హైదరాబాద్, మార్చి 6 : తెలంగాణ జర్నలిస్టుల సంక్షేమం కోసం కొత్త పాలసీని తీసుకువచ్చేందుకు ప్రయత్నిస్తామని మహిళా శిశు సంక్షేమ శాఖ, పంచాయితి రాజ్, రూరల్ డెవలప్మెంట్ శాఖా మంత్రి ధనసరి అనసూయ సీతక్క వెల్లడించారు. జర్నలిస్టుల సంక్షేమం, వైద్యం, అభివృద్ధి, వేతనాల పై ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డితో చర్చించి ఒక కొత్త పాలసీ తీసుకురావడానికి కృషి చేస్తానని ఆమె చెప్పారు. “ది జర్నలిస్టు కో ఆపరేటివ్ హౌసింగ్ సొసైటీ లిమిటెడ్” ఆధ్వర్యంలో జూబ్లీ హిల్స్ లోని సొసైటీ కార్యాలయంలో గురువారం అంతర్జాతీయ మహిళా దినోత్సవ వేడుకలు ఘనంగా నిర్వహించారు. ఈ కార్యక్రమానికి ముఖ్య అతిథిగా మంత్రి సీతక్క హాజరైయ్యారు. సైటీలోని సీనియర్ మహిళా జర్నలిస్టులను ఆమె సన్మానించారు. సొసైటీ చరిత్రను, జర్నలిస్టుల కోసం సొసైటీ చేస్తున్నకృషిని అధ్యక్ష్యుడు బ్రహ్మాండభేరి గోపరాజు మంత్రికి వివరించారు.
ఈ సందర్భంగా మంత్రి సీతక్క మాట్లాడుతూ… అంతర్జాతీయ మహిళా దినోత్సవం అంటే ఒక ఉద్యమ ఉత్సాహమని, ఈ రోజుల్లో రకరకాల థీమ్స్ తో మహిళా దినోత్సవం జరుపుకుంటున్నారని అన్నారు. జర్నలిజంలో పని చేస్తున్న మహిళా జర్నలిస్టులు యజమానులుగా ఎదగాలని ఆకాంక్షించారు. వార్తల సేకరణలో అనేక ఒడిదుడుకులను ఎదుర్కొంటున్నారని గుర్తు చేశారు. కుంభకోణాలను బయటికి తీయడానికి కూడా వెనుకాడని ధైర్యవంతులు ఉన్న మీడియా రంగంలో పని చేస్తున్న మహిళలకు సైతం లైంగిక వేధింపులు, వేతనాల్లో అసమానతలు, వివక్షత తప్పడం లేదని ఆమె ఆవేదన వ్యక్తం చేశారు. ప్రజా సమస్యలను ప్రపంచానికి తెలియజేయడంలో మీడియా పాత్ర కీలకం అని చెప్పారు. తెలంగాణ ఉద్యమంలో జర్నలిస్టులు ఎంతో కీలక పాత్ర పోషించారని గుర్తు చేశారు. వివిధ రంగాల్లో సక్సెస్ సాధించిన మహిళల కథనాలను విస్తతంగా ప్రచురించి ప్రచారం చేస్తే ఇంకా మంచిది అనీ, మీ కలం ద్వారా మహిళలను మరింత ప్రొత్సహించాలని అంటూ ఆమె కోరారు.
సమాజంలో ప్రజలకు, ప్రభుత్వానికి వారధిగా ఉంటూ సమస్యల పరిష్కారానికి ఉపయోగపడే కథనాలు రావాలని ఆమె ఆకాంక్షించారు. ఇప్పటి వరకు జర్నలిస్టులకు ఇళ్ళ స్థలాలు ఇచ్చింది కాంగ్రెస్ ప్రభుత్వమేనని అన్నారు. ఆడవారి పట్ల గౌరవం అనేది ఇంటినుంచి ప్రారంభం కావాలనీ, ఇంట్లో పిల్లలకు నేర్పాలి, పాఠశాల్లలో గురువులు నేర్పాలి, పాఠ్యాంశాల్లో చేర్పించాలి అనేది తన అభిమతమన్నారు. అలాగే మహిళ అగౌరవపరిస్తే ఏ రకమైన శిక్షలు ఉంటాయనేది కూడా అందరికీ తెలియాలని అన్నారు. ఈ సందర్భంగా పలువురు మహిళా జర్నలిస్టులను సీతక్క సన్మానించారు. అనంతరం సొసైటీ సభ్యులు, మహిళా జర్నలిస్టులు కలసి సీతక్క ను ఘనంగా సత్కరించారు.
గతంలో మూడు కాలనీలకు కలిపి 36 మంది మహిళా జర్నలిస్టులకు ఇండ్ల స్థలాలను సొసైటీ కేటాయించిందనీ, ఇంకా వందకు పైగా మహిళా జర్నలిస్టులు వెయింటింగ్ లిస్ట్ ఉన్నారని సొసైటీ అధ్యక్షుడు బ్రహ్మాండభేరి గోపరాజు మంత్రి సీతక్క కు గుర్తు చేశారు. వారికి కూడా పట్టాలు ఇప్పించే బాధ్యత సీతక్క తీసుకోవాలని కోరారు. ఈ కార్యక్రమంలో మాజీ ప్రెస్ అకాడమీ ఛైర్మన్ దేవులపల్లి అమర్, ది జర్నలిస్టు కో ఆపరేటివ్ హౌసింగ్ సొసైటీ అధ్యక్షుడు బ్రహ్మండభేరి గోపరాజు, కార్యదర్శి రవీంద్ర బాబు, ఉపాధ్యక్షుడు లక్ష్మి నారాయణ మసాదె, సంయుక్త కార్యదర్శి డా. చల్లా భాగ్యలక్ష్మి, కోశాధికారి భీమగాని మహేశ్వర్ గౌడ్, ఎంసి మెంబర్ కమలాకరా చార్య తోపాటు సీనియర్ జర్నలిస్టులు పాల్గొన్నారు.