తెలంగాణ మున్సిపల్‌శాఖ పట్టణాలు, నగరాల్లో చేపడుతున్న వివిధ కార్యక్రమాలు బాగున్నాయని నేపాల్ అధికారుల బృందం ప్రశంసించింది. ఆయా పథకాలను తమ దేశంలోనూ అమలు చేస్తామని తెలిపింది. 24 మంది సభ్యులతో కూడిన నేపాల్ ప్రతినిధి బృందం శనివారం హైదరాబాద్ మాసాబ్‌ట్యాంక్‌లోని సీడీఎంఏ కార్యాలయాన్ని సందర్శించింది.
మున్సిపల్ నాలెడ్జ్ సెంటర్‌ను తిలకించింది. పట్టణాలు, నగరాల అభివృద్ధికి తెలంగాణ ప్రభుత్వం చేపడుతున్న వివిధ పథకాల గురించి మున్సిపల్‌శాఖ ఉన్నతాధికారులను అడిగి తెలుసుకున్నది. ఈ సందర్భంగా సీడీఎంఏ ఎన్ సత్యనారాయణ రాష్ట్రంలో అమలవుతున్న పట్టణప్రగతితో పాటు వివిధ కార్యక్రమాల గురించి పవర్‌పాయింట్ ప్రజెంటేషన్ ఇచ్చారు. అనంతరం నేపాల్ ప్రతినిధులు మాట్లాడుతూ.. మున్సిపల్ నాలెడ్జ్ సెంటర్ నగరపౌరులు, పరిశోధకులు, పట్టణ ప్రణాళిక సంస్థలకు ఎంతో ఉపయోగపడుతుందని ప్రశంసించారు. మున్సిపాలిటీలకు సంబంధించిన గత చరిత్ర అంతా ఒకే దగ్గర దొరకడం అభినందనీయమని కొనియాడారు.
నేపాల్ ప్రతినిధి బృందంలో ఆ దేశ వాటర్ సప్లయ్ జాయింట్ సెక్రటరీలు తిరేశ్‌ఖత్రి, బాల ముకుందశ్రేష్ఠ, శోవకాంత పౌడెల్, ఖాట్మండువ్యాలీ వాటర్ సప్లయ్ మేనేజ్‌మెంట్ బోర్డు ఈడీ సంజీవ్ విక్రమ్‌రాణా, మున్సిపల్ ఆసోసియేషన్ ఆఫ్ నేపాల్ అధ్యక్షుడు ఆశోక్‌కుమార్ బైంజుశ్రేష్ఠ, ప్రధాన కార్యదర్శి బిమ్‌ప్రసాద్ దుంగానా, వివిధ పట్టణాల మేయర్లు నగేశ్ కోయిరాలా, మీనాకుమారి లామా, ధన్‌రాజ్ ఆచార్య, మోహన్ మాయా బండారి, గోపాల్‌హమాల్ ఉన్నారు.