యాదాద్రి భువనగిరి జిల్లా ఆలేరు మండలంలోని షారాజిపేట గ్రామానికి చెందిన పలువురు అసంఘటిత రంగ కార్మిక నాయకులు, వారి కుటుంబ సభ్యులు జై స్వరాజ్ పార్టీ చేరారు. జై స్వరాజ్ పార్టీకి అనుబంధంగా ఉన్న జై స్వరాజ్ ట్రేడ్ యూనియన్స్ కౌన్సిల్ రాష్ట్ర అధ్యక్షుడు గోలుకొండ రత్నం, రాష్ట్ర కార్యదర్శులు మాటూరి కృష్ణ మోహన్, గోలుకొండ లక్ష్మీ నారాయణ ఆధ్వర్యంలో ఈ అసంఘటిత కార్మికులు, వారి కుటుంబ సభ్యులు సోమవారం పార్టీలో చేరారు. గోలుకొండ రత్నం కార్మిక నాయకులకు జై స్వరాజ్ పార్టీ కండువాలు కప్పి పార్టీలోకి ఆహ్వానించారు. షారాజి పేట గ్రామానికి చెందిన బొల్లం యాదగిరి, చిల్కు శ్రీను, పుట్టల రమేష్, మునిగే చంద్రశేఖర్, జనగాం కిష్టయ్య, కంతి భాస్కర్, కంతి మహేందర్ కుటుంబాలతో పాటు పలువురు జై స్వరాజ్ పార్టీ చేరారు.
ఈ సందర్భంగా జరిగిన సమావేశంలో గోలుకొండ రత్నం జై స్వరాజ్ పార్టీ సిద్ధాంతాలు, అసంఘటిత రంగంలోని కార్మికుల సంక్షేమం, వారి అభివృద్ధి కోసం పార్టీ చేస్తున్న కృషి గురించి వివరించారు. పేదలు లేని సమాజ నిర్మాణమే లక్ష్యంగా తమ పార్టీ పని చేస్తోందని, నేడు పేదరికమే అన్ని సమస్యలకు ప్రధాన కారణమని, సంపద సమ పంపిణీ ద్వారానే ఇది సాధ్యం అని గోలుకొండ రత్నం అన్నారు. ఇందులో భాగంగా రాష్ట్రంలోని ప్రతి కుటుంబానికి కుటుంబ ధీమా కోసం నెలకు పదివేల నూటా పదహారు రూపాయలు ఇవ్వాలని జై స్వరాజ్ పార్టీ డిమాండ్ చేస్తోందని, తాము అధికారంలోకి వచ్చిన వెంటనే “కుటుంబ ధీమా” పథకాన్ని అమలు చేస్తామని ఆయన తెలిపారు. ఈ పథకం ద్వారా పేదరిక నిర్మూలనకు అడుగులు పడతాయని, ఫలితంగా కుల మత జాతి లింగ వర్ణ వివక్ష లేని ఉత్తమ సమాజ నిర్మాణానికి దారులు పడతాయని, ఈ ఉన్నత ఆశయంతోనే తమ పార్టీ జాతీయ అధ్యక్షుడు కాసాని శ్రీనివాసరావు గౌడ నిరంతరం పని చేస్తున్నారని ఆయన పేర్కొన్నారు.
రాష్ట్రంలోని అసంఘటిత కార్మికులకు గుర్తింపు కార్డులు ఇచ్చి ప్రతి నెలా కనీసం పది వేతనంతో కూడిన పని దినాలు ప్రభుత్వం కల్పించాలని ఇప్పటికే జై స్వరాజ్ పార్టీ ప్రభుత్వాన్ని కోరిందని రత్నం గుర్తు చేశారు. తాము అసంఘటిత రంగంలోని కార్మికుల సంక్షేమం కోసం చేస్తున్న పోరాటాలను చూసి కార్మిక కుటుంబాలు తమ వెంట నడుస్తున్నాయని అన్నారు. జేఎస్టీయూసీ ఆధ్వర్యంలో ఇప్పటికే ఆలేరు మండలంలోని అనేక గ్రామాల్లో అసంఘటిత కార్మికుల సంక్షేమం కోసం పలు కార్యక్రమాలు చేశామని, అలాగే వారి హక్కుల కోసం పోరాడుతున్నామని ఆయన అన్నారు.
ఆలేరు మండల జేఎస్టీయూసీ కార్యదర్శిగా బొల్లం యాదగిరిని గోలుకొండ రత్నం నియమించారు. మండలంలోని కార్మిక హక్కుల కోసం నిరంతరం శ్రమించే యాదగిరిని కార్యదర్శిగా నియమించడం తనకు సంతోషంగా ఉందని రత్నం అన్నారు. త్వరలోనే జై స్వరాజ్ పార్టీ మండల కమిటీని నియమిస్తామని, వెంటనే అన్ని గ్రామాల పార్టీ కమిటీలను ప్రకటిస్తామని ఆయన అన్నారు. అదే క్రమంలో కార్మిక విభాగం కమిటీలు ప్రకటిస్తామని చెప్పారు. ఈ కార్యక్రమంలో మాటూరి కృష్ణ మోహన్, గోలుకొండ లక్ష్మీ నారాయణ, బొల్లం యాదగిరి, ఇతర కార్మిక నాయకులు మాట్లాడారు.