నందమూరి బాలకృష్ణ, బోయపాటి శ్రీను కాంబినేషన్‌లో వచ్చిన `అఖండ` చిత్రం 20 థియేటర్లలో వంద రోజులు పూర్తిచేసుకుంది. డిసెంబర్ 2న విడుదలై కరోనా సమయంలోనూ ఊహించని విజయాన్ని సాధించడం బాలకృష్ణలోని ప్రత్యేకతగా అభిమానులు తెలియజేస్తున్నారు. అందుకే వందరోజుల వేడుకను కర్నూలులో జరపాలని చిత్ర యూనిట్ నిర్ణయించింది. ఆనందోత్సాహాలతో కర్నూలు, ఎమ్మిగనూరు, పత్తికొండ, ఆదోనీ, విజయవాడ, ఢిల్లీ నుంచి సైతం పెద్ద ఎత్తున అభిమానులు చేరుకున్నారు. చిన్నపిల్లల నుంచి మహిళలు, పెద్దలు సైతం `జైబాలయ్య` అంటూ నినదించారు.
ఈ సందర్భంగా నందమూరి బాలకృష్ణ మాట్లాడుతూ… ఇంతమంది జనాలమధ్య వందరోజుల వేడుక జరుపుకుని ఎన్ని సంవత్సరాలైందో. మేం ఈ సినిమాను ప్రారంభించినప్పుడు సింహా, లెజెండ్‌కు మించి వుండాలని మేం అనుకోలేదు. కరోనా వల్ల ఈ సినిమా షూటింగ్ కొద్దిరోజులు జరగడం మరలా ఆగిపోవడం జరిగింది. విడుదలయ్యాక అఖండ విజయాన్ని ప్రేక్షకులు, అభిమానులు ఇచ్చారు. ఈ అఖండ సినిమా మన హైoదవ సనాతన ధర్మాన్ని మరోసారి గుర్తుచేసేట్లుగా వుంది. ప్రకృతి, ధర్మం, ఆడవారి జోలికి వచ్చి ఎటువంటి అపాయం కలిగించినా భగవంతుడు ఏదో రూపంలో మనిషిలో ప్రవేశించి అవధూతగా మారతాడు. ఆ పాత్ర వేయించి నా ద్వారా దర్శకుడు సందేశం ఇచ్చాడు. అఖండ సినిమాను మన తెలుగువారేకాదు ప్రపంచంలోని అందరూ వేయినోళ్ళ తో పొగిడారు. మీ ద్వారా ఇంతటి అఖండ విజయాన్ని ఇచ్చిన భగవంతునికి కృతజ్ఞతలు తెలియజేసుకుంటున్నా. కృషివుంటే మనుషులు ఋషు లవుతారంటారు. అలా దర్శకుడు బోయపాటి శ్రీను, నేను కథ మూలాల్లోకి వెళ్ళి మంచివి చేయాలని తపనతో కృషి చేస్తుంటాం. దర్శకుడు ఏ కథయినా కట్టె, కొట్టె, తెచ్చె అనే మూడు ముక్కల్లో చెబుతారు. బోయపాటి ఉన్నాడన్న ధైర్యంతో సినిమా చేస్తాను.
ఈ అఖండ సినిమా కోయిలకుంట్ల, ఆదోని, ఎమ్మిగనూరులో వందరోజులు ఆడింది. చిలకలూరిపేటలోనూ ఆడింది. ఇలా కోట్లమంది అభిమానుల్ని సంపాదించుకోవడం పూర్వజన్మ సుకృతం. ఇక నా సినిమాలే నాకు పోటీ. సింహకు పోటీ లెజెండ్. లెజెండ్‌కు పోటీ అఖండ. ముందు ముందు మరిన్ని సినిమాలు మా నుంచి తయారువుతాయి.