PM Narendra Modi Appreciated to MP Joginapally Santhosh Kumar, Green india Challenge, CM KCR Vriksha Vedam, Telangana News,
గ్రీన్ ఇండియా ఛాలెంజ్ కార్యక్రమానికి, ఎం.పీ జోగినపల్లి సంతోష్ కుమార్ కు ప్రధాన మంత్రి నరేంద్ర మోడీ ప్రశంస.
గ్రీన్ ఇండియా ఛాలెంజ్ అద్భుతమైన కార్యక్రమం. పచ్చదనం పెంపు దిశగా యువతకు మార్గనిర్దేశం
ప్రకృతితో మన అనుబంధాన్ని తెలిపిన పుస్తకం – వృక్ష వేదం, అందరూ చదవాలి. ప్రేరణ పొందాలి
పచ్చదనం పెంపు అవసరాన్ని, అనివార్యతను దేశ వ్యాప్తంగా ప్రతీ ఒక్కరిలో స్ఫురింపచేస్తున్న గ్రీన్ ఇండియా ఛాలెంజ్ కార్యక్రమం అభినందనీయం అన్నారు ప్రధాన మంత్రి నరేంద్ర మోడీ. గ్రీన్ ఇండియా ఛాలెంజ్ గురించి తెలుసుకున్న తనకు మనసు ఉప్పొంగిందని, కార్యక్రమాన్ని ప్రశంసిస్తూ రాజ్యసభ ఎం.పీ జోగినపల్లి సంతోష్ కుమార్ కు ప్రత్యేకంగా ప్రధానమంత్రి లేఖ రాశారు. పచ్చదనం పెంచటంతో పాటు, పరిశుభ్రత అవసరాన్ని అందరికీ తెలియచేస్తున్న గ్రీన్ ఇండియా ఛాలెంజ్ ను మొదలు పెట్టి, కొనసాగిస్తున్నందుకు ఎం.పీకి ప్రత్యేకంగా శుభాకాంక్షలు తెలిపారు.
భూమాతను, ప్రకృతిని పూజించటం ఆది నుంచీ మన సంప్రదాయాలు, సంస్కృతిలో భాగమని, ఆ స్పూర్తిని ప్రతీ ఒక్కరిలో నింపేలా గ్రీన్ ఇండియా ఛాలెంజ్ కృషి చేస్తోందన్నారు. మనమందరమూ భూమాత పిల్లలమే అని, ప్రకృతితో సహజీవనం, సమన్యయం జీవనమార్గం కావాలని ప్రధాని ఆకాంక్షించారు. ప్రకృతి పరంగా మన గొప్ప వారసత్వాన్ని కాపాడుకోవటం కోసం కేంద్ర ప్రభుత్వం అనేక చర్యలు తీసుకుంటున్న విషయాన్ని ఈ సందర్భంగా ప్రధాని తన లేఖలో గుర్తు చేశారు. సౌరశక్తి లాంటి సంప్రదాయేతర ఇంధన వనరులకు ప్రోత్సహం, కర్భన ఉద్ఘారాలను తగ్గించేందుకు కృషి, సింగిల్ యూజ్ ప్లాస్టిక్ నిషేధం లాంటి చర్యలన్నీ పర్యావరణ రక్షణకు తోడ్పాటును ఇస్తాయన్నారు. గ్రీన్ ఇండియా ఛాలెంజ్ విశిష్టతను తెలుపుతూ ఎం.పీ సంతోష్ కుమార్ వెలువరించిన వృక్షవేదం పుస్తకం గురించి తన లేఖలో ప్రధాని మోడీ ప్రత్యేకంగా ప్రస్తావించారు. సమాజంలోని ప్రతీ ఒక్కరూ, ముఖ్యంగా యువత వృక్షవేదం పుస్తకాన్ని చదివి, ప్రకృతి ప్రాధాన్యతను తెలుసుకోవాలన్నారు. గ్రీన్ ఇండియా ఛాలెంజ్ లో పాల్గొనటం ద్వారా పచ్చదనాన్ని దేశ వ్యాప్తంగా పెంచాలని ప్రధాని ఆకాంక్షించారు. తద్వారా ఈ కార్యక్రమం మరింత వేగాన్ని, విసృతిని అందు కోవాలన్నారు.
లేఖ ద్వారా గ్రీన్ ఇండియా ఛాలెంజ్ ను అభినందించిన ప్రధాన మంత్రికి ఎం.పీ సంతోష్ కుమార్ ప్రత్యేకంగా కృతజ్ఞతలు తెలిపారు. ప్రధాని ఇచ్చిన ప్రోత్సాహంతో గ్రీన్ ఇండియా ఛాలెంజ్ ను మరింత ముందకు తీసుకువెళ్తామన్నారు.