Movie మనీలాండరింగ్ కేసులో సుకేశ్ చంద్రశేఖర్ ప్రధాన నిందితుడిగా ఉన్న రూ.200కోట్ల దోపిడీ కేసులో బాలీవుడ్ నటి నోరా ఫతేహీని దిల్లీ పోలీసులు ప్రశ్నించారు. దిల్లీ పోలీసు ఆర్థిక నేరాల విభాగం.. ఆమెను నాలుగు గంటల పాటు ప్రశ్నించినట్లు అధికారులు వెల్లడించారు.
ఈ కేసులో గతంలోనూ నోరా ఫతేహీ విచారణ ఎదుర్కొన్న విషయం తెలిసిందే. మరో బాలీవుడ్ నటి జాక్వెలిన్ ఫెర్నాండెజ్‌తో పాటు నోరా ఫతేహీకి కూడా సుకేశ్ ఖరీదైన బహుమతులు ఇచ్చినట్లు ఈడీ విచారణలో తేలింది. దీంతో ఎన్ఫోర్స్మెంట్ డైరెక్టరేట్ అధికారులు గతంలో సుకేశ్, నోరాను ముఖాముఖీ కూర్చోబెట్టి విచారించారు. అందుకు సంబంధించిన వివరాలను ఈడీ తమ ఛార్జ్‌షీట్‌లో పేర్కొంది.
అయితే డిసెంబరు 12, 2020కి ముందు తాను సుకేశ్‌తో మాట్లాడలేదని నోరా ఫతేహీ దర్యాప్తు అధికారులు తెలిపింది. కానీ, సుకేశ్ మాత్రం తాను నటితో మాట్లాడినట్లు చెప్పడం గమనార్హం. నోరాకు సుకేశ్ ఓ లగ్జరీ బీఎండబ్ల్యూ కారును బహుమతిగా ఇచ్చినట్లు ఈడీ గుర్తించింది. అయితే ఈ కారును తాను తిరిగిచ్చేసినట్లు నటి విచారణ సమయంలో చెప్పింది.