వరికి ప్రత్యామ్నాయ పంటల సాగు అత్యవసరం, నూనె గింజలు, పప్పు పంటలవైపు మళ్లాలి, రైతులకు అధికారులు అవగాహన కల్పించాలి, 15 రోజుల్లో పంట మార్పిడిపై నివేదికలివ్వండి, ఐటీ, పరిశ్రమలశాఖ మంత్రి కేటీఆర్ ఆదేశాలు, పప్పులు, నూనె గింజల సాగు రెట్టింపు, ప్రత్యామ్నాయాలపై ఉద్యానశాఖ ప్రణాళిక, రైతు వేదికల ద్వారా రైతులకు అవగాహన, వచ్చే యాసంగి నుంచి ప్రణాళిక అమలు, నేనూ ఆయిల్‌పామ్ సాగుచేస్తా..దొడ్డుబియ్యం కొనేది లేదని కేంద్ర ప్రభుత్వం తేల్చి చెప్తున్నందున రైతులు పంటలు మార్చాలని ఐటీ, పరిశ్రమలశాఖల మంత్రి కే తారకరామారావు పిలుపునిచ్చారు. ఆయిల్‌పామ్, పప్పు, నూనె గింజల పంటల సాగువైపు మళ్లాలని సూచించారు. ముఖ్యంగా ఆయిల్‌పామ్ తోటల సాగులో రాష్ర్టాన్ని అగ్రస్థానంలో నిలుపాలని, తాను కూడా ఆయిల్ పామ్ తోటలను సాగుచేస్తానని చెప్పారు. వరికి బదులుగా ప్రత్యామ్నాయ పంటల సాగును మరింత ప్రోత్సహించాల్సిన అవసరమున్నదని పేర్కొన్నారు.సోమవారం రాజన్న సిరిసిల్ల జిల్లాలో మంత్రి ఆకస్మికంగా పర్యటించి సమీకృత కలెక్టరేట్‌లో వ్యవసాయ శాఖ ఆధ్వర్యంలో ప్రత్యామ్నాయ పంటల సాగుపై ఏర్పాటుచేసిన అవగాహన సదస్సులో పాల్గొన్నారు. వ్యవసాయశాఖ అధికారులు, రైతుబంధు సమన్వయ సమితి ప్రతినిధులకు ప్రత్యామ్నాయ పంటల సాగుపై దిశానిర్దేశం చేశారు. సిరిసిల్ల పట్టణంలో ప్రజల ఫిర్యాదులను స్వీకరించేందుకు రూపొందించిన క్యూఆర్ కోడ్‌ను ఆవిష్కరించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ ముస్తాబాద్ మండలం మోహినికుంట గ్రామంలో 15 ఎకరాల స్థలం తీసుకొని ఆయిల్ పాం తోటను సాగు చేస్తానని చెప్పారు. ఆయిల్ పాం సాగుతో అధిక లాభాలున్నాయని, రైతులకు ప్రభుత్వం సబ్సిడీ కూడా ఇస్తుందని వెల్లడించారు.
అధ్యయనం చేయండి
——————-
ఆయిల్ పాం సాగుపై ఖమ్మం జిల్లా అశ్వరావుపేటలోని తోటలకు స్టడీ టూర్‌కు రైతులను తీసుకెళ్లాలని వ్యవసాయశాఖ అధికారులకు మంత్రి కేటీఆర్ సూచించారు. ప్రజాప్రతినిధులు, రైతుబంధు సమితి ప్రతినిధులు ఆయిల్ పాం తోటల సాగును విజయవంతం చేయాలని కోరారు. ఎల్లారెడ్డిపేటలో ఏర్పాటుచేసిన కస్టమ్ హైరింగ్ సెంటర్ మాదిరిగా జిల్లాలో మరొక సెంటర్‌ను ఏర్పాటుచేయాలని అధికారులను ఆదేశించారు. క్లస్టర్‌లో ఏ గుంటలో ఏ రకం పంట సాగవుతుందన్న విషయం స్పష్టంగా తెలిసి ఉండాలని వ్యవసాయ విస్తరణ అధికారులకు సూచించారు. ఏడాదిలో మూడు కోట్ల టన్నుల వరి ధాన్యం పండించిన ఏకైక రాష్ట్రంగా ఖ్యాతి గడించిందని చెప్పారు. రాష్ట్రంలో 9 లక్షలకు పైగా రైతులకు రుణమాఫీ చేసి ప్రభుత్వం మాట నిలబెట్టుకున్నదని తెలిపారు. మరింత స్వయం సమృద్ధి సాధించేందుకు ప్రత్యామ్నాయ పంటలు సాగుచేసేలా రైతులను ప్రోత్సహించాలని అధికారులకు సూచించారు.
కొత్త పంటలవైపు మళ్లండి
———————–
రాష్ట్రంలో ఎక్కువమంది రైతులు దొడ్డు బియ్యం పండిస్తున్నారని, దొడ్డు బియ్యాన్ని కొనబోమని కేంద్రప్రభుత్వం తేల్చి చెప్పినందున వరికి బదులుగా ప్రత్యామ్నాయ పంటలు సాగుచేయాలని మంత్రి కేటీఆర్ సూచించారు. కొత్త సాంకేతికను అందిపుచ్చుకొని కొత్త పంటల సాగువైపు దృష్టి కేంద్రీకరించాలని వ్యవసాయ విస్తరణ అధికారులను ఆదేశించారు. పంటల సాగులో అధికారులు, నాయకులకంటే రైతులకే ఎక్కువ అనుభవం ఉంటుందని, ఏ పంట వేయాలో వారిని అడిగి తెలుసుకోవాలని కోరారు. రైతులను అడిగి తెలుసుకోవడంలో నామోషీగా ఫీలవకూడదన్నారు. రైతులకు అవగాహన సమావేశాలు ఏర్పాటుచేసి 15 రోజుల్లో పంట మార్పిడిపై నివేదికలు ఇవ్వాలని అధికారులను ఆదేశించారు. వేరుశనగ, పొద్దుతిరుగుడు, కందులు, కూరగాయలు తదితర పంటల సాగుపై దృషి సారించాలని సూచించారు. సమావేశంలో జిల్లా కలెక్టర్ అనురాగ్ జయంతి, ఆర్డీవో శ్రీనివాసరావు, మున్సిపల్ కమిషనర్ సమ్మయ్య, నాఫ్స్‌కాబ్ చైర్మన్ కొండూరి రవీందర్‌రావు, జడ్పీ చైర్‌పర్సన్ న్యాలకొండ అరుణ, రైతుబంధు సమితి జిల్లాధ్యక్షుడు గడ్డం నర్సయ్య, మున్సిపల్ చైర్‌పర్సన్ జిందం కళ, వ్యవసాయశాఖ అధికారి రణధీర్‌రెడ్డి, ఆర్బీఎస్ మండల, గ్రామశాఖల ప్రతినిధులు, వ్యవసాయ విస్తరణ అధికారులు పాల్గొన్నారు.
పంట మార్పిడిపై ఉద్యానశాఖ దృష్టి
———————————
వచ్చే యాసంగిలో వరిసాగును తగ్గించి ఉద్యాన పంటలు పెంచేందుకు ఉద్యానశాఖ సమాయత్తమవుతున్నది. రాష్ట్రంలో సాగుకు అవకాశమున్నప్పటికీ, పూర్తిస్థాయిలో సాగుచేయలేకపోతున్న నూనె గింజలు, పప్పు ధాన్యాల సాగు పెంపుపై ప్రధానంగా దృష్టి కేంద్రీకరించింది. మరో రెండునెలల్లో యాసంగి సీజన్ ప్రారంభం కానున్న నేపథ్యంలో వ్యవసాయ వర్సిటీ, పౌరసరఫరాలశాఖ, తెలంగాణ విత్తనాభివృద్ధి సంస్థతో కలిసి ప్రణాళిక రూపొందిస్తున్నది.
నూనె, పప్పు పంటల సాగు తక్కువే
——————————–
గత యాసంగిలో రాష్ట్రంలో 68.14 లక్షల ఎకరాల్లో పంటలు సాగైతే, పప్పు ధాన్య పంటలు సాగైంది 4.58 లక్షల ఎకరాల్లో మాత్రమే. నూనె గింజల పంటలు 3.70 లక్షల ఎకరాల్లో సాగుచేశారు. ఈ నేపథ్యంలో వరికి ప్రత్యామ్నాయంగా నూనె, పప్పు గింజల సాగును రెట్టింపు చేయాలని అధికారులు నిర్ణయించారు. వేరుశనగ, శనగ పంటలను ఐదారు లక్షల ఎకరాల్లో, పొద్దుతిరుగుడు, నువ్వుల సాగును మూడింతలు పెంచాలని భావిస్తున్నారు. రాష్ట్రంలో 3.34 లక్షల టన్నుల నూనె గింజలు ఉత్పత్తి అవుతుంటే, 12.31 లక్షల టన్నులు వినియోగిస్తున్నారు. ఏటా 6.61 లక్షల టన్నుల పప్పు ధాన్యాలు ఉత్పత్తి అవుతుండగా, వినియోగం 10.65 లక్షల టన్నులుగా ఉన్నది. ప్రస్తుతం నూనె గింజలు, పప్పు ధాన్యాలకు రాష్ట్రంలో భారీగా డిమాండ్ ఉన్నది. దాంతో ఈ రెండు రకాల పంటలను ప్రోత్సహిస్తే రైతులకు ఎంతో మేలు జరగడంతో పాటు వినియోగదారులకు కూడా లాభం ఉంటుందని అధికారులు అంటున్నారు.
ప్రత్యామ్నాయ పంటలకు ప్రణాళిక
——————————
వరికి ప్రత్యామ్నాయంగా ఉద్యాన పంటల సాగును పెంచేందుకు చర్యలు తీసుకొంటున్నాం. నూనె, పప్పు ధాన్యాల సాగుకు ప్రణాళిక రూపొందిస్తున్నాం. రైతు వేదికల ద్వారా రైతులకు అవగాహన కల్పిస్తాం.
-వెంకట్రామిరెడ్డి, ఉద్యానశాఖ డైరెక్టర్
మన రాష్ట్రంలో దొడ్డు వడ్లు పండించే రైతులే ఎక్కువ. కానీ, దొడ్డు బియ్యం ఒక్క గింజ కూడా కొనబోమని కేంద్రప్రభుత్వం ఇప్పటికే తెగేసి చెప్పింది. ఈ ఒక్క కారు వరకు కొనాలని ఢిల్లీకి వెళ్లి అడిగినా ఒప్పుకోలేదు. అందువల్ల రైతులు వరికి బదులు ఆయిల్‌పాం, పప్పు, నూనె గింజల పంటల సాగువైపు మళ్లాలి. ఈ పంటల సాగుపై రైతులకు అవగాహన కల్పించేందుకు అధికారులు చొరవ తీసుకోవాలి. నేను కూడా స్వయంగా 15 ఎకరాల్లో ఆయిల్ పామ్ పంట సాగుచేయాలని నిర్ణయించుకొన్నా.
-ఐటీ, పరిశ్రమల శాఖల మంత్రి కేటీఆర్