ఆంధ్రప్రదేశ్ ఫిల్మ్ ఛాంబర్ ఆఫ్ కామర్స్ 5వ వార్షిక సర్వసభ్య సమావేశం మరియు 2023-25 సంవత్సరమునకు నూతన కమిటీ ఎన్నిక కార్యక్రమం 10-12-2023వ తేదీ విజయవాడ రోకళ్ల పాలెంలోని విజయ స్కూల్ ఆఫ్ నర్సింగ్ సైన్సెస్ కాలేజీలో జరిగింది. కార్యక్రమంలో నూతన అధ్యక్షుడిగా ఏ. యమ్.రత్నం, ఉపాధ్యక్షులుగా పి.విజయ వర్మ, సిహెచ్.లక్ష్మి నరసింహం, మంతా శ్రీనివాస్ లు, కార్యదర్శిగా జె.వి.మోహన్ గౌడ్, సంయుక్త కార్యదర్శులుగా పి. రమణా రెడ్డి, యన్.యస్.మూర్తి, కోశాధికారిగా యం.శ్రీనాథరావు EC మెంబర్లుగా ప్రొడ్యూసర్ విభాగం నుంచి పి.డి.ఆర్. ప్రసాద్ రెడ్డి, వి.వి.రామానుజం, మిత్తాన ఈశ్వర రావు, యు.వెంకట్ రావు, రవీంద్ర గోపాల, డిస్ట్రిబ్యూటర్ విభాగం నుంచి కె.రవీంద్రనాథ్ ఠాగూర్ బాబు, ఆర్.వి.యన్.వరప్రసాద్, మిర్జా అబీద్ హుస్సేన్, స్టూడియో విభాగం నుంచి బి. హనుమంతరావు ఎన్నికైనట్లు ప్రకటించారు.. అధ్యక్షులు అంబటి మధుమోహన కృష్ణ , వ్యవస్థాపక అధ్యక్షులు ఆ.వి.భూపాల్ ప్రసాద్ నూతన అధ్యక్షులు ఏ. యమ్.రత్నం కు బాధ్యతలను అప్పజెప్పడం జరిగినది.
ఈ సందర్భంగా అధ్యక్షులు మధుమోహన కృష్ణ మాట్లాడుతూ… మీరందరి సహకారంతో ఛాంబర్ ను ముందుకు నడిపించామని, మా టైమ్ లో ఛాంబర్ కు ఒక సొంత కార్యాలయం సంపాదించడం ఆనందంగా ఉందని, ఛాంబర్ అభివృద్ధి చెందాలంటే అందరూ సహకరిస్తేనే అది సాధ్యమని తెలిపారు.. నూతన అధ్యక్షులు ఏ. యమ్.రత్నం మాట్లాడుతూ నేను ప్రొడక్షన్ లో బిజీగా ఉన్నప్పటికీ కొంతమంది మోహన్ గౌడ్ మరియు కొంతమంది నన్ను సంప్రదించగా నూతన రాష్ట్రంలో కూడా చిత్ర పరిశ్రమను అభివృద్ధి చేయాల్సిన బాధ్యత మనకు ఉంది గనుక ఓకె చెప్పానని , చిత్ర పరిశ్రమను నమ్ముకున్న వ్యక్తిగా నావంతు నేను చిత్తశుద్ధితో పని చేస్తానని, దానికి అందరి సహకారం కావాలని కోరారు.
కార్యదర్శి జె.వి.మోహన్ గౌడ్ మాట్లాడుతూ… ఇప్పటివరకు ఛాంబర్ అధ్యక్షులుగా ముగ్గురు హేమాహేమీలు ఎన్నికయ్యారని మొదటిగా క్రమశిక్షణకు మారుపేరైన భూపాల్ ప్రసాద్ గారు, ఎన్నో సంస్థలలో అధ్యక్షులుగా పనిచేసి విశేష సేవలందించిన మధు మోహన్ కృష్ణ గారు, చిత్ర పరిశ్రమలో ఎన్నో సూపర్ డూపర్ హిట్ చిత్రాలను అందించిన ఏ. యమ్.రత్నం గారు ఇలా ముగ్గురు గొప్ప వ్యక్తులు ఛాంబర్ అధ్యక్షులుగా పనిచేయడం ఏపి ఛాంబర్ కే గర్వకారణమని, మున్ముందు ఛాంబర్ ను మరింత పటిష్టం చేద్దామని తెలిపారు.. ఉపాధ్యక్షులు పి.విజయ వర్మ కార్యక్రమంలో పాల్గొన్న అందరికీ ధన్యవాదములు తెలుపుతూ కార్యక్రమం ముగిసింది.