మన నంద్యాల ఈరోజు అనంతమైన ఓ జన సముద్రంలా కనిపిస్తోంది. సంక్షేమాన్ని, ఇంటింటి అభివృద్ధిని కాపాడుకునేందుకు ప్రజల సైన్యం ఇక్కడ ఈరోజు నంద్యాలలో ఒక సముద్రంలా సిద్ధం.. అని అంటోంది. గతంలో చంద్రబాబు చేసిన అబద్ధాలు, మోసాల పాలన చూసిన తర్వాత అందుకు భిన్నంగా 5 ఏళ్లుగా మన ప్రభుత్వం చేసిన మంచిని చూశారు. ∙ప్రజాకంటకులు ఓడిన తర్వాత ఒక నరకాసురుడు, ఒక రావణుడు, ఒక దుర్యోధనుడు మరోసారి పైకి లేచి తాను మళ్లీ సింహాసనం ఎక్కుతానంటే ప్రజలు ఎలా ఒప్పుకోరో.. అలాగే నారావారి పాలన మళ్లీ తీసుకువస్తామని ఎవరైనా అంటే ఒప్పుకోము అని చెప్పటానికి నంద్యాల నుంచి ఏలేరు వరకు, కుప్పం నుంచి ఇచ్చాపురం వరకు ప్రజలంతా కూడా సిద్ధంగా ఉన్నారు.
సంక్షేమరాజ్యాన్ని కూలగొట్టాలని ఏకమైన తోడేళ్లు : ప్రజల రాజ్యాన్ని, ఇంటింటి అభివృద్ధిని, రైతు రాజ్యాన్ని, మహిళా పక్షపాత రాజ్యాన్ని, పిల్లల అభివృద్ధి రాజ్యాన్ని, అవ్వాతాతల సంక్షేమ రాజ్యాన్ని కూలగొడదామని మూడు పార్టీలు కూటమిగా చూస్తున్నాయి. వీరికి తోడు.. పరోక్షంగా మరోజాతీయ పార్టీ కూడా వీరికి అదృశ్య హస్తంగా తోడుగా ఉంది. ఇటువైపున చూస్తే జగన్ ఒక్కడే ఒక్కడు. అటువైపున చూస్తే.. ఒక చంద్రబాబు, ఓ దత్తపుత్రుడు, వీరికితోడు ఒక బీజేపీ అనే జాతీయ పార్టీ, పరోక్షంగా మరో కాంగ్రెస్ పార్టీ.. వీరందరూ సరిపోరు అన్నట్టు ఓ ఈనాడు, ఆంధ్రజ్యోతి, టీవీ5.. ఇంత మంది తోడేళ్లు ఏకమయ్యారు.
కేవలం ఒకే ఒక జగన్ను ఎదుర్కొనేదానికి, ఒకే ఒక మీ అన్నను, మీ బిడ్డను, మీ తమ్ముడిని ఎదుర్కొనేందుకు వీరందరూ తోడయ్యారు. వీరందరినీ కూడా అడ్డుకునేందుకు మీరంతా కూడా.. సిద్ధమేనా.. అని అడుగుతున్నాను. పేదవాడి భవిష్యత్తును వెలుగు నుంచి చీకటి వరకు తీసుకుపోదామని పొత్తులమారి, జిత్తులమారి, ఎత్తులమారి పార్టీలన్నీ కూడా కుట్రలు చేస్తున్నాయి. కుతంత్రాలు చేస్తున్నాయి. ఆ కుట్రలను, ఆ కుతంత్రాలను ఎదుర్కొనేందుకు మీరంతా కూడా సిద్ధమేనా.. అని అడుగుతున్నాను.
డబుల్ సెంచరీ సాధించేందుకు : మరోసారి ఫ్యానుకు రెండు ఓట్లు వేసి, వేయించి 175కు 175 అసెంబ్లీ స్థానాలు, 25 ఎంపీలకు 25 ఎంపీ స్థానాలు.. మొత్తంగా 200 స్థానాలకు మొత్తంగా 200 స్థానాలు సాధించేందుకు, సాధించి డబుల్ సెంచరీ సర్కార్‌ను స్థాపించేందుకు మీరంతా కూడా సిద్ధమేనా.. అని అడుగుతున్నాను. ఈసారి జరిగే ఎన్నికలు కేవలం ఎమ్మెల్యేలను, ఎంపీలను మాత్రమే ఎన్నుకునేందుకు జరిగే ఎన్నికలు కావు. ఎమ్మెల్యేలను, ఎంపీలను మాత్రమే ఎన్నుకునే తతంగం మాత్రమే కాదు. ఈసారి జరగబోయే ఈ ఎన్నికల్లో మన ఓటు వేసి మన 5 ఏళ్ల ఇంటింటి ప్రగతిని, ఇప్పుడు జరిగిన మన ఇంటింటి ప్రగతిని వచ్చే 5 సంవత్సరాలు కూడా ముందుకు తీసుకువెళ్తూ కొనసాగించాలా? లేక చంద్రబాబుకు ఓటేసి 10 సంవత్సరాలు వెనక్కు వెళ్లాలా అన్నది ప్రతి ఒక్క కుటుంబం కూడా ఈ ఓటు ద్వారా బాగా ఆలోచన చేయాల్సిన సమయం వచ్చింది.
ఎవరి పాలనలో మంచి జరిగిందో ఆలోచించి ఓటేయండి : ప్రతి ఇంట్లో ఉన్న ప్రతి ఒక్కరూ కూడా ఆలోచన చేయమని కోరుతున్నాను. అందరూ ఆలోచన చేయండి. గత ఎన్నికల్లో ఇతర పార్టీలకు ఓటు వేసిన వారు కూడా ఆలోచన చేయమని కోరుతున్నాను. కులం వల్ల కావచ్చు, లేదా ఇతర పార్టీ అభిమానం అయినా కావచ్చు, నిరుడు ఎన్నికల్లో మనకు ఓటు వేయని వారందరూ కూడా ఆలోచన చేయమని అడుగుతున్నాను. ఈ ఎన్నికల్లో వేసే ఈ ఓటు కేవలం ఎమ్మెల్యేలను, ఎంపీలను ఎన్నుకునే ఓటు కాదు. ఈ ఓటుతో మన తలరాతలు మనమే రాసుకునే ఓటు ఇది. అందుకే ప్రతి ఒక్కరినీ అడుగుతున్నాను. ప్రతి ఒక్కరూ కూడా చివరకు మనకు ఓటు వేయని వారందరినీ కూడా అడుగుతున్నాను. ప్రతి ఒక్కరూ కూడా మీకు మీ కుటుంబానికి ఎవరి పాలనలో మంచి జరిగిందన్నది ఆలోచన చేయమని కోరుతున్నా. ఓటు వేసే ముందు ఆలోచన చేయమని అడుగుతున్నాను.
మోసాల బాబుకి ఇవే చివరి ఎన్నికలు కావాలి : ఈ ఎన్నికలతో మీ కుటుంబాల భవిష్యత్తు అన్నది నిర్ణయం అవుతుందన్నది ప్రతి ఒక్కరూ గుర్తు పెట్టుకోమని కోరుతున్నాను. ఈ ఎన్నికలు మంచి చేసిన మనకు ఓ జైత్రయాత్ర అయితే, మోసాల బాబు పార్టీకి ఈ ఎన్నికలు చివరి ఎన్నికలు కావాలి అని ఇక్కడి నుంచి పిలుపునిస్తున్నాను. మీరే గమనించండి. మీరు నమ్మి అధికారం నాకు ఇచ్చినందుకు మీ జగన్.. ఈ 5 ఏళ్లలో 77 ఏళ్ల స్వతంత్ర భారత దేశంలో ఏ ఒక్క ప్రభుత్వం కూడా తీసుకురాని ఎన్ని మంచి మార్పులు తీసుకొచ్చాడో మీకే కనిపిస్తోంది. మీ కళ్ల ఎదుటే మీ గ్రామాల్లో, మీ ఇంటి బయటే కనిపిస్తోంది. మచ్చుకు అందులో కొన్ని మార్పుల్ని మీ ముందు ఈరోజు ఉంచుతున్నాను. ఈ మార్పులకు ప్రజలంతా కూడా మద్దతు పలకడం ఎంత అవసరమో ఒక్కసారి మీరే గమనించమని కోరుతున్నాను. మీరే చెప్పండి అని కోరుతున్నాను.