బయట ఉండాల్సిన బోర్డును ఆఫీసు లోపల పెట్టారు – గల్ఫ్ బాధితులను గేటు వద్దనే అడ్డుకుంటున్న భద్రతా సిబ్బంది
విదేశీ వ్యవహారాల మంత్రిత్వ శాఖ ఆధ్వర్యంలో పనిచేసే ప్రొటెక్టర్ అఫ్ ఎమిగ్రంట్స్ – పిఓఇ (వలసదారుల పరిరక్షకులు), క్షేత్రీయ ప్రవాసి సహాయత కేంద్రం – కేపీఎస్కే అనే రెండు వ్యవస్థల కార్యాలయాలను కలిపి సికిందరాబాద్ పాస్ పోర్ట్ ఆఫీస్ కాంప్లెక్స్ లోని రెండో అంతస్తులో నిర్వహిస్తున్నారు.
విదేశాంగ శాఖ కార్యాలయాల చిరునామాను, వివరాలను సూచించే నేమ్ బోర్డులు లేకపోవడం వలన గల్ఫ్ వలసదారులు, వారి కుటుంబ సభ్యులు అయోమయానికి గురవుతున్నారు. కొత్తగా గల్ఫ్ తదితర దేశాలకు వెళ్లాలనుకునే వారితో పాటు ఇప్పటికే గల్ఫ్ తదితర దేశాలలో ఉన్న వలస కార్మికుల కుటుంబ సభ్యులు సలహాలు, సూచనలు పొందడం కోసం, సమస్యలను విన్నవించడం కోసం పిఓఇ ఆఫీస్ ను, ప్రవాసీ సహాయతా కేంద్రాన్ని స్వయంగా సందర్శించడానికి అడ్డంకులు ఎదురవుతున్నాయి.
సికిందరాబాద్ పాస్ పోర్ట్ ఆఫీస్ కాంప్లెక్స్ వెనుక గేటు వద్ద భద్రతాపరమైన ఆంక్షలు ఉండడంతో ఈ కార్యాలయాలకు వెళ్లడం కష్టంగా ఉంది. సులభంగా ఆఫీసుల లోకి ప్రవేశం (వాక్-ఇన్) ఉండేలా, ప్రజలకు అందుబాటులో ఉండేలా తగిన చర్యలు తీసుకోవాలని గల్ఫ్ వలస వ్యవహారాల విశ్లేషకులు, టీపీసీసీ ఎన్నారై సెల్ కన్వీనర్ మంద భీంరెడ్డి విదేశాంగ శాఖ ఉన్నతాధికారులకు ఈమెయిల్ ద్వారా, ‘ఎక్స్’ (ట్విట్టర్) ద్వారా విజ్ఞప్తి చేశారు.