శాంతి భద్రతల పరిరక్షణలో పోలీసులు ఆధునిక సాంకేతిక పరిజ్ఞానాన్ని ఉపయోగించుకోవాలి
రాచకొండ కమిషనరేట్ పరిధిలో శాంతి భద్రతల పరిరక్షణ చర్యలలో భాగంగా ప్రస్తుత ఆధునిక సాంకేతికతను అందిపుచ్చుకోవడం ద్వారా ప్రజలకు మరింత సమర్థవంతంగా సత్వర సేవలు అందించే ఉద్దేశంతో స్టేషన్ హౌజ్ అధికారులు మరియు బ్లూ కోల్ట్స్ సిబ్బంది, పెట్రోమొబైల్స్ సిబ్బందికి కమిషనర్ శ్రీ తరుణ్ జోషి ఐపీఎస్ గారు నేరేడ్ మెట్ లోని కమిషనర్ కార్యాలయంలో అధునాతన కంప్యూటర్లు, ల్యాప్ టాప్స్ మరియు టాబ్లెట్స్ అందించారు. సీపీగారి ప్రత్యేక చొరవతో ఈ కార్యక్రమం కొరకు సుమారు 1.33 కోట్ల రూపాయల వ్యయంతో కొనుగోలు చేసిన 170 ట్యాబ్లెట్స్, 18 ల్యాప్ టాప్స్ , 80 అధునాతన డెస్క్ టాప్ కంప్యూటర్లను వివిధ స్టేషన్లకు అందించడం జరుగుతుంది.
ఈ కార్యక్రమంలో కమిషనర్ శ్రీ తరుణ్ జోషి ఐపిఎస్ గారు మాట్లాడుతూ… లోక్ సభ ఎన్నికలను ఎటువంటి అవాంఛనీయ సంఘటనలు లేకుండా ప్రశాంతంగా నిర్వహించడంలో సమర్థవంతంగా పనిచేసిన అన్ని విభాగాల రాచకొండ పోలీసు సిబ్బందికి అభినందనలు తెలియజేశారు. ప్రస్తుత డిజిటల్ ప్రపంచంలో జరుగుతున్న నేరాలను అరికట్టేందుకు ఆధునిక సాంకేతికతను సమర్థవంతంగా ఉపయోగించుకోవాలని కమిషనర్ పేర్కొన్నారు. వివిధ నేరాల్లో బాధితుల ఫిర్యాదుల నమోదులో ఎటువంటి సాంకేతికపరమైన జాప్యం లేకుండా చూడడానికి మరియు పోలీసుల దైనందిన విధి నిర్వహణలో మరియు వివిధ కేసుల విచారణలో ఉపయోగపడేలా అత్యాధునిక సాప్ట్ వేర్ కలిగిన ట్యాబ్లెట్స్, డెస్క్ టాప్ కంప్యూటర్లు, మరియు ల్యాప్ టాప్స్ అందిస్తున్నామని తెలిపారు. పోలీసు శాఖలో పనిచేస్తున్న ప్రతీ ఒక్కరికీ సాంకేతిక పరిజ్ఞానం ఉండాల్సిన అవసరం ఉందని పేర్కొన్నారు. సాధారణ నేరాలతో పాటుగా, రోజు రోజుకూ పెరిగిపోతున్న సైబర్ నేరాలను అరికట్టేందుకు సాంకేతిక పరిజ్ఞానం ఉండాల్సిన అవసరం ఉందని పేర్కొన్నారు. ప్రస్తుతం శిక్షణలో ఉన్న కానిస్టేబుళ్లలో అధికశాతం సాంకేతిక పరిజ్ఞానం కలిగిన ఉన్నత విద్యావంతులు కావడం మంచి పరిణామం అని తెలిపారు. ప్రజలకు సత్వర సేవలు అందించే లక్ష్యంతో ప్రతీ ఒక్కరూ పని చేయాలని, శాంతి భద్రతల పరిరక్షణ తమ బాధ్యతగా భావించాలని పేర్కొన్నారు.
ఈ కార్యక్రమంలో జూలై ఒకటవ తేదీ నుంచి భారత ప్రభుత్వ నూతన నేర న్యాయ చట్టాలు-2023 అమలులోకి రానున్న తరుణంలో పలు కేసుల దర్యాప్తు మరియు విచారణలో పాటించవలసిన నూతన విధానాల మీద సిబ్బందికి అవగాహన కల్పించేందుకు భారతీయ న్యాయ సంహిత, భారతీయ నాగరిక్ సురక్ష సంహిత, భారతీయ సాక్ష్య అధినియం లకు సంబంధించిన పలు చట్టాల న్యాయశాస్త్ర గ్రంథాలను రాచకొండ కమిషనరేట్ పరిధిలోని డిసిపిలు, అదనపు డీసీపీలు, ఏసిపిలు మరియు ఇతర పోలీసు విభాగాలకు అందించడం జరిగింది. ఈ నూతన నేరన్యాయచట్టాల మీద సిబ్బంది అందరికీ సంపూర్ణ పరిజ్ఞానం మరియు అవగహన కల్పించేందుకు లా అండ్ ఆర్డర్ విభాగంతో పాటు అన్ని విభాగాల ఉన్నతాధికారులతో పాటు అన్ని స్థాయిల సిబ్బందికి జోన్ల వారీగా శిక్షణ కార్యక్రమాలు నిర్వహిస్తామని తెలిపారు.
ఈ కార్యక్రమంలో డీసీపీ అడ్మిన్ ఇందిర, డీసీపీ క్రైమ్ అరవింద్ బాబు, సైబర్ క్రైమ్ డీసీపీ చంద్ర మోహన్, అదనపు డీసీపీ నరసింహారెడ్డి, ఏసిపి ఐటీ సెల్ నరేందర్ గౌడ్, పలు స్టేషన్ల హౌజ్ అధికారులు, పెట్రోల్ కార్, బ్లూ కోల్ట్స్ సిబ్బంది మరియు ఇతర అధికారులు పాల్గొన్నారు.