రాత్రి సమయంలో కుటుంబ సభ్యుల తోడు లేకుండా అత్యవసర పరిస్థితిలో ఉన్న కర్ణాటక రాష్ట్రానికి చెందిన ఒక గుర్తు తెలియని గర్భిణి మహిళకు పోలీసులే రక్షణగా ఉండి స్ధానిక మహిళల సహాయంతో పురుడుపోసి తమ గొప్ప మనసును చాటిన ఘటన రాచకొండ కమిషనరేట్, మాడ్గుల పోలీసు స్టేషన్ పరిధిలో జరిగింది.
వివరాల్లోకి వెళితే తేది 05/08/2024 రాత్రి 9.16 గం.లకు మాడ్గుల పోలీసు సిబ్బంది, గ్రామంలో గస్తీ నిర్వహిస్తుండగా ఒక వ్యక్తి డయల్ 100 కు కాల్ చేయడం జరిగింది. సిబ్బంది తిరిగి కాలర్ కి కాల్ చేయగా పెద్ద “మాడ్గుల రైతు వేదిక దగ్గర గుర్తు తెలియని ఒక గర్భిణీ మహిళ ఇద్దరు పిల్లలతో ఉండి ఏమడిగినా సమాధానం చెప్పట్లేదు” అని ఫోన్ చేసిన సదరు వ్యక్తి పోలీసులకు తెలియజేశాడు. గస్తీ పోలిసులు తక్షణమే స్పందించి వెంటనే అక్కడికి చేరుకొని ఆమెను విచారించగా “తన పేరు కుమీ భాయ్ అని, ఊరు పోలేపల్లి, చెంచోలు మండలం, కర్ణాటక రాష్ట్రం అని, వారం రోజుల కింద ఇంటినుండి వచ్చానని, తన భర్త పేరు గిరీష్ అని, ఒక ఫోన్ నంబర్ చెప్పింది.
పోలీసులు ఆ నంబర్ కి ఫోన్ చేయగా ఆ ఊరి పెద్ద మనిషి ఫోన్ లిఫ్ట్ చేసి ఆమె భర్త నా పక్కనే ఉన్నాడని ఆమె గత జూలై 29న ఇంటి నుండి వెళ్లి పోయిందని, చెంచోలు స్టేషన్లో కంప్లైంట్ ఇచ్చామని చెప్పి FIR కాపీ పంపించడం జరిగింది. మేము దగ్గర్లో లేము వాళ్ళ తమ్ముడు రాహుల్ హైదరాబాద్ లో ఉంటాడు అనగా, అతని ఫోన్ నంబర్ తీసుకొని అతనికి సమాచారం అందించి వారికి ఆహారం సమకూర్చిన తర్వాత స్థానిక ఆసుపత్రికి తీసుకువెళ్ళేలోపు తీవ్రమైన పురిటినొప్పులతో భాదపడుతున్న ఆ మహిళకు పెట్రో కార్ అడ్డం పెట్టి వెంటనే స్థానిక మహిళలను పిలిపించి అక్కడే ప్రసూతి చేయడం జరిగింది. తర్వాత తల్లిని మరియు పుట్టిన బాబును స్వయంగా వారి సోదరుడు రాహుల్ తో కలిసి మాల్ వరకు తీసుకెళ్లి అక్కడి నుండి కోఠి మెటర్నిటీ హాస్పిటల్ కి తరలించారు. ప్రస్తుతం తల్లి బాబు ఇద్దరు క్షేమంగా ఉన్నారు.
రాచకొండ కమిషనరేట్ పరిధిలో శాంతి భద్రతల పరిరక్షణ కోసం అధికారులు మరియు సిబ్బంది అహర్నిశలు కృషి చేస్తున్నారని, అత్యవసర పరిస్థితుల్లో తక్షణమే స్పందించేలా డయల్ 100 మరియు 112 ద్వారా అందుబాటులో ఉంటున్నామని పేర్కొన్నారు. సత్వరమే స్పందించి నిబద్దతతో విధులు నిర్వర్తించడంతో పాటు మానవత్వంతో సదరు మహిళకు అండగా నిలిచిన పెట్రో కార్ సిబ్బంది రాజేందర్ PC-3521 మరియు సురేశ్ HG-1906 ను శ్రీ G. సుధీర్ బాబు IPS, CP రాచకొండ గారు మరియు Smt. D.సునితా రెడ్డి, DCP మహేశ్వరం జోన్ గారు అభినందించారు.