరుతున్నాను. సినీ పరిశ్రమలోని పెద్ద, చిన్న సినిమా సమస్యలను అందరినీ కలుపుకుని పరిష్కరిస్తారని ఆశిస్తున్నాను” అని నట్టి కుమార్ స్పష్టం చేశారు.
ఇట్లు : మీ నట్టి కుమార్, సీనియర్ నిర్మాత, డిస్ట్రిబ్యూటర్, ఎగ్జిబిటర్